మరోకోణం:కమలబంధంలో తెలంగాణ

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:04:15.0  )
మరోకోణం:కమలబంధంలో తెలంగాణ
X

మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. సమావేశాలు జరుగుతున్న రాజధాని హైదరాబాద్‌లో అయితే హడావుడి ఆకాశాన్నంటేలా ఉంది. నగర కూడళ్లలో, రోడ్లపై ఎక్కడ చూసినా బీజేపీ అగ్రనేతలను స్వాగతిస్తూ కట్టిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ ప్రీ-బుక్ చేసుకున్న మెట్రో పిల్లర్లను, హోర్డింగులను వదిలేసి మిగిలిన అన్ని చోట్లనూ ఆక్రమించారు. నిన్న, నేడు హైటెక్స్‌లో సమావేశాలు కొనసాగుతుండగా, రాష్ట్రంలో ఒక కొత్త చర్చ ఊపందుకున్నది. వచ్చే ఎన్నికలలో తెలంగాణ కూడా కమలదళం చేతులకు వెళ్లబోతున్నదా? అని. గత కొంతకాలంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా తమ విమర్శల దాడిని కేసీఆర్ సర్కారుపై ఎక్కుపెట్టడం, తరచూ ఇక్కడికి వచ్చిపోతుండడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ ఇక్కడే అడ్డా పెట్టడం, ఈటలతో ప్రారంభించి చేరికలను ఉధృతం చేయడం, ఈ విషయాన్నే సూచిస్తున్నదని అంటున్నారు. కార్యవర్గ సమావేశాల నిర్వహణ పేరుతో ఇప్పుడు తెలంగాణను కాషాయ చక్రబంధంతో చుట్టేయడం ఈ వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు.

పాగా వేయడానికే

తెలంగాణలో పాగా కోసం బీజేపీ తహతహలాడడానికి సహేతుకమైన కారణమున్నది. 2014, 2019 సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉత్తర, పశ్చిమ భారత ప్రజలు పట్టం కట్టడమే. తర్వాతికాలంలో ఈశాన్య భారతం సైతం ఆ పార్టీకే ఓటేసింది. తూర్పున ఉన్న బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలలో కూడా పార్టీకి లేదా దాని మిత్రపక్షాలకు చెప్పుకోదగిన ఉనికి ఉంది. కేవలం దక్షిణ భారతంలోనే బాగా వెనకబడి ఉంది. ఇక్కడ ఉన్న ఆరు రాష్ట్రాలలో కర్ణాటక, గోవా మినహా మరెక్కడా ఆ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీలేదు.

సౌతిండియా నుంచి ఉన్న 131 లోక్‌సభ స్థానాలలో బీజేపీ 2014లో కేవలం 23 స్థానాలు గెలవగా, 2019లో 30 స్థానాలు గెలుపొందింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 2014లో 17, 2019లో 25 వచ్చాయి. కేరళలో రెండు దఫాలూ గుండుసున్నా రాగా, తమిళనాడులో ఏఐడీఎంకేతో జతకట్టిన ఫలితంగా 2014లో మాత్రమే ఒక్క సీటు వచ్చింది. ఏపీలో కూడా టీడీపీతో కూటమి కారణంగా 2014లో రెండు వచ్చాయి. 2019లో ఖాతా తెరవలేదు. రెండు స్థానాలు మాత్రమే ఉన్న గోవాలో 2014లో రెండూ, 2019లో ఒక్కటి గెలిచింది. ఇక తెలంగాణలో 2014లో ఒక్క సికింద్రాబాద్‌ను గెలవగా, 2019లో ఈ స్థానాల సంఖ్య నాలుగుకు పెరిగింది.

కోరిక నెరవేరేనా?

