- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం: ఆ విషయంలో TRS, BJP, CONG పార్టీలు ఒక్కటేనా..?
గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు విన్నాక నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకతను ఫోన్ చేశాడు. ఇంటర్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యవసాయం వృత్తిగా చేపట్టిన ఆయన ప్రతిరోజూ పేపర్లు చదువుతాడు. టీవీ చూస్తాడు. ఆయన నాతో వ్యక్తం చేసిన సందేహమేమంటే బీజేపీ పైన, మోడీ పైన కేసీఆర్ చేసిన విమర్శలన్నీ తనకు నిజాలు అనిపిస్తున్నాయట. మంచిదే కదా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే అసలు విషయం చెప్పాడు.
ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్ మాటల్లో కూడా అబద్ధాలు లేవని అనిపించిందట. ఆ మాటకొస్తే టీఆర్ఎస్, బీజేపీపై రేవంత్‌రెడ్డి చేసే ఆరోపణలు కూడా తప్పనిపించడం లేదట. ఏ పార్టీ మరే పార్టీని తిట్టినా అవి వాస్తవాలుగానే కనిపిస్తున్నాయట. అందరూ చెప్పేవీ నిజాలెలా అవుతాయి? ఒకవైపు సత్యం ఉంటే మరొకవైపు అసత్యం ఉండాల్సిందే కదా! నా ఒక్కడికే ఇలా అనిపిస్తున్నదా? లేక ఇంకెవరికైనా ఇలాంటి ఒపీనియన్ ఉందా? అని తెలుసుకోవడానికి నాకు కాల్ చేశాడట. ఏం జవాబు చెప్పాలో నాక్కూడా వెంటనే అర్థం కాలేదు. అప్పటికి తనకేదో సర్ది చెప్పి ఆ విషయమే ఆలోచించాను.
సవాలు విసిరిన కేసీఆర్
ఆయన అలా ఫీల్ కావడంలో తప్పు లేదనిపించింది. మొన్న అంతకుముందు నిర్వహించిన పలు విలేకరుల సమావేశాలలో కేసీఆర్ మోడీ పాలనపై అనేక ఆరోపణలు చేశారు. 'ఇప్పటివరకు మోడీ దేశానికి చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న లక్షల కోట్ల నల్లధనాన్ని వాపస్ తెచ్చి జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్నారు. వేశారా? ఆర్థిక నేరగాళ్లను పట్టితెచ్చి శిక్షిస్తానన్నారు. శిక్షించారా? మేకిన్ ఇండియా అన్నారు. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నం.
కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవే వెళ్లిపోతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. జీడీపీ పడిపోతున్నది. రూపాయి మారకం విలువ ఇదివరకెన్నడూ లేని స్థాయిలో దిగజారింది. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూనేవున్నాయి. ఉద్యోగాల కల్పన లేదు. ఈడీలు, కేసులంటూ ఇతర పార్టీల నేతలను బెదిరించడం, వాళ్లు బీజేపీలో చేరగానే పావనమైపోవడం చూస్తున్నదే' అంటూ భారీ చిట్టా విప్పారు. ధైర్యముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ప్రధానికి సవాలు విసిరారు.
మీ సంగతేమిటన్న విపక్షాలు
ఇప్పుడు బండి సంజయ్ తదితర బీజేపీ నేతలు, రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై తరచూ చేసే విమర్శలను విశ్లేషిద్దాం. 'తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా దళితుడిని చేస్తానన్నారు. తనే సీఎం అయ్యారు. కొడుక్కు, కూతురుకు, అల్లునికి, తోడల్లుని కొడుక్కి కీలక పదవులిచ్చి కుటుంబ పాలన చేస్తున్నారు. అభివృద్ధిని మరిచి తలకు మించిన అప్పులు చేశారు. విదేశాలలో రిజర్వాయర్ల గురించి మాట్లాడే సీఎం ఇక్కడి పాలమూరు-రంగారెడ్డి, డిండి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోరు?
