కమలనాథులా? కాంగ్రెస్సా?

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:17:04.0  )
కమలనాథులా? కాంగ్రెస్సా?
X

సరిగ్గా ఈ పరిస్థితులలో కేసీఆర్ తన వ్యూహం మార్చారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెట్టిన విల్లు-బాణాలను బీజేపీ వైపు తిప్పారు. వడ్ల కొనుగోలు వ్యవహారం సమయానికి అందివచ్చింది. నెల రోజుల నుంచీ ఆ పార్టీపై విడువకుండా విమర్శల దాడి చేస్తూనేవున్నారు. బీజేపీ ఓ హంతక పార్టీ అని, మోడీది రైతు వ్యతిరేక రాబందు ప్రభుత్వమని, ఏడేళ్ల పాలనలో దేశంలో ఆకలికేకలు పెరిగాయని దుమ్మెత్తిపోస్తున్నారు. పార్లమెంటులో గళమెత్తమని పార్టీ ఎంపీలను నిర్దేశించారు. 14 విపక్ష పార్టీల సమావేశానికి కేకేను పంపి ఇకముందు తమ పార్టీ ఎన్‌డీయే వైపు ఉండబోదన్న సంకేతాలను పంపించారు.

కేసీఆర్‌ను ఎవరు, ఎంతమేరకు నమ్ముతారన్నది ఇక్కడ కీలక ప్రశ్న. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలుస్తానని మోసం చేసిన వ్యక్తిని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా చేరదీస్తారా? పలు కీలక సందర్భాలలో మోడీ విధానాలను సమర్థించిన టీఆర్ఎస్‌ను మమత, శరద్ పవార్, స్టాలిన్‌లాంటి థర్డ్ ఫ్రంట్ నేతలు విశ్వసిస్తారా? చెప్పడం కష్టమే. వాళ్లు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం. ఏడేళ్ల పాటు మోడీ-షా ద్వయంతో సందేహాస్పద సంబంధాలను కొనసాగించి రాష్ట్ర బీజేపీ నేతల గాలి తీసేసిన కేసీఆర్, ఇప్పుడు యూపీఏకు దగ్గరై, మంచి ఊపుమీదున్న రేవంత్‌రెడ్డిని బక్‌రా చేయడం మాత్రం ఖాయం.

కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహం మూలంగా ఏ రకంగా చూసినా టీఆర్ఎస్‌కు లాభమే కాని నష్టం లేదు. రాష్ట్రమంతటా ప్రభుత్వ వ్యతిరేక పవనాలున్న పరిస్థితులలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడం కష్టమే. అలాంటప్పుడు అయితే బీజేపీ నుంచో లేకపోతే కాంగ్రెస్ నుంచో ఆ పార్టీకి మద్దతు అవసరమవుతుంది. ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ తనకు బేషరతు మద్దతును ప్రకటించే స్థితిని కేసీఆర్ తయారు చేసుకుంటున్నారు.


రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ మరోసారి వేడెక్కించారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఓ పార్టీ పైన వాడి వేడి విమర్శలు సంధించో, పథకాన్ని ప్రకటించో బాంబులు పేల్చే ఆయన గత నెల నుంచీ భారతీయ జనతా పార్టీపై పడ్డారు. వరుస ప్రెస్‌మీట్లలో వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంపైనా, కమలనాథులపైనా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. 'ఖబడ్దార్ బీజేపీ, దేశంలో అగ్గి పెడతం, వెంటాడుతం, వేటాడుతాం, మెడలు వంచుడు కాదు, నీ మెడలు విరుస్తాం బిడ్డా' అంటూ ఆ పార్టీపై సమరశంఖం పూరించారు. కేటీఆర్ సహా మంత్రులు, పార్టీ నేతలూ ఇదే దారిపట్టారు. ఢిల్లీ వైఖరిని నిరసిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 'అధికారిక' ధర్నాలు నిర్వహించారు. పార్లమెంటులో సైతం ఆ పార్టీ ఎంపీలు మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇది చాలదన్నట్లు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతృత్వంలో నవంబర్ 30న జరిగిన 14 విపక్ష పార్టీల భేటీకి టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు హాజరయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల మూలంగా ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కూ బీజేపీకీ మధ్య కొనసాగిన సందేహాస్పద, అనుమానాస్పద సంబంధాలు కాస్తా శత్రుత్వ సంబంధాలుగా మారాయేమోనన్న సంకేతాలు ప్రజానీకంలోకి వెళ్లాయి. తెలంగాణలోని అన్ని పార్టీలలో, రాజకీయవర్గాలలో, ప్రజలలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తున్నది.

