అర్థవంతమైన సినిమా హిందీ మీడియం

by Ravi |   ( Updated:2023-02-24 19:00:21.0  )
అర్థవంతమైన సినిమా హిందీ మీడియం
X

భారత రాజ్యాంగంలోని 350ఏ అధికరణం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో బోధించడానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసినదిగా రాష్ట్రాలకు సూచిస్తోంది. కానీ దాదాపుగా అన్ని ప్రభుత్వాలూ దానిని అమలు చేయడం లేదు. పైగా మాతృభాషను పాఠశాల విద్యా మాధ్యమం నుంచి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం. అయితే ఆంగ్లాన్ని రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తోడు ఆంగ్లానికి అనుకూలంగా జరుగుతున్న ప్రచారాలు తల్లిదండ్రుల్ని కూడా ఆంగ్ల వ్యామోహం వైపునకు నెట్టివేస్తున్నాయి. పోటీ తత్వంతో పాటు తల్లిదండ్రుల్లో పెరిగిన ఆశలు అంచనాల నేపథ్యంలో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మాధ్యమంలో చదివించాలనే ఆశలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. అట్లా చదివించడానికి తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్లడానికి, తప్పులు చేయడానికి సిద్ధపడడం మనం చూస్తున్నాం. అట్లా అత్యాశతో తమ కూతురును ఢిల్లీ గ్రామర్ స్కూల్లో చదివించాలని ప్రయత్నించిన ఓ జంట కథే ‘హిందీ మీడియం’.

మాతృ భాష, మాతృ మూర్తి, మాతృ దేశం మానవ జీవితంలో గొప్ప భావనలు. వాటి గురించి అందరూ భావనాత్మకమయిన అనుబంధాన్ని కలిగివుంటారు. అంతేకాదు, మాతృభాషలో చదివిన చదువులు నాణ్యమైనవని, విద్యనేర్చుకోవడానికి మాతృభాష మూలమని యునెస్కో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు అనేక ఏళ్లుగా చెబుతున్నాయి. విద్యాబోధనలో అది చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మాతృభాష ఎంతో అవసరం. పిల్లలు తమని తాము వ్యక్తం చేసుకునేందుకు కూడా మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. మాతృభాషా మాధ్యమంలో విద్య పిల్లలను చిన్నప్పటి నుంచీ తమ చుట్టూ ఉన్న సమాజంతో కలిసిమెలిసి పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది పరస్పర అవగాహనకూ పనికొస్తుంది, చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది. అమ్మ భాషలో పొందుపరిచిన సాంస్కృతిక సామాజిక సమతా వారసత్వ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుంది. భారత రాజ్యాంగంలోని 350 ఏ అధికరణం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో బోధించడానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసినదిగా రాష్ట్రాలకు సూచిస్తోంది.

పోటీతత్వంతో పెరిగిన ఆశలు

అయితే ఈ నిబంధనను దాదాపుగా అన్ని ప్రభుత్వాలూ అమలు చేయడం లేదు పైగా మాతృభాషను పాఠశాల విద్యా మాధ్యమం నుంచి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం. అయితే ఆంగ్లాన్ని రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తోడు ఆంగ్లానికి అనుకూలంగా జరుగుతున్న ప్రచారాలు తల్లిదండ్రుల్ని కూడా ఆంగ్ల వ్యామోహం వైపునకు నెట్టి వేస్తున్నాయి. దానికి తోడు ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన పరిస్థితులు, పెరిగిన అనారోగ్యకరమైన పోటీ పరిస్థితుల్లో విద్య విషయంలో దాదాపు అందరూ ఆంగ్ల మాధ్యమం వైపునకే మొగ్గు చూపుతున్నారు. నిజానికి యునెస్కో సహా అనేక విద్యా విషయ మేధావులు పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం విద్య ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్య మాతృ భాషలో అందించగలిగినప్పుడే విద్యార్థులు సహజంగా ఎదుగుతారని, నేర్చుకుంటారని నిరూపితమయింది. కాని పోటీ తత్వంతో పాటు తల్లిదండ్రుల్లో పెరిగిన ఆశలు అంచనాల నేపథ్యంలో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మాధ్యమంలో చదివించాలనే ఆశలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. అట్లా చదివించడానికి తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్లడానికి, తప్పులు చేయడానికి సిద్ధపడడం మనం చూస్తున్నాం.

