ఓటర్లా? బిచ్చగాళ్లా!?

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:18:15.0  )
ఓటర్లా? బిచ్చగాళ్లా!?
X

వివిధ రకాల పన్నుల ద్వారా 2020-21లో తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.87 వేల 926.9 కోట్లు. ఇందులో నుంచే రేషన్ బియ్యం, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, బీమా, గొర్రెలు-బర్రెల పంపిణీ తదితర అన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న మొత్తం రూ.56 వేల 215.75 కోట్లు. అనగా, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల నుంచే కేసీఆర్ ప్రభుత్వం వివిధ స్కీంల కింద అదే ప్రజలకు లబ్ధిని చేకూరుస్తోంది. అదీ 50శాతం కంటే ఎక్కువ మంది అనర్హులకు.. బాగా బతుకుతున్నవాళ్లకు.. ఆస్తులను, ఆదాయాన్ని దాచిపెట్టి అక్రమంగా తెల్లరేషన్ కార్డులు పొందినవాళ్లకు.. లక్షల ఆస్తులున్న ఆసాములకు.. పదుల ఎకరాలున్న భూస్వాములకు.

ఓట్ల కోసం జనాకర్షక పథకాలు ప్రకటించడం మనదేశంలో 1970లలోనే మొదలైనా పీవీ ప్రధానిగా తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ-ప్రైవేటీకరణ విధానాల వలన పుంజుకున్నాయి. మన్మోహన్ సింగ్ హయాంలో మరింత జోరందుకున్నాయి. విదేశీ బహుళజాతి సంస్థల నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులు వరదలా వచ్చాయి. ఆ వర్గాల నుంచి అధికారిక-అనధికారిక విరాళాలు వైట్-బ్లాక్ మనీ రూపంలో అధికార పార్టీలకు పెద్దయెత్తున కమీషన్లు రావడం మొదలైంది. పార్టీల వద్ద డబ్బు నిల్వలకు కొదవ లేకుండాపోయింది. ప్రభుత్వాలకు వచ్చిన పెట్టుబడులను అధికారికంగానే ఓట్లను రాబట్టుకునే పథకాలకు మళ్లించడం సాధారణమైంది. బడ్జెట్లలో జనాకర్షక పథకాలకు కేటాయింపుల శాతం క్రమంగా పెరుగుతుంటే, విద్య-వైద్యం వంటి కీలక రంగాలకు, శాశ్వత ఫలాలనిచ్చే అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపుల శాతం బాగా తగ్గుతోంది.

అలాకాకుండా పన్నులు పెంచుతాం.. అప్పులు తెస్తాం.. ఆస్తులు అమ్ముతాం.. మేం పెట్టే భిక్షతో కష్టపడకుండా కూర్చుని తినండి.. చాలీచాలని బతుకులు గడపండి.. కొత్త పథకాల కోసం, నోట్లను రాల్చే ఓట్ల కోసం ఎదురుచూడండి.. మాకు మాత్రమే ఓటేయండి.. ఇదేనా! పాలకపార్టీలు ప్రజలకు ఇచ్చే సందేశం?


సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా అనేక మంది అధికార పార్టీ నేతలు తరచూ ప్రకటిస్తుంటారు. ఆ పథకాలపై విపక్షాల, ప్రజాసంఘాల విమర్శలు ఎలా ఉన్నా ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు, కేటాయిస్తున్నన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదనేది కాదనలేని వాస్తవం. 2021 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన 'రాష్ట్రాల బడ్జెట్ల అధ్యయన నివేదికలో పేర్కొన్న ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల పద్దు కింద ఖర్చు పెట్టిన నిధుల మొత్తం రూ. 4 లక్షల 48 వేల 395.1 కోట్లు. ఆయా బడ్జెట్లలో ఈ ఖర్చు 2014-15 నుంచి 2021-22 వరకు వరసