- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముందస్తా? పుత్రాభిషేకమా?
తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ పాలనను, బీజేపీని 'తిట్టిన తిట్టు తిట్టకుండా'రెండున్నర గంటల పాటు తిట్టిపోశారు. వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరుపై రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి తిట్లపురాణం అందుకోవడానికి కారణమయ్యాయి. జనగామ, భువనగిరి సభలలోనూ, ఆ తర్వాతి రోజు మీడియా సమావేశంలోనూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దేశం సర్వనాశనం అవుతోందని, కేంద్ర ప్రభుత్వానికి పిచ్చి ముదురుతున్నదని దుయ్యబట్టారు. 'ఖబర్దార్ మోడీ, మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు, దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే ఊరుకోబోం, ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, దేశం ఎవడి అయ్య సొత్తు కాదు'అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రఫేల్ కుంభకోణంపై సుప్రీంలో కేసు వేస్తానని, బిజేపీ నేతలకు జైలు పక్కా అని, సర్జికల్ స్ట్రైక్స్ నిజమే అయితే రుజువులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆశీర్వాదం ఉంటే త్వరలోనే జాతీయ రాజకీయాలకు వెళతానని, అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతోనే
గులాబీ బాస్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో ముందస్తు (నిజానికి మధ్యంతరం అనాలి) ఎన్నికల పైన చర్చ మొదలైంది. ప్రతిపక్షాలన్నీ దాదాపు అదే అభిప్రాయానికి వచ్చాయి. ఏ ప్రయోజనమూ లేకుండానే కేసీఆర్ బీజేపీ వ్యతిరేక వ్యూహం అవలంబించి ఉండరని, ప్రజాక్షేత్రంలో ఆయన ఇప్పుడు విమర్శల దాడి చేయడం వెనకాల ఏదో ఆంతర్యం దాగివుందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోడీ వ్యాఖ్యల తర్వాత టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిరసనలు కొనసాగించిందీ, నేతలు, మంత్రులు కమలదళంపై విమర్శలు గుప్పించిందీ, రాష్ట్ర ప్రజలలో మరోసారి సెంటుమెంటును రగిలింపజేయడానికేనని వీళ్లంటున్నారు. ఇందుకోసమే కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారన్న విషయాన్ని గమనించాలని గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ సెంటిమెంటును దీర్ఘకాలం కొనసాగించడం కష్టం కనుక 2023 డిసెంబర్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళతారని విశ్వసిస్తున్నారు. వచ్చే జూన్ తర్వాత ఏ రోజైనా శాసనసభను రద్దు చేసే అవకాశముందని, నవంబర్, డిసెంబర్‌లో గుజరాత్ తదితర రాష్ట్రాలతోనో లేదంటే 2023 ఏప్రిల్, మే నెలలలో కర్ణాటక తదితర రాష్ట్రాలతోనో ఎన్నికలు జరుగవచ్చునని వీళ్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ మోడీ సర్కారు సహకరించిన పక్షంలో ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఒక్క తెలంగాణ కోసమే ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
లాభం గులాబీ దళానికే!
కేసీఆర్-బీజేపీ మధ్య వార్ రసవత్తరంగా కొనసాగి, సెంటిమెంటు రగిలిన వాతావరణంలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కే ఎక్కువ లాభం జరుగుతుందనేది నిర్వివాదాంశం. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడే అవకాశముంది కనుక ఆ పార్టీకి నష్టం వాటిల్లడం ఖాయం. కొత్త రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి వైఖరి చూపుతోందన్న కేసీఆర్ విమర్శనాస్త్రాలు క్రమంగా ఓటర్లను కమలనాథులకు దూరం చేసే అవకాశముంది. ఇక, వెంటిలేటర్‌పై ఉన్న టి-కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి సారథ్యంతో లేచి కూర్చున్నా బరిలో ప్రత్యర్థులను ఢీకొనేంత బలం ఇప్పటికీ పుంజుకోలేదు. అంతర్గత సమస్యలతోనే సతమతమవుతోంది. పలు ప్రైవేట్ సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలలో టీఆర్ఎస్‌తో సమానంగా కాంగ్రెస్‌కు సీట్లు వస్తాయన్న ట్రెండ్ బయటపడినప్పటికీ ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికలలోనూ పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని అనేక సర్వేలు చెప్పినా చివరకు ఫలితాలలో ఆ పార్టీ ఘోరంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులలో ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్‌కు అంత లాభమన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.
