- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు
ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక శీర్షికల్లో నిలవడం కేసీఆర్‌కు అలవాటే అయినప్పటికీ, మొన్నటి పత్రికా సమావేశం మరింత స్పెషల్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో కేసీఆర్.. మోడీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కారును, బీజేపీని, ఆ పార్టీ నేతలను, వారు అనుసరిస్తున్న విధానాలను తిట్టిన తిట్టు మళ్లీ రాకుండా రెండున్నర గంటల పాటు ఏకధాటిగా తిట్టిపోశారు. మెదడు లేని మోడీ.. అబద్ధాల మోడీ.. కురచబుద్ధి ప్రధాని..
చెత్త ప్రభుత్వం.. దరిద్రపుగొట్టు ప్రభుత్వం.. దిక్కుమాలిన బడ్జెట్.. గోల్‌మాల్ గోవిందం.. నెత్తి లేదు.. కత్తి లేదు.. మతపిచ్చిగాళ్లు.. అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఏడున్నరేళ్ల తెలంగాణ సాధించిన అభివృద్ధితో పోల్చితే ఏడున్నర దశాబ్దాల భారత్ సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని, అభివృద్ధిని అడ్డుకున్నారని, ఇన్నేళ్లయినా కేవలం రూ. 40 లక్షల కోట్లు దాటని బడ్జెట్ ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దేశంలో ప్రబల పరివర్తన రావాలని, గుణాత్మక మార్పు జరగాలని, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన ప్రవచించారు. ఇందుకోసం తాను నడుం బిగిస్తానని, దేశమంతా తిరిగి ప్రజల్లో విప్లవం తెస్తానని హెచ్చరించారు. రాష్ట్రం గురించి ప్రస్తావించినప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌దే విజయమని, 95-105 సీట్లు గెలుచుకుంటుందని, ముందస్తు ఉండబోదని స్పష్టం చేశారు.
ఈ మాటల తూటాల వెనకాల కేసీఆర్ ఆంతర్యం ఏమిటో పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మొదటగా.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లదల్చుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. 2014 నుంచి రెండు దఫాలుగా అధికారంలో ఉన్న మోడీ సర్కారు పైన దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడం, ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్వీర్య స్థితిలో ఉండడం వల్ల ప్రస్తుతం అక్కడ రాజకీయ శూన్యత ఉందన్న విషయాన్ని గులాబీ బాస్ గమనించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతలు థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా సఫలం కావడం లేదని ఆయనకు అర్థమైంది.
అందుకే తాను కూడా రంగంలోకి దిగడంలో తప్పులేదని భావిస్తున్నారు. నిజానికి ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇలాంటి ఒక ప్రయత్నం చేశారు. మమత, స్టాలిన్, పవార్, దేవేగౌడ వంటి నాయకులతో భేటీ అయ్యారు. అయితే, వారెవరి నుంచీ ఆశించినంత స్పందన లభించకపోవడంతో ఊరకుండిపోయారు. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి తనకు అనుకూలంగా ఉందనుకున్నారో ఏమో మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడిన విషయాలను బట్టి మనం రెండు నిర్ధారణలకు రావచ్చు. బడ్జెట్‌పై మరే ఇతర నేతా స్పందించక ముందే, తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ద్వారా ఆయన ప్రధాని మోడీని ఢీకొనగలిగే మొనగాడిని తానేనని దేశ ప్రజలకు నిరూపించదల్చుకున్నారు. రాహుల్, మమత, స్టాలిన్, అఖిలేశ్‌ల కంటే తాను పరిపక్వత ఉన్న నాయకుడినని చెప్పదల్చుకున్నారు. ఏడేళ్లలో తెలంగాణను ఏ స్థాయికి తీసుకువెళ్లారో చెప్పడం ద్వారా దేశాన్ని కూడా అంతే వేగంగా అభివృద్ధి చేయగలనని ఆయన చెప్పకనే చెప్పారు. దేశ జీడీపీ పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని, గతంలో దేశాన్ని పాలించిన ప్రధానులందరూ విఫలమయ్యారని విమర్శించడం ఇందులో భాగమే.ప్రస్తుత సెటప్‌లో మార్పు అనేది సాధ్యం కాదని, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలని ప్రతిపాదించడం ద్వారా కొన్ని వర్గాల మద్దతును ఆయన కూడగట్టదల్చుకున్నారు. తాను దేశమంతా తిరుగుతానని, ప్రజల జీవితాల్లో ప్రబల పరివర్తనను, వ్యవస్థలో విప్లవాన్ని తెస్తాననడం ద్వారా తన నాయకత్వ లక్షణాలను ప్రస్తావించారు. గుజరాత్‌కు సీఎంగా ఉన్న మోడీ ప్రధాని కాలేదా? అని ప్రశ్నించి తనకు ప్రధానమంత్రి అయ్యే కోరిక ఉందని బయటపెట్టుకున్నారు.