దేశమంతా మోడీకి బ్రహ్మరథం పడుతోందని, 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ అధిష్టానానికి సౌత్ ఫ్యాక్టర్ నిద్ర పట్టనివ్వడం లేదు. కర్ణాటక, గోవా కాకుండా మరో ఒకటి రెండు రాష్ట్రాలలో తన ఉనికిని నిరూపించుకుంటే తప్ప ఆ పార్టీ ప్రతిష్ట నిలబడే పరిస్థితి లేదు. బలమైన ద్రవిడవాదం ఉన్న తమిళనాడు, వామపక్ష భావజాలంతో నిండిన కేరళలో సమీప భవిష్యత్తులో ఛాన్స్ ఎంత మాత్రమూ లేదు. పొరుగు రాష్ట్రం ఏపీలో నెలకొన్న వర్గాలు, సామాజిక సమీకరణాల రీత్యా అక్కడ ఇప్పుడప్పుడే పుంజుకునే ఆశలు లేవు. ఇక మిగిలింది మన తెలంగాణ. గట్టిగా ప్రయత్నిస్తే ఇక్కడ అధికారాన్ని సాధించడం సాధ్యమేనని బీజేపీ హైకమాండు ప్రస్తుతం బలంగా నమ్ముతోంది.

చరిత్ర పరిణామాలు

ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ గత చరిత్ర, సామాజిక, రాజకీయ పరిణామక్రమం. జనాభాలో 85 శాతం హిందువులు, 13 శాతం ముస్లింలు (2021) ఉన్న ఈ ప్రాంతాన్ని సుమారు 400 ఏళ్ల పాటు కుతుబ్‌షాహీలు, నిజాంలు పరిపాలించారు. పాలకులుగా ఉన్న ముస్లిం రాజులపై పాలితులుగా ఉన్న హిందువులకు సహజంగానే వ్యతిరేకత నరనరాన జీర్ణించుకుని వుంటుంది. ముఖ్యంగా 1940లలో తెలంగాణ సాయుధపోరాట సందర్భంలో ఖాసిం రజ్వీ నేతృత్వాన ఏర్పడిన మతోన్మాద రజాకార్ల సైన్యం ప్రజలపై ఎన్నో అకృత్యాలు చేసింది. కమ్యూనిస్టుల అణచివేత పేరుతో ఈ మూకలు గ్రామాల పైబడి మూకుమ్మడి హత్యాకాండలు, మహిళలపై లైంగికదాడులు, సామూహిక గృహ దహనాలు విచ్చలవిడిగా కొనసాగించాయి. ఫలితంగా ప్రజానీకంలో ముస్లింలు అంటే ఒక రకమైన పరాయిభావం ఏర్పడి ఉంది.

ఆనాడు అవాంతరాలు

స్వాతంత్ర్యం వచ్చిన నుంచీ తెలంగాణలో వామపక్ష భావజాలమే బలంగా కొనసాగుతూ వచ్చింది. 1950 నుంచి 1977 వరకూ ప్రధాన స్రవంతి రాజకీయాలలో కాంగ్రెస్, కమ్యూనిస్టులే కీలకపాత్ర వహించారు. బీజేపీకి మాతృక అయిన జనసంఘ్ ఇక్కడ అసలు ఉనికిలోనే లేదు. ఆ తదుపరి కూడా కమ్యూనిస్టుల స్థానాన్ని నక్సలైట్లు ఆక్రమించారు. పల్లెలు, పట్టణాలలో రాడికలిజం రాజ్యమేలింది. ఈ వాతావరణంలో అప్పటికి బీజేపీగా పేరు మారిన హిందుత్వ పార్టీకి అంతగా ఆదరణ లభించలేదు. అభ్యుదయ భావాలు ఒంటబట్టిన ఓటర్లు మధ్యేవాద కాంగ్రెస్, టీడీపీలలో ఏదో ఒకదాన్నే ఎంచుకుని ఓటేశారు. అయితే, 2000ల తర్వాత ఈ పరిస్థితులు వేగంగా మారుతూవచ్చాయి. ఒకవైపు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మూలంగా మార్కెట్ సంస్కృతి పెరగడం, పల్లెలు, పట్టణాలలో స్వార్థమే పరమావధిగా కొత్త మధ్యతరగతి ఉద్భవించడం, మరోవైపు నక్సలైట్ల ప్రాబల్యం క్షీణించడం మూలంగా ప్రజలలోని ఒక సెక్షన్ ముఖ్యంగా యువత క్రమంగా హిందుత్వ రాజకీయాల వైపు ఆకర్షితమైంది. వాడవాడనా విస్తరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శాఖలు ఈ పరిణామాన్ని త్వరితం చేశాయి. వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, అక్కడక్కడా ఎమ్మెల్యేలుగా సైతం కమలనాథులు ఎన్నిక కావడం ప్రారంభమైంది.

