- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోకోణం: మునుగోడులో ఏం జరగబోతుంది? దిశ ఎడిటర్ గ్రౌండ్ రిపోర్ట్
మునుగోడులో ఏం జరగనుందనే విషయం పైనే ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. అక్కడి పరిస్థితి టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో నువ్వా? నేనా? అన్నట్టు ఉందని అంటున్నారు. మూడవ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్, బహుజన వాద బీఎస్పీ ఎవరి ఓట్లను ఎక్కువ చీల్చితే ఆ పార్టీ ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే వస్తుందని, ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మా నెట్వర్క్ ఇన్‌చార్జి ప్రవీణ్‌తో కలిసి అక్కడికి వెళ్లాను. ఆయనది ఆ నియోజకవర్గమే.
చౌటుప్పల్ మండలం నుంచి మొదలైన మా ప్రయాణం నారాయణపురం, గట్టుప్పల, మునుగోడు, చండూరు, నాంపెల్లి, మర్రిగూడెం మండలాల మీదుగా సాగింది. గ్రామ సెంటర్లలో, బడ్డీ కొట్టు హోటళ్ల వద్ద ఆగుతూ ప్రజలతో ముచ్చటించాం. ప్రవీణ్‌కున్న పరిచయాల ఆధారంగా కొందరు సర్పంచులను, మాజీ సర్పంచులను, ప్రజాసంఘాల నాయకులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ముఖ్యనేతలను కూడా కలిశాం. ఎవరికి వాళ్లు తమదే గెలుపని చెప్పారు. అయితే, అందుకు తగిన కారణాలను చెప్పడంలో మాత్రం తడబడ్డారు. వచ్చే రెండు వారాలలో ఏం జరగనుందోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపించింది.
ఎవరి వాదన వారిదే
మొదట మేం కొయ్యలగూడెంలో ఆగాం. అక్కడి వీధులలో గులాబీ కండువాలు వేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు తండోపతండాలుగా దర్శనమిచ్చారు. ఎవరు గెలుస్తారని అడిగితే తమ పార్టే గెలుస్తుందన్నారు. ఇక్కడ బీజేపీ అనేది లేనేలేదని, కాంట్రాక్టుల కోసమే రాజగోపాలరెడ్డి పదవికి రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారని, ఈ విషయం ప్రజలలోకి వెళ్లిందని అన్నారు. కాసేపటికి టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ సైతం కలిశారు. తనకు ఈ గ్రామ బాధ్యతలు అప్పగించారని, వారం నుంచి ఇక్కడే మకాం చేశామని చెప్పారు. ఏ ఆర్భాటమూ లేకుండా చాలా సింపుల్‌గా సాధారణ కార్యకర్తలాగా ఆయన తిరుగుతున్నారు.
అక్కడి నుంచి హైవేకు అటువైపున్న ఎల్లంబావికి వెళ్లగా రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు కలిశారు. వాళ్లంతా ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రాజగోపాలరెడ్డి మంచి వ్యక్తి అని, దానకర్ణుడని, ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తారని, అదే ఆయన్ను గెలిపిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల వసూళ్లరాయుడని, ప్రజలను పీడించుకు తింటాడని ఆరోపించారు. చౌటుప్పల్ సెంటర్‌లో కొంతమంది ఓటర్లను పలకరిస్తే, ఏ పార్టీకి ఓటు వేస్తామనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు. వాళ్లను చూస్తే అన్ని పార్టీలూ ఇచ్చే డబ్బులు, నజరానాలు తీసుకుని చివరికి నచ్చిన పార్టీకి ఓటు వేస్తారన్న ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత తంగడపల్లి గ్రామ మాజీ సర్పంచును కలిశాం. ప్రచార సరళిపై ఆయన అనేక విషయాలు చెప్పారు.
Also read: మరోకోణం: రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?
కాంగ్రెస్ ఊసులోనే లేదా?
నారాయణపురంలో బీజేపీ ప్రచార కార్యాలయానికి వెళ్లడమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడిని కలిశాం. కమలం విజయంపై తనకు ఏమాత్రం సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ వ్యతిరేక, బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. అవినీతి కేసులలో ఎమ్మెల్సీ కవిత సహా ఆ కుటుంబ ముఖ్యులందరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు. మునుగోడు ఫలితం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని, టీఆర్ఎస్ పతనానికి దారితీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అటుపై గట్టుప్పల్‌లో ఫ్లోరైడ్ ఉద్యమం చేసిన ఓ కీలక నేతను కలిశాం. ఓటుకు నోటు ఇప్పుడు రాజ్యమేలుతోందని, ఎవరు ఎక్కువ ఇస్తారో ఓటర్లు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. సుమారు పది వేలకు పైన దళిత ఓట్లను బీఎస్పీ చీల్చుతుందని, ఆ మేరకు అధికార పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. అక్కడే ఉన్న మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి చేతులెత్తేసినట్లు అనిపిస్తుందని, అదే జరిగితే ఆ ఓట్లు బీజేపీకి మళ్లడం ఖాయమన్నారు. ఆ పైన చండూరు, నాంపెల్లి, మర్రిగూడెం గ్రామాలలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది నేతలను, కార్యకర్తలను, ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకున్నాం.
Also read: టి-కాంగ్రెస్ కథ కంచికేనా!