ప్రెస్‌మీట్ ద్వారా కేసీఆర్ చెప్పిన రెండవ విషయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం టీఆర్ఎస్‌దేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఉండబోదని. 2018లో ఆయన ముందస్తుకు వెళ్లడానికి కారణం సాధారణ ఎన్నికలతో వెళితే తమ పార్టీకి నష్టం జరుగుతుందని భావించడమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఓటరు పాజిటివ్ లేదా నెగెటివ్ వైఖరి కాస్తా అసెంబ్లీ ఓటింగ్ పైనా ప్రభావం చూపుతుందని. అందుకే, ముందే మోడీ-షా ద్వయాన్ని కలిసి, వారి సహకారాన్ని కోరారని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని బీజేపీ వర్గాల భోగట్టా. ఇక్కడ గెలిచి అధికారం చేపట్టగానే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు కమలదళాన్ని కూడా టార్గెట్ చేశారని వారంటున్నారు.
ఈసారి షెడ్యూలు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందే జరుగుతాయి కనుక ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ భావిస్తుండవచ్చు. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుని వుండవచ్చు. 95-105 సీట్లు రాకపోయినా, మెజారిటీకి కొంత తక్కువైనా ఏదో ఒక పార్టీ తమకు బేషరతు మద్దతు ఇచ్చే పరిస్థితిని తయారు చేసుకుంటుండవచ్చు. అటు కాంగ్రెస్‌కు, ఇటు కమలనాథులకు సమదూరం పాటించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ విన్యాసాలకైనా పూనుకునే వెసులుబాటు ఉంటుందని అంచనా వేస్తుండవచ్చు.
ఇక ఈ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చెప్పని విషయం ఇంకొకటుంది. అదేమిటంటే కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం. తండ్రి జాతీయ రాజకీయాల్లో నిమగ్నమైన పరిస్థితుల్లో తనయునికి పీఠం దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. తాను దేశమంతా తిరుగుతానని చెప్పిన కేసీఆర్ సీఎం హోదాలోనే పర్యటిస్తారా? లేక కొడుకును సీఎం చేసి పార్టీ అధినేతగా వెళతారా? అన్నది ఇంకా తేలలేదు. ప్రగతిభవన్ వర్గాల గుసగుసల ప్రకారం కేటీఆర్ వచ్చే ఎన్నికలకు ముందే ప్రభుత్వ పగ్గాలు చేపడతారని అంచనా. బహుశా వచ్చే మార్చి 10న యూపీ తదితర ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగి తన వ్యూహాన్ని ఫైనల్ చేసుకుంటారని, ఈలోపు యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించి అప్పుడు కొడుకుకు సీఎం పదవిని అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది.
మలిదఫా ఎన్నికలు జరిగినప్పటి నుంచీ 'కేటీఆర్ సీఎం' టాక్ రాజకీయవర్గాల్లో నిరాటంకంగా కొనసాగుతోంది. కేంద్రంలో యూపీఏ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పుడు రాహుల్‌ను ప్రధాని చేయకపోవడం సోనియాగాంధీ చేసిన ఘోరతప్పిదమని సీఎం కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయబోరన్న విశ్వాసంతోనే ఇలాంటి టాక్ పదే పదే పునరావృతమవుతోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి ఇదే తగిన సమయంగా కేసీఆర్ భావిస్తున్నారని, ప్రస్తుత ప్రెస్‌మీట్ వ్యూహం ఇందులో భాగమేననే వాదన కూడా ఉంది.
కొడుకును ఇక్కడ సీఎం చేయడం.. తాను ఢిల్లీకి వెళ్లడం.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తేవడం.. కేసీఆర్ అనుసరిస్తున్న ఈ త్రిముఖ వ్యూహం సక్సెస్ అవుతుందా? లేక విఫలమవుతుందా? అన్న విషయం పలు అంశాలపై ఆధారపడివుంటుంది. మోడీని, బీజేపీని ఎంత ఘోరంగా తిట్టినా.. దుమ్మెత్తిపోసినా కేసీఆర్‌ను ప్రాంతీయ, జాతీయ స్థాయి నేతలు ఎవరైనా విశ్వసిస్తారా? గత ఏడున్నరేళ్లుగా మోడీ-షా ద్వయంతో ఆయన కొనసాగించిన సందేహాస్పద సంబంధాలు, పలు కీలక సమయాల్లో
అధికార పార్టీకి అండగా నిలిచిన సందర్భాలు అడ్డంకిగా మారతాయా? తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తా.. అనడం నుంచి హైదరాబాద్‌లో బీజేపీపై శంఖారావమూది, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి, ఢిల్లీ వెళ్లిన వెంటనే మోడీ-షాల ముందు మోకరిల్లి.. రైతులను కలువడం మరిచి తిరిగిరావడం వరకు గమనిస్తున్న దేశ ప్రజానీకం ఆయన పిలుపునకు స్పందిస్తారా? యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తే కేసీఆర్‌లో ఇప్పుడున్న వాడి.. వేడి తగ్గిపోతుందా? చివరకు ఆయన ఎన్డీయేలో చేరిపోతారా? లేదంటే పరిస్థితులను బట్టి యూపీఏ వైపో, థర్డ్ ఫ్రంట్ వైపో వస్తారా? ఇవన్నీ ఇప్పుడే సమాధానం దొరకని ప్రశ్నలు.
- డి మార్కండేయ
- Tags
- marokonam