- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో..
సమాజంలో ఏ మార్పు రావాలన్నా అది మధ్య తరగతితోనే సాధ్యం. అందులో విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు మరి ముఖ్యం. వీరి పాత్రనే తెలంగాణ ఉద్యమంలో కీలకం. అలాంటి వారు మరోసారి ఏకమై వారిలో దాగి ఉన్న నిరాశ, నిస్పృహలు ఎన్నికల్లో అగ్నిపర్వత విస్ఫోటనం వలె బహిర్గతమై ప్రతిపక్షాన్ని అధికారపక్షంలో కూర్చోబెట్టింది.
ఎవరు అవునన్నా, కాదన్నా ఉద్యోగులు, నిరుద్యోగుల మద్దతుతోనే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. అయితే వారందరినీ సంతృప్తి పరచడం కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సామే. అయినప్పటికీ కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరంలో జనవరి రెండో తేదీనే ఉద్యోగులకు వేతనాలు జమచేసి వారి ఆశల పల్లకీకి ఊపిరి పోసింది. దాంతో ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంపై ఆశలు చిగురించాయి. వారు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.
ముఖ్యమైన హమీలు నెరవేర్చి..
ఫిబ్రవరి మధ్యలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ప్రభుత్వం, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనుకున్నా మే నెల వరకు నెరవేర్చలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఊపిరి పీల్చుకునే లోపే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా నిర్వహించాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం దాదాపుగా ఆగస్ట్ చివరి వరకు ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ వేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆ తరువాత మునిసిపాలిటీ ఎన్నికలు వస్తాయి. దీంతో ఉద్యోగులకు, నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే సమయం దొరకకపోవచ్చు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను వెంటనే తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలంటే ముందుగా వీరి అభిమానాన్ని మరింత ఎక్కువ పొందాలి. దానికోసం తక్షణమే సాధ్యమైనన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యంత ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులు ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని బలంగా ప్రచారం చేయడం వల్లనే రాష్ట్రంలో దాదాపు 100కు పైగా స్థానాలలో పోస్టల్ బ్యాలెట్‌లో ప్రతిపక్ష పార్టీకి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు, నిరుద్యోగులకు తాను ఇచ్చిన హామీలలో అత్యంత ముఖ్యమైనవి అమలు చేస్తే రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని, దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
విశ్వాసం పెంచాలి..
నిరుద్యోగుల కోసం తక్షణమే 20,000 పోస్టులు ఉండే విధంగా అనుబంధ డీఎస్‌సీ నోటిఫికేషన్ వేయాలి. దీనికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్స్ ప్రక్రియను పూర్తి చేయాలి. కనీసం 3000 పోస్టులతో గ్రూప్-II ఉండే విధంగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి. కనీసం 1000 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ వేయాలి. ఇంకా అన్ని శాఖలలో సాధ్యమైనన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలి. యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏ నోటిఫికేషన్ వేసిన సమగ్రమైన వివరాలతో కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా లేకుండా నోటిఫికేషన్స్ వేయాలి. ఇక ఉద్యోగుల విషయంలో ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే సీపీఎస్ రద్దు చేయాలి. సీపీఎస్ రద్దు కన్న ముందే ఉద్యోగి, ప్రభుత్వం జమచేసే కాంట్రిబ్యూషన్ నిలిపివేసి ఉద్యోగుల్లో విశ్వాసం పెంచాలి. సీపీఎస్ రద్దుకు సాంకేతిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ విషయన్ని పీఆర్‌సీ కమిటీకి అప్పచెప్పి 15 రోజులలో మధ్యంతర నివేదిక అందచేసే విధంగా చర్యలు తీసుకోని పీఆర్‌సీ కమిటీ ద్వారా సీపీఎస్ రద్దు చేయిస్తే తక్షణమే సీపీఎస్ రద్దు జరుగుతుంది. పీఆఫ్‌ఆర్‌డిఏ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రక్రియ అంతా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలి. ఫిబ్రవరి నేలలోనే సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నిలిపివేసి జీపీఎఫ్ ఖాతాలు తెరవడానికి ఉత్తర్వులు విడుదల చేసి, అమలుకు చర్యలు తీసుకోవాలి. తక్షణమే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేసి జనవరి నెల జీతంలో చెల్లించే విధంగా జీఓలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఉద్యోగులు, అధికారుల కమిటీతో హెల్త్ కార్డ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించేలా, అన్ని రోగాలకు తక్షణమే వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. 317 బాధితులకు ఉపాధ్యాయ ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అందరికీ స్థానికత ఆధారంగా న్యాయం చేస్తాం అని భరోసా ఇవ్వాలి. పండిట్, పీఈటి సమస్యను సాగదీయకుండా ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానైనా తక్షణమే పరిష్కరించాలి.
ఈ బాధ్యత ప్రభుత్వానిదే!
అనేక శాఖలలో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిపై సుమారు లక్ష వరకు ఉద్యోగులు పని చేస్తుంటారు. వారందరికీ సత్వర న్యాయం చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 27000 మంది వివిధ స్థాయిల్లో అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారు. వారి సేవలను రెగులరైజేషన్ చేస్తన్న గత ప్రభుత్వం మాటలు నీటిమీద ముటలైనాయి. కనీసం కొత్త ప్రభుత్వమైన వారి ఆశలు నేరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కొండంత ఆశతో ఉన్నారు. ఒక వైపు నిరుద్యోగులు, మరొక వైపు ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా నెరవేర్చాలి. వారి ఆశల పల్లకీకి రెక్కలు తొడగాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదే.
జుర్రు నారాయణ యాదవ్
తెలంగాణ టీచర్స్ యూనియన్
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
94940 19270