రైతుబంధు, దళితబంధు అంటూ జనాలను అడుక్కుతినే బిచ్చగాళ్లను చేస్తున్నారు. హామీలివ్వడం, మర్చిపోవడం ఆయనకు అలవాటే. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయి? ఎన్నిచోట్ల కుర్చీ వేసుకుని పనులు చేయిస్తున్నారు? షిండేల గురించి పదే పదే ప్రస్తావించే కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా? ఏకంగా సీఎల్పీనే విలీనం చేసుకోలేదా?' ఇలా లెక్కకు మించిన ఆరోపణలు చేశారు. చేస్తూనే ఉన్నారు.
ఈ నిర్వాకం మీదే కదా!
ఇక యాభై ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీపై అటు బీజేపీ నేతలు, ఇటు కేసీఆర్ సహా టీఆర్ఎస్ విమర్శలకు కొదవే లేదు. 'అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చేయడంలో ఆ పార్టీ ట్రాక్ రికార్డును ఎవరూ అధిగమించలేరు. ప్రధానుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఎందరో కేసులలో ఇరుక్కున్నారు. చాలామంది జైలుకు వెళ్లారు. కుటుంబ పాలన, నిరంకుశ విధానాలు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీకి అలవాటే. ఇక ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్. ఏ వనరులూ లేని సింగపూర్ వంటి దేశాలు సైతం ఎక్కడో ఉంటే, అపార వనరులున్న మన దేశం ఇంత దౌర్భాగ్యస్థితిలో ఉండడానికి కారణం ఆ పార్టీయే. కాంగ్రెస్ ముక్త్ భారత్ తప్ప మరో గత్యంతరం లేదు.' ఇలా చెప్పుకుంటూ పోతే ఒడువని ముచ్చటే అవుతుంది.
ఎవరి చరిత్ర చూసినా
రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు పరస్పరం చేసుకుంటున్న పై ఆరోపణలు, ప్రత్యారోపణలను వాస్తవిక, చారిత్రక దృక్ఫథంతో పరిశీలిస్తే అవన్నీ చాలావరకు నిజాలేనని మనకు అర్థమవుతుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా దేశంలో ఉనికిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ కొన్ని సాధారణ దుర్లక్షణాలున్నాయి.
1. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు: నెహ్రూ నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నది. బీజేపీలో సైతం ఇటీవల వారసులకు పెద్దపీట వేస్తున్నారు. పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ మొదలుకొని వసుంధర రాజె, జ్యోతిరాదిత్య సింధియా వరకు ఎందరో వారసులు కీలక పదవులలో ఉన్నారు. ఇక కేసీఆర్ కుటుంబ పాలన గురించి చెప్పనక్కర్లేదు.
2. అవినీతి, అక్రమాలు, కేసులు: రాజీవ్ బోఫోర్స్ నుంచి సుఖ్‌రాం టెలికాం స్కాం వరకు కాంగ్రెస్‌లో కుంభకోణాలకు కొదవేలేదు. మైనింగ్ స్కాంతో పదవికి రాజీనామా చేసిన యెడియూరప్ప బీజేపీకి చెందినవారే. కార్గిల్ శవపేటికల కుంభకోణం, జైన్ హవాలా కేసు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ భూకుంభకోణాలు, హడ్కో స్కాం, పుణె ల్యాండ్ స్కాం తదితర ఆరోపణలన్నీ ఎన్‌డీఏ-బీజేపీ ప్రభుత్వాలపై వచ్చినవే. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా అంబానీ-అదానీ ద్వయంతో క్విడ్ ప్రో క్వో (ఇచ్చుకో, పుచ్చుకో) సంబంధాలు కలిగి ఉందని రాజకీయవర్గాలలో టాక్ ఉంది. ఇక కేసీఆర్ సర్కారులో ఉన్న అప్పటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతి ఆరోపణలతోనే రాజీనామా చేశారు. ప్రస్తుత మంత్రులలో అనేక మందిపై అవినీతి, అక్రమాల ఆరోపణలున్నాయి. భారీ ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపులో కేవలం ఒకటి రెండు సంస్థలకే ఫేవర్ చేసి వేల కోట్ల రూ. కమీషన్‌గా పొందారని స్వయంగా కేసీఆర్‌పైనే ఆరోపణలున్నాయి.