అనేకానేక వ్యూహాలతో

చరిత్రను పరిశీలిస్తే, టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచీ కూడా ఆ పార్టీ కేంద్ర స్థాయిలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో, రాష్ట్రస్థాయిలో టీడీపీతో అవకాశవాద, అవసరార్థ సంబంధాలనే కొనసాగించింది. 2004 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రివర్గంలో సైతం చేరింది. రెండేళ్లు తిరగకముందే బయటకు వచ్చింది. 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రాంతీయపార్టీ అయిన టీడీపీతో చేతులు కలిపింది. 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి దూరమై కలిసివచ్చే వర్గాలతో విశాల ఐక్యసంఘటన (జాయింట్ యాక్షన్ కమిటీ)ను ఏర్పరచి సుదీర్ఘ పోరాటం కొనసాగించింది. దేశంలోని వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడానికి అనేక రకాల ఎత్తుగడలను అనుసరించింది. తెలంగాణ ఇచ్చిన పక్షంలో టీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని, అవసరమైతే సోనియమ్మ ఇంటికి కాపలాకుక్కగా ఉంటానని కేసీఆర్ పలు సందర్భాలలో చెప్పారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీని సైతం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించేలా రాజకీయ చాణక్యం నెరిపారు.

విపక్షాలను వెంటాడి, వేటాడి

అయితే, తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తక్షణం కేసీఆర్ మాట మార్చారు. కుటుంబసభ్యులతో ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసివచ్చిన తర్వాత తన దాడిని ప్రధానంగా కాంగ్రెస్ పైనే ఎక్కుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీని తూర్పారపట్టారు. తెలంగాణ సాధన ఎవరి భిక్షా కాదని, తన ఆమరణ దీక్ష, విద్యార్థి-ఉద్యోగ వర్గాల, ప్రజల పోరాటపటిమ మూలంగానే కేంద్రం దిగివచ్చిందని ప్రకటించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలను తెలంగాణ ద్రోహులని, చవటలు-దద్దమ్మలని అభివర్ణించారు. ఆ ఎన్నికలలో బొటాబొటి మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరచిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలను నయానో భయానో తమ పార్టీలో చేర్చుకున్నారు. ఎంఐఎం మినహా రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేని రీతిలో పాలన సాగించారు. అయినా మొదటి దఫా పాలనలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మానలేదు. చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపిన చందంగా అప్పటికే ఫిరాయింపులతో కుదేలైన ఆ పార్టీ నాయకులను బఫూన్లు చేసి ఆడుకున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌నే ప్రత్యర్థిగా భావించి ప్రచారంలో చీల్చి చెండాడారు.

విమర్శించింది తక్కువే

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 2014 ఎన్నికల నుంచి మొన్నటి వడ్ల కొనుగోలు పంచాయతీ వరకు ఏడేళ్ల కాలంలో కేసీఆర్.. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించిన సందర్భాలు చాలా తక్కువ. 2018 'ముందస్తు'కు ముందు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల విషయంలో ఒకసారి అమిత్ షాను ఢీకొనడం మినహా ఆయన కేంద్రంతో, బీజేపీతో సఖ్యంగానే ఉన్నారు. కేటీఆర్, ఇతర ద్వితీయ శ్రేణి నేతలు అప్పుడప్పుడు కమలనాథులను దుయ్యబట్టినా అవి పసలేని విమర్శలుగానే మిగిలిపోయాయి. పైగా, కీలకమైన అన్ని సందర్భాలలోనూ చట్టసభలలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలోనూ ఆ పార్టీకే మద్దతునిచ్చింది. ఈ కాలంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన పలువురు కేంద్రమంత్రులు కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

దూకుడు పెంచిన బీజేపీ

కాగా, 2020 నవంబర్ దుబ్బాక ఉపఎన్నికల నుంచీ రాష్ట్ర బీజేపీ అధికార పార్టీపై తన దూకుడును పెంచింది. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ మంచి ఫలితాలనే సాధించింది. ఈ క్రమంలో అధ్యక్షుడు బండి సంజయ్‌, డైనమిక్ నేత ధర్మపురి అరవింద్‌ తదితర నేతలు కేసీఆర్ పాలనపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమన్నారు. అమిత్ షా తెలంగాణపై దృష్టి సారించారని, వచ్చే ఎన్నికలలో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. కేసీఆర్‌కు కుడిభుజంగా పేరున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత జూన్‌లో కమలం పార్టీలో కలువడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా నిలువడం, ఈటల భారీ మెజారిటీతో గెలువడం, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడంతో ఇక తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న వాతావరణం ప్రజలలో ఏర్పడింది.