ఆయన తీరే వేరట
ఈ పరిశీలనలో గమనించిన విషయాలను విశ్లేషిస్తే, స్థూలంగా నాలుగు అంశాలు స్పష్టంగా అగుపిస్తాయి. మొదటిది: బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డికి ప్రజలలో మంచి పేరుంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా వాళ్ల ఇంటి ముందు ఆయన వాలిపోయి ఉదారంగా ఆర్థిక సాయం చేస్తారు. నియోజకవర్గంలో పైరవీలు, సెటిల్‌మెంట్లు చేయరు. కమీషన్ల జోలికి వెళ్లరు. బయటి రాష్ట్రాలలో ఆయన కాంట్రాక్టులు చేయవచ్చు గాక, బీజేపీ ప్రభుత్వం ఆయనకు కోట్లాది రూపాయల ప్రాజెక్టులు అప్పగించి వుండవచ్చు గాక, స్థానికంగా ఆ ప్రభావం అసలు లేదు.
ఇందుకు విరుద్ధంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి చెడ్డ పేరుంది. మేం కలిసిన మామూలు వ్యక్తులే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. హాస్టల్ వార్డెన్ల నుంచి మొదలుకొని పైస్థాయి వరకూ అందరి దగ్గరా ఆయన వసూళ్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గ ప్రజలను కలవడం కూడా తక్కువేనని చాలా మంది చెప్పారు.
వన్ మ్యాన్ షో
రెండవది: కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి పోటీలో ఉన్న జాడలు నియోజకవర్గంలో కనిపించలేదు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, ప్రచార వాహనాల సందడి లేనేలేదు. రేవంత్ ఒక్కరు తిరుగుతున్నా మిగతా నేతలు పత్తాకు లేరని పలువురు చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు భారత్ జోడో యాత్ర మొదలయ్యాక పరిస్థితిని మనం ఊహించవచ్చు. స్వయానా రేవంత్ కూడా పబ్లిక్‌గానే ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లు ఎవరూ తనకు సహకరించడం లేదని, మునుగోడులో ఓడిపోతే తన పీసీసీ పీఠాన్ని ఊడగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పార్టీ నుంచి తనకు ఏమాత్రం ఆర్థిక వనరులు అందడం లేదని స్రవంతి మీడియాతో వాపోయారట కూడా. గెలిచే మాటటుంచి డిపాజిట్ దక్కించుకునేందుకే ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతోందనవచ్చు.
Also read: మరోకోణం: టి-కాంగ్రెస్.. ఈ జాకీ లేపుతుందా!?
స్థానిక నేతలను మరిచి
మూడవది: టీఆర్ఎస్, బీజేపీ రెండూ తమ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఊరికో ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ / ఎంపీని / మంత్రిని రంగంలోకి దింపింది. వాళ్లు తమతో పాటు వందలాది మంది నేతలను, కార్యకర్తలను తీసుకువచ్చి గత కొద్దిరోజులుగా మకాం చేశారు. వారి ఆధ్వర్యంలోనే ప్రచారం కొనసాగడం వల్ల స్థానిక పార్టీ శ్రేణులలో ఒక రకమైన అసంతృప్తి, నైరాశ్యం ఏర్పడింది. మమ్మల్ని కలిసిన చాలామంది లోకల్ లీడర్లు ఆఫ్ ద రికార్డుగా ఈ విషయం చెప్పారు. ఈ ప్రభావం ఓటింగ్‌పై ఉండే అవకాశముంది. బీజేపీ కూడా స్థానికేతర నేతలను దింపినా వాళ్లు మందీ మార్బలాన్ని వెంట తెచ్చుకోలేదు. స్థానిక కార్యకర్తలతో కలిసి ఇల్లిల్లూ తిరుగుతున్నారు.
మిశ్రమ స్పందన
నాలుగవది: ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రత్యేకించి రైతుబంధు, ఆసరా పెన్షన్ల విషయంలో 45 దాటిన వారిలో సానుకూలత ఉంది. అయితే, యువత మాత్రం ఇందుకు విరుద్ధమైన వైఖరితో ఉంది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడిందని వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్లుగా మునుగోడుకు నిధులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారానికి మూలమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల కల ఇంకా నెరవేరాల్సే ఉందని గుర్తు చేశారు.
కొసమెరుపు
ఈ పరిస్థితుల మధ్య మునుగోడు ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు? ఏ పార్టీ ఎక్కువ డబ్బులిస్తే ఆ పార్టీకి ఓటు వేస్తారా? లేక అందరి వద్దా తీసుకుని నచ్చిన పార్టీకి ఓటేస్తారా? ఇంటికో కార్యకర్తను, ఊరికో నేతను దింపిన టీఆర్ఎస్ ప్రచారానికి ఆకర్షితులవుతారా? 'కౌరవులు వందమంది, పాండవులు ఐదుగురే, విజయం మాదేనంటున్న కమలానికి జై కొడతారా?' ఆయా కులాల ఓట్లను లాగడానికి స్టార్ట్ చేసిన నేతల చేరికల మైండ్‌గేమ్ పోలింగ్‌పై ప్రభావం చూపుతుందా? ఈవీఎం మీట నొక్కే సమయంలో అభ్యర్థిని చూస్తారా? పార్టీని చూస్తారా? కాంగ్రెస్ నుంచి మళ్లే ఓట్లు, బీఎస్పీ, టీజేఎస్ తదితర ఇండిపెండెంట్లు చీల్చే ఓట్లు ఎవరికి లాభం చేకూరుస్తాయి? మరో రెండు వారాలలో తేలిపోనుంది.
డి. మార్కండేయ