3. పార్టీ ఫిరాయింపులు: ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను, ప్రజాప్రతినిధులను నయానో భయానో లాక్కునే సంస్కృతి మూడు పార్టీలలోనూ ఉంది. ఇందుకు ఉదాహరణలు అక్కర్లేదేమో. అన్ని పార్టీలూ ఆకర్ష్-వికర్ష్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సైద్ధాంతిక విలువలు కలిగిన పార్టీగా చెప్పే బీజేపీ సైతం ఈటల నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.
4. ఓట్ల కోసం పాలిట్రిక్స్, ఉచిత పథకాలు: ఓట్ల కోసం నానా రకాల పాట్లు పడడం అన్ని పార్టీలలోనూ ఉన్నది. గరీబీ హటావో నుంచి రాజన్న రాజ్యం వరకు, రామజన్మభూమి నుంచి డబుల్ ఇంజిన్ వరకు, ఉద్యమ సెంటిమెంటు నుంచి బంగారు తెలంగాణ వరకు అవి వేయని ఎత్తు లేదు. అందులో భాగంగానే ఉచితాల పరంపర మొదలైంది. ఎన్టీఆర్ జమానాలో రూపాయికి కిలో బియ్యం ఇస్తే వైఎస్ మరింత ముందుకెళ్లి రుణమాఫీ, ఉచితవిద్యుత్, పింఛన్ల పెంపు ప్రకటించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సంక్షేమాన్ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇటీవలే వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ, కౌలురైతులకు రైతుబంధు వంటి ఎన్నో వరాలను ప్రకటించింది. బీజేపీ ఇప్పటికైతే ఏ ఉచితాలనూ ప్రకటించలేదు గానీ గెలుపు కోసం ఆ పార్టీ కూడా ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం పీఎంకేఎస్‌వై పేరిట రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున బ్యాంకుల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
5. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు: ఈ ధోరణి కూడా అన్ని పార్టీల్లో ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. వాళ్లే ప్రతిపక్షంలోకి వస్తే కేసులు ఫైల్ అవుతాయి. గెలిచిన తర్వాత కొట్టుకుపోతాయి. ఢిల్లీలో సిక్కుల ఊచకోత నుంచి గుజరాత్ అల్లర్ల వరకు.. జయలలిత నుంచి జగన్ వరకు ఇదే జరిగింది.
6. అధికారంలో ఉంటే ఒకమాట.. లేకపోతే మరోమాట: అంబానీ-అదానీలకు మోడీ అమ్ముడుపోయారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసింది. స్వదేశీ మంత్రం జపించే సంఘ్ పరివార్-బీజేపీ పగ్గాలు చేతికి రాగానే విదేశీ సంస్థలకు ఎర్ర తివాచీ పరుస్తున్నది. రాష్ట్రం రాకముందు ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనాన్ని ప్రశ్నించిన కేసీఆర్ ఆ కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు.
అధికారమే పరమావధా?
ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. అంటే పార్టీలన్నీ ఒకే తాను ముక్కలా? చెప్పేది ఏ సిద్ధాంతమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత సాగించే ఆచరణ మాత్రం ఒక్కటేనా? ఒకప్పటి కాంగ్రెసీయులు, కమ్యూనిస్టులు, జనసంఘీయులన్న విభజన ఇప్పుడు లేదా? ఎక్కడ అధికారం, పదవి, సంపాదన ఉంటే రాజకీయ నాయకులు అక్కడికే చేరతారా? సిద్ధాంతాలకు, నీతి నిజాయితీలకు, మానవీయ విలువలకు, సేవా దృక్పథానికి ఇది సమయం కాదా? ఆలోచించాల్సిందే..
డి. మార్కండేయ