కొత్త ఎత్తుగడలతో

సరిగ్గా ఈ పరిస్థితులలో కేసీఆర్ తన వ్యూహం మార్చారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెట్టిన విల్లు-బాణాలను బీజేపీ వైపు తిప్పారు. వడ్ల కొనుగోలు వ్యవహారం సమయానికి అందివచ్చింది. నెల రోజుల నుంచీ ఆ పార్టీపై విడువకుండా విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. బీజేపీ ఓ హంతక పార్టీ అని, మోడీది రైతు వ్యతిరేక రాబందు ప్రభుత్వమని, ఏడేళ్ల పాలనలో దేశంలో ఆకలికేకలు పెరిగాయని దుమ్మెత్తిపోస్తున్నారు. పార్లమెంటులో గళమెత్తమని పార్టీ ఎంపీలకు నిర్దేశించారు. 14 విపక్ష పార్టీల సమావేశానికి కేకేను పంపి ఇకముందు తమ పార్టీ ఎన్‌డీ‌ఏ వైపు ఉండబోదన్న సంకేతాలను పంపించారు. తనకున్న పాత పరిచయాలను ఉపయోగించి కేకే సీనియర్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం.

అపోహ కలిగిస్తున్నారా?

కేసీఆర్‌ను ఎవరు, ఎంతమేరకు నమ్ముతారన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలుస్తానని మోసం చేసిన వ్యక్తిని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా చేరదీస్తారా? పలు కీలక సందర్భాలలో మోడీ విధానాలను సమర్థించిన టీఆర్ఎస్‌ను మమత, శరద్‌పవార్, స్టాలిన్‌లాంటి థర్డ్ ఫ్రంట్ నేతలు విశ్వసిస్తారా? చెప్పడం కష్టమే. వాళ్లు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం. ఏడేళ్ల పాటు మోడీ-షా ద్వయంతో సందేహాస్పద సంబంధాలను కొనసాగించి రాష్ట్ర బీజేపీ నేతల గాలి తీసేసిన కేసీఆర్, ఇప్పుడు యూపీఏకు దగ్గరై, మంచి ఊపుమీదున్న రేవంత్‌రెడ్డిని బక్‌రా చేయడం మాత్రం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ఏ నాయకునితోనూ, ఏ పార్టీతోనూ పూర్తిగా మిత్రుత్వ వైఖరినో, లేదంటే పూర్తిగా శత్రుత్వ వైఖరినో అనుసరించరని, తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు వాడుకుంటారని వీరంటున్నారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్‌తో స్నేహం చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అదే కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా పరిగణించారని, కమలనాథులతో దగ్గరగా ఉంటున్నట్లు వ్యవహరించారని చెబుతున్నారు. మారిన పరిస్థితులలో ఇప్పుడు బీజేపీని శత్రువుగా చూస్తూ కాంగ్రెస్‌, థర్డ్ ఫ్రంట్ తనకు దగ్గర అన్న అపోహను కలిగిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

గులాబీ దళానికి లాభమే

కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహం మూలంగా ఏ రకంగా చూసినా టీఆర్ఎస్‌కు లాభమే కాని నష్టం లేదు. రాష్ట్రమంతటా ప్రభుత్వ వ్యతిరేక పవనాలున్న పరిస్థితులలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడం కష్టమే. అలాంటప్పుడు అయితే బీజేపీ నుంచో లేకపోతే కాంగ్రెస్ నుంచో ఆ పార్టీకి మద్దతు అవసరమవుతుంది. ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ తనకు బేషరతు మద్దతును ప్రకటించే స్థితిని కేసీఆర్ తయారు చేసుకుంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉంది కనుక ఈలోపు దేశ, రాష్ట్ర ప్రజానీకం మూడ్‌ను గమనించి, తనకు రాజకీయంగా లాభించే కూటమి వైపు వెళ్లే స్వేచ్ఛ, వెసులుబాటు ఆయనకు ఉండనే ఉంటుంది. అప్పటివరకు ఆయన తన వ్యూహాలను, ఎత్తుగడలను చదరంగాన్ని తలదన్నే రీతిలో మార్చుకోవచ్చు. ఆడుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలను మూడు చెరువుల నీళ్లు తాగించనూవచ్చు. ఏమంటారు?

డి. మార్కండేయ

Advertisement

Next Story

Most Viewed