కేసీఆర్ సార్.. మీరు మారాలి

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:17:20.0  )
కేసీఆర్ సార్.. మీరు మారాలి
X

మామూలుగా టీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు ఉండేవాళ్లు కూడా ఈటలకు ఓటేయడం వెనక కారణాలను అడిగితే ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పినా, అందరి మాటల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. కేసీఆర్‌లో వాళ్లు మార్పు కోరుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఫలితం ఆయనలో ఆ మార్పు తేగలదని ఆశిస్తున్నారు. ఈటలను గెలిపించడం వల్ల కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు, మొత్తంగా రాష్ట్ర ప్రజానీకానికి లాభం జరుగుతుందని భావించారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని 58 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చేసిన అభివృద్ధితో పోల్చితే, ఈ ఏడేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి చాలా ఎక్కువన్నదే తమ అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఏదో చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. అధికారం ఇచ్చినా అంతర్గత కలహాలతో ఏడాదికో సీఎం మారడం ఖాయమని ఫీలయ్యారు. ఇక, గత ఏడేళ్ల మోడీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ కనిపించలేదన్నారు. సెంటిమెంట్లు ప్రజల జీవితాలను బాగు చేయలేవన్నారు.

తక్కువ చెప్పండి. ఎక్కువ పనిచేయండి. చాలా చెప్పి కొన్నే చేయడం మూలంగా బద్‌నాం అవుతున్నారు. కేసీఆర్ అంటే మాటలు ఎక్కువ చెప్తారు అనే భావన ఉంది. అలాకాకుండా ఏం చేయగలుగుతారో అవే చెప్పండి. గత ప్రభుత్వాలతో పోల్చితే అభివృద్ధి-సంక్షేమ పథకాల్లో మీరే సూపరన్న విషయం గుర్తించండి.


హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ మొదలైంది. బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఊరూరా అభివృద్ధి పనులు చేపట్టినా, పెండింగులో ఉన్న బిల్లులన్నీ మంజూరు చేసినా, చివరకు ఓటు వేసే ప్రతి వ్యక్తికీ రూ. ఆరు వేల నగదు ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రతిష్టకు అవమానకర భంగపాటు అని, ఇక రాష్ట్రంలో కమలనాథులదే రాజ్యమని, రాబోయే ఎన్నికలలో వారు అధికారం చేపట్టడం ఖాయమని కొందరంటున్నారు. ఈటల వంటి ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు దొరకడం ప్రచార కేంపెయిన్‌లో వారికి లాభిస్తుందని చెబుతున్నారు. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇక తుడిచి పెట్టుకుపోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే, కేసీఆర్‌కు, మోడీ షా ద్వయానికి మధ్య ఉన్న సందేహాస్పద సంబంధాలు చివరకు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయక తప్పదన్న మరో చర్చ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న సంకేతాలు ప్రజలలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారక తప్పదని, 2023లో అధికారం చేపడుతుందని వీరు విశ్లేషిస్తున్నారు.

ఇది సొంత బలమేనా?

ఈ రెండు వాదనలకు పూర్తి విరుద్ధమైన వాదన మరొకటి ఉంది. అసలు హుజూరాబాద్ గెలుపు బీజేపీ గెలుపు కానే కాదని, అది ఈటల గెలుపు మాత్రమేనని వీరు వాదిస్తున్నారు. ప్రచారంలో ఈటల కమలం గుర్తును వాడుకున్నారే తప్ప ఆ పార్టీ బలాన్ని, బలగాలను వాడింది తక్కువేనంటున్నారు. ఏ సభలోనూ ఆయన 'జై శ్రీరాం' అనలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ఈటల పట్ల సానుభూతి ఉండడం, నియోజకవర్గ ఓటర్లకు ఆయన సుపరిచితం కావడం, ఏమీ ఇవ్వలేదనే అభిప్రాయం రాకుండా తక్కువ మొత్తంలో అయినా ఓటర్లకు డబ్బులు పంచడం విజయానికి తోడ్పడిందని విశ్లేషిస్తున్నారు. అసలు ఇక్కడ మొదటి నుంచీ బీజేపీ ఉనికి అంతంత మాత్రమేనంటున్నారు. అందుకే హుజూరాబాద్ ఫలితంతో రాష్ట్రంలో అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్న నిర్ణయానికి రాలేమని చెబుతున్నారు. ఇప్పటికీ హుజూరాబాద్ సహా రాష్ట్రంలో నిర్మాణపరంగా, ప్రజాదరణపరంగా టీఆర్ఎస్ పార్టీయే బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ చాలా వెనకబడి ఉన్నాయంటున్నారు.