అట్లా అత్యాశతో తమ కూతురును ఢిల్లీ గ్రామర్ స్కూల్లో చదివించాలని ప్రయత్నించిన ఓ జంట కథే ‘హిందీ మీడియం’. చాలా వాస్తవిక దృష్టి కోణంలోంచి అత్యంత సహజమైన వాతావరణంలో నిర్మించిన ‘హిందీ మీడియం’ సినిమాను సాకేత్ చౌదరి తన దర్శకత్వ ప్రతిభతో విలక్షణమయిన సినిమాగా రూపొందించాడు. అతి స్వల్ప నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఆర్థికంగా కూడా విజయవంతమయింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఇర్ఫాన్ ఖాన్ తన అద్భుత నటనతో సినిమాకు గొప్ప బలాన్ని తీసుకొచ్చారు. తన భార్య ఆశల మేరకు కూతురిని పెద్ద స్కూల్లో చదివించడానికి అతను పడ్డ యమ యాతన హాస్యాన్ని పంచుతూనే విద్యావ్యవస్థ, పేరెంట్స్ అత్యాశ, మానవీయ విలువల ఆవిష్కరణగా సినిమా సాగుతుంది. అన్ని అవస్థలు పడి పనికిరాని రోబోలను తయారు చేసే వ్యాపార స్కూల్స్ కంటే సృజనాత్మక విలువల్ని పంచే మాతృభాషలో నడిచే ప్రభుత్వ స్కూళ్ళు మంచిదనే వాస్తవాన్ని ఆవిష్కరిస్తూ సినిమా పాజిటివ్ నోట్‌తో ముగుస్తుంది. హిందీ మీడియం సినిమా వర్తమాన పరిస్థితుల్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది.

కథేంటంటే

సినిమా కథాంశానికి వస్తే ఢిల్లీలో మంచి వ్యాపారవేత్త అయిన రాజ్ బాత్ర తన శ్రీమతి మితా, కూతురు పియాతో కలిసి నివసిస్తూ ఉంటాడు. రాజ్, మితాలు ఇద్దరూ హిందీ మీడియం లోనే చదివి వుండడం వల్ల తన కూతురు పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని తల్లి మీతా కోరుకుంటుంది. ఆమేరకు భర్తపైన తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. ఢిల్లీ గ్రామర్ స్కూల్లో చేర్పించాలని అనుకుంటారు. మూడు కిలోమీటర్ల లోపు నివసించేవారికి సీట్ ఇస్తామని చెప్పడంతో తమ ఇల్లుని స్కూలు దగ్గరికి మార్చుకుంటారు. ప్రవేశాల విషయంలో తల్లీ దండ్రులకు కూడా ఇంటర్వ్యూ ఉంటుందని తెలిసి ఇద్దరూ శిక్షణ తీసుకుంటారు. కానీ రాజ్ బాత్ర ఇంటర్వ్యూలో విఫలం చెందుతాడు. కానీ విద్యా హక్కు చట్టం కింద తమ కూతురుకు ప్రవేశం దొరకొచ్చని తెలుసుకొని బీదవారిగా కనిపించడానికి గాను ఒక బస్తీలో కాపురముంటారు. ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. బస్తీలో పక్కింటి శ్యాం ప్రకాష్ కుటుంబం అన్ని విధాల వారికి సహకరిస్తారు. చివరగా వెరిఫికేషన్ కోసం స్కూల్ నుండి వచ్చిన టీచర్ ముందు వాళ్ళ ఆర్థిక స్థితి బయటపడే స్థితి వస్తుంది. కానీ శ్యాం ప్రకాష్ వారి పక్షాన వాదించి కాపాడుతాడు. పియా అడ్మిషన్‌ను ఓకే చెబుతూ 24,000 ఇతర ఫీజులకింద చెల్లించమని చెబుతారు. ఆ రాత్రి తన డెబిట్ కార్డ్ తో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్న రాజ్ బాత్రను చూసి శ్యాం ప్రకాష్ దొంగిలిస్తున్నాడేమోననుకుని లాక్కోస్తాడు. ఎదురుగా వస్తున్న వ్యాన్ కింద పడి తగిలిన దెబ్బలకు పరిహారంగా డబ్బులు వసూలు చేసి రాజ్ కిస్తాడు శ్యాం ప్రకాష్. పియా అడ్మిషన్ పూర్తి అవుతుంది. కానీ శ్యాం ప్రకాష్ కొడుక్కి అడ్మిషన్ దొరకదు.