గులాబీ గాలిలో

2009 నుంచీ ఉధృతమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒకరకంగా బీజేపీ వ్యాప్తికి బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. ఉద్యమానికి క్రియాశీలక మద్దతు ప్రకటించడంలో ఆ పార్టీ చూపిన అశ్రద్ధ, ఆలస్యం కూడా ఇందుకు కారణమే. కాంగ్రెస్, టీడీపీ పాలనతో విసిగి వేసారిన యువ ఓటర్లు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశమున్న సమయంలో టీఆర్ఎస్ రంగం మీదికొచ్చింది. ఉద్యమ క్రమంలో పుంజుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన క్రెడిట్‌తో 2014, 2018లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన పట్ల అదే యువతలో ఇప్పుడు ఎన్నడూ లేని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలాగే టీఆర్ఎస్ కూడా తమను మరోమారు మోసం చేసిందనే ఆవేదన వాళ్లలో వ్యక్తమవుతున్నది.

అనుకూల సమయమని

ఈ అన్ని అంశాలనూ కూలంకషంగా అధ్యయనం చేసిన సంఘ్ పరివార్ నాయకత్వం ఇప్పుడు 'మిషన్-70' పేరిట తెలంగాణను టార్గెట్ చేసింది. దేశాన్ని కుదిపేసిన మోడీ మేనియాను రాష్ట్రంలో సృష్టించడానికి నడుం కట్టింది. వామపక్షాల అవకాశవాదాన్ని, నక్సలైట్ల వైఫల్యాన్ని, ఇప్పుడు ఉద్యమపార్టీ అవినీతిని అస్త్రాలుగా ఉపయోగించుకోదలిచింది. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాదులోనే నిర్వహించడం వెనకాల ఈ కారణాలే దాగివున్నాయి. సంవత్సరంలోపే ముందస్తు ఎన్నికలు వచ్చే వాతావరణం ఉంది కనుక ఇకముందు కేసీఆర్ పాలనపై బీజేపీ తన బహుముఖ దాడిని మరింత తీవ్రతరం చేస్తుంది. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకుంటుంది.

కేసీఆరే టార్గెట్

2019 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన ఓ సభలో సీఎం కేసీఆర్ 'హిందువులు.. బొందువులు' అనే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను గెలవడానికి ఈ వ్యాఖ్యలే కారణమయ్యాయంటారు. తమ మతభావాలను కించపరిచే విధంగా కేసీఆర్ మాట్లాడారని భావించిన హిందూ ఓటర్లు కాంగ్రెస్‌ను వదిలేసి గంపగుత్తగా కమలానికి ఓటేశారంటారు. ప్రస్తుత కార్యవర్గ సమావేశాలలలో కూడా కేసీఆర్‌ను నిజాం రాజుతో పోల్చే, టీఆర్ఎస్-ఎంఐఎంల కుమ్మక్కుతో హిందూ మతానికి ఏర్పడే ముప్పును వివరించే తీర్మానమేదో చేయబోతున్నారని అంటున్నారు.

ఎవరి సత్తా ఏమిటో?!

బీజేపీ ఎత్తుగడలను కేసీఆర్ ఎలా తిప్పికొడతారు? 'ఆయనో నయా నిజాం. హిందువులకు వ్యతిరేకం. సాలు దొరా.. సెలవు దొరా' అంటూ ఆ పార్టీ చేసే ప్రచారాన్ని ఓటర్లు నమ్ముతారా? 'మతపిచ్చిగాళ్లు, శవాలపై ఓట్లేరుకునేవాళ్లు. బై బై మోడీ.. సంపకు మోడీ' అంటూ గులాబీ బాస్ చెప్పే మాటలను, చేపట్టిన పథకాలను నమ్మి టీఆర్ఎస్‌నే మరోమారు గెలిపిస్తారా? పోరు టీఆర్ఎస్ X బీజేపీగానే కొనసాగుతుందా? థర్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అన్నది భవిష్యత్తులో తేలనుంది.

డి. మార్కండేయ

[email protected]

Advertisement

Next Story