అసలు నిజాలు ఇవేనా?

ఈ భిన్నవాదనల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధవర్గాల ఓటర్లను, విద్యావంతులను పలకరిస్తే ఆశ్యర్యకర నిజాలు కొన్ని బయటపడ్డాయి. పింఛన్లు తీసుకుంటున్నవాళ్లు, ముస్లింలు, దళితులలో చాలామంది కారు గుర్తుకే ఓటేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో లబ్ధి పొందుతున్న యాభై ఏళ్లు పైబడిన రైతులు కూడా ఆ పార్టీకే జైకొట్టారు. మొత్తం పోలైన రెండు లక్షల పైచిలుకు ఓట్లలో ఆ పార్టీకి 82 వేల పైనే రావడం గమనార్హం. ఇక, ఈటలకు ఓట్లు వేసినవారిలో ఎక్కువ మంది యువతీయువకులు, మధ్యతరగతి ప్రజలు, ఆయనంటే వ్యక్తిగతంగా అభిమానం చూపించేవాళ్లు ఉన్నారు. కాషాయం అంటే గిట్టని నక్సలైటు సానుభూతిపరులు కూడా ఈటల వైపే మొగ్గారు. వీరు కాకుండా, పోలింగ్ రోజు వరకూ టీఆర్ఎస్ కోసం పనిచేసిన వేలాది మంది ఆ పార్టీ గల్లీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు చాలామంది చివరి క్షణంలో ఈటలకు ఓటేశారు. కేసీఆర్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ సైతం కమలం పువ్వు మీట నొక్కినట్లు అక్కడి గ్రామాలలో టాక్ ఉంది.

పెద్దాయనలో మార్పు రావాలనే

మామూలుగా టీఆర్ఎస్ వైపు, కేసీఆర్‌ వైపు ఉండేవాళ్లు కూడా ఈటలకు ఓటేయడం వెనక కారణాలను అడిగితే ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పినా, అందరి మాటలలో కామన్ పాయింట్ ఒకటి ఉంది. కేసీఆర్‌లో వాళ్లు మార్పు కోరుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఫలితం ఆయనలో ఆ మార్పు తేగలదని ఆశిస్తున్నారు. ఈటలను గెలిపించడం వల్ల కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు, మొత్తంగా రాష్ట్ర ప్రజానీకానికి లాభం జరుగుతుందని వాళ్లు భావించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ జీవితాలలో ఎంతో మార్పు వచ్చిందని, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, నిధులు పుష్కలంగా వస్తున్నాయని, ఆత్మగౌరవంతో బతుకుతున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 58 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధితో పోల్చితే, ఈ ఏడేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి చాలా ఎక్కువన్నదే తమ అభిప్రాయమన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదో చేస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. అధికారం ఇచ్చినా అంతర్గత కలహాలతో ఏడాదికో సీఎం మారడం ఖాయమని ఫీలయ్యారు. ఇక, గత ఏడేళ్ల మోడీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ కనిపించలేదన్నారు. సెంటిమెంట్లు ప్రజల జీవితాలను బాగు చేయలేవన్నారు.

ఈ సప్త సూత్రాలు పాటిస్తే

నాతో మాట్లాడిన వాళ్లందరూ ఒకేమాటగా కేసీఆర్ మారాలని కోరుకుంటున్నారు. ఉద్యమకాల కేసీఆర్ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అలా జరిగితే ఆయనను మించిన ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజల ముందు మరొకటి ఉండబోదంటున్నారు. వారేమంటున్నారంటే..

1. పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంచండి. మంత్రులకు, రాష్ట్ర స్థాయి నేతలకే కాకుండా ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు స్వేచ్ఛనిస్తే వాళ్లు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు. మీ కుటుంబసభ్యులు కూడా సంతృప్తిగా పనిచేయలేని వాతావరణం ఈ రోజు ఉందని గ్రహించండి.

2. ప్రగతి‌భవన్ గేట్లు తెరవండి. సామాన్యుల, బాధితుల గోడు వినండి. జనహిత భవనానికి మళ్లీ కళ తీసుకురండి.

3. రాష్ట్ర సచివాలయాన్ని తిరిగి క్రియాశీలం చేయండి. ప్రతి ఫైలూ ప్రగతి‌భవన్ వద్దకు రానక్కరలేకుండా మీరే అక్కడకు వెళ్లి అధికారులను పరుగులెత్తించండి. కొత్త సెక్రెటేరియట్ కోసం ఎదురు చూడకండి. సీనియర్లు, యువ ఐఏఎస్‌లు సహా అందరి సేవలను సంపూర్ణంగా వాడుకోండి.

4. తక్కువ చెప్పండి. ఎక్కువ పనిచేయండి. చాలా చెప్పి కొన్నే చేయడం మూలంగా బద్‌నాం అవుతున్నారు. కేసీఆర్ అంటే మాటలు ఎక్కువ చెప్తారు అనే భావన ఉంది. అలాకాకుండా ఏం చేయగలుగుతారో అవే చెప్పండి. గత ప్రభుత్వాలతో పోల్చితే అభివృద్ధి-సంక్షేమ పథకాలలో మీరే సూపరన్న విషయం గుర్తించండి.

5. సంక్షేమ పథకాలలో ప్రజాధనం వృథా అవుతోంది. 70 శాతానికి పైగా అనర్హులే లబ్ధి పొందుతున్నారు. తినడానికి తిండిలేక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న, మీకు క్రమం తప్పకుండా ఓటు వేస్తున్న నిజమైన పేదలకు కచ్చితంగా అందేలా చూడండి. పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలలో అవినీతి, అక్రమాలను నిరోధించండి. ఈ మేరకు మార్గదర్శకాలను మార్చండి. వాటిని కఠినంగా అమలుచేయండి.

6. జిల్లాలు తిరుగుతానన్న మీ గత హామీని వెంటనే అమలు చేయండి. చంద్రబాబుకు 'జన్మభూమి' కార్యక్రమం ఐడియా ఇచ్చింది మీరేననే టాక్‌ను నిజం చేయండి. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లండి.

7. కష్టకాలంలో తెలంగాణ రైతును ఆదుకున్నది మీరేనన్నది నిజమే అయితే ప్రస్తుత వరి పంట సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించండి. వ్యవసాయానికి అండగా ఉంటే రైతులు సదా మీకు అండగా ఉంటారు.

మీకు తెలియదని కాదు

ఈ అంశాలు సీఎం కేసీఆర్‌కు తెలియని విషయాలు కావు. హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో ఆయనకు ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలుగా భావించాలి. వీటిని సద్విమర్శగా తీసుకుని అమలు చేయగలిగితే రాష్ట్రంలో చిరకాలం టీఆర్ఎస్ ప్రభుత్వం వర్ధిల్లడం ఖాయం. లేదంటే తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ నినదించి ఢిల్లీ కేంద్రిత కాంగ్రెస్ పాలనను కూలదోసిన ఎన్‌టీ‌ఆర్ ఆరేళ్లకే గద్దె దిగిపోయినట్లుగా తెలంగాణ తెచ్చి ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ కూడా వచ్చే ఎన్నికలలో.. అయితే బీజేపీకి లేదంటే కాంగ్రెస్‌కు తన కుర్చీని వదులుకోక తప్పదు.

డి. మార్కండేయ

Advertisement

Next Story

Most Viewed