వాళ్లు సహకరిస్తారని అంచనా
సీఎం కేసీఆర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముందస్తుగా ఎన్నికలకు వెళితే ప్రస్తుత వాతావరణంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది పోలింగ్‌పై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని, తెలంగాణ సెంటిమెంటుతో సులభంగానే మెజారిటీ సీట్లు సాధించవచ్చునని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఐదో, పదో తక్కువైనా ఎంఐఎం మద్దతుతో, లేదంటే ఇతర పార్టీల నుంచి చేరే జంపింగ్ జపాంగ్‌లతో ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చునని భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల భోగట్టా. ఎలాగూ మిగతా స్థానాలను కాంగ్రెస్, బీజేపీ పంచుకుంటాయి కనుక అప్పటికి ఉన్న రాజకీయ వాతావరణంలో ఏదో ఒక పార్టీ తమకు సపోర్ట్ ప్రకటించక తప్పని పరిస్థితి ఉంటుందని కూడా వాళ్లు చెబుతున్నారు.
కేసీఆర్ దేశ్‌కీ నేతా అవుతారా?
అయితే, తాము ఆశించినట్లుగా ప్రజలలో సెంటిమెంటు అస్త్రం పండకపోతే, సర్వేలు చెప్పిన విధంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తే ఎలా? అన్న విషయాన్ని కూడా గులాబీ బాస్ ఆలోచిస్తున్నారని తెలిసింది. అప్పుడు, అయితే కాంగ్రెస్‌కు లేదంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక పరిస్థితులలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని సొంతంగానే మెజారిటీ సాధించే అవకాశం కూడా లేకపోలేదని భయపడుతున్నారని కూడా అంటున్నారు. అలా జరిగితే తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందని, తప్పుడు అంచనాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అధికారం కోల్పోతే పరువు పోతుందనే చర్చ కూడా నడుస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ముందస్తుకు వెళ్లే ఆలోచనను కేటీఆర్, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా ఒక ప్రచారం నడుస్తోంది. ఎన్నికల ఆలోచన మానుకుని వీలైనంత త్వరగా రాష్ట్రానికి కేటీఆర్‌ను సీఎం చేసి.. కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళితే బాగుంటుందని వీళ్లు భావిస్తున్నట్లు సమాచారం. 'దేశ్ కీ నేతా కేసీఆర్'అంటూ ఈ వర్గం ఇతర రాష్ట్రాలలో హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం, అక్కడి స్థానిక మీడియాలో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం.
కలిసివచ్చేవారితో కూటమి
కేసీఆర్ కూడా ఈ వాదనను వ్యతిరేకించకుండా మార్చి 10 వరకు వేచిచూసే ధోరణిని అవలంబిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీ ఎన్నికలలో కనుక బీజేపీ ఓడిపోవడమో లేదంటీ సీట్లు బాగా తగ్గడమో జరిగితే కేసీఆర్ తప్పనిసరిగా ఢిల్లీకి వెళతారని అంటున్నారు. ఇప్పటికే దేవెగౌడ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాకరే తదితరులతో టచ్‌లో ఉన్న ఆయన, ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత అఖిలేశ్, మమత, పవార్‌ను కూడా కలిసి బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమిక పోషించే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అవసరమైతే, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తారని, ఆయన సుముఖంగా లేకుంటే చంద్రబాబునైనా తనతో కలుపుకుపోతారని చెబుతున్నారు. ఆ పనులలో ఆయన బిజీ అయితే ఇక రాష్ట్రాన్ని తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించడం ఖాయమని భావిస్తున్నారు.
నాటకమో, నిజమో తేలేది అప్పుడే
ఏది ఏమైనా మార్చి 10 తర్వాత రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ తన బీజేపీ వ్యతిరేక ప్రచార యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజలలో సెంటిమెంటును రగిలింపజేసి ముందస్తు ఎన్నికలకు వెళతారా? గెలిచిన తర్వాత కేటీఆర్‌ను సీఎం చేసి అప్పుడు తాను పూర్తిగా జాతీయ రాజకీయాలకు అంకితమవుతారా? లేదంటే యాదాద్రి టెంపుల్ ప్రారంభం తర్వాత ఏప్రిల్‌లో ఏదో ఒక శుభ ముహూర్తాన కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి పార్టీ అధినేతగా ఢిల్లీలో రాజకీయం చేస్తారా? మోడీ-కేసీఆర్ మధ్య జరుగుతున్న యుద్ధం నిజమేనా? లేక ప్రజలను పక్కదారి పట్టించి కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమా? అన్న విషయం త్వరలోనే తేలిపోనుంది.
- మార్కండేయ
- Tags
- marokonam