ఇక రాజ్ మీతాలు తమ స్వంత విహార్ ఇంటికి మారిపోతారు. శ్యాం ప్రకాష్ కొడుకు మోహన్ చదువుతున్న స్కూలుకు వెళ్ళిన రాజ్ మీతా లు అక్కడి స్థితి చూసి కదిలిపోతారు. తామెవరో చెప్పకుండా ఆ స్కూలుకు అన్ని వసతులు కల్పిస్తారు. మోహన్ చదువులో వస్తున్న మార్పుకు సంతోషించిన శ్యాం ప్రకాష్ సహకరిస్తున్న దాతల వివరాలు ప్రిన్సిపాల్ నుంచి తీసుకొని ధన్యవాదాలు చెప్పడానికి వసంత విహార్‌కు వెళ్తాడు. అక్కడ రాజ్ బాత్రను చూసి ఖిన్నుడవుతాడు. గ్రామర్ స్కూల్లో మోసం గురించి చెప్పాలని వెళ్తాడు కానీ అక్కడ పియా ను చూసి మనసు మార్చుకుంటాడు. అడ్మిషన్ కోసం తాము చేసిన మోసం గురించి రాజ్ బాత్ర తీవ్ర మనస్తాపానికి గురై స్కూలుకు వెళ్లి అడ్మిషన్ కాన్సిల్ చేయమంటాడు. కానీ ప్రిన్సిపాల్ వినదు.

అయినా రాజ్, మితాలు తమ కూతుర్ని తీసుకొని ప్రభుత్వ స్కూలుకు వెళ్లి అడ్మిషన్ తీసుకొంటారు. ప్రభుత్వ స్కూల్లనే మెరుగు పరుచుకుని తమ కూతురికి మంచి అర్థవంతమైన విద్యనూ అందించాలని తలపిస్తారు. అట్లా తమ ఇంగ్లీష్ మీడియం వ్యామోహం నుండి బయటపడి హిందీ మీడియంలో తమ కూతుర్ని చేర్పిస్తారు. అట్లా ఒక వాస్తవాన్ని అత్యంత వాస్తవికంగా హిందీ మీడియం సినిమాలో చూపిస్తాడు దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్‌ల నటన చాలా బాగుంటుంది. వాస్తవికంగా సాగుతుంది. సినిమాలో ఆద్యంతం హాస్యం వెళ్లి విరిసి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కేవలం రూ. 23 కోట్లతో నిర్మించబడ్డ హిందీ మీడియం సినిమా రూ. 336 కోట్లకు పైగా వసూలు చేసిందన్నారు. ఇవాల్టి తల్లిదండ్రులంతా చూడాల్సిన సినిమా 'హిందీ మీడియం'.

(మాతృ భాషా దినోత్సవం నేపథ్యంలో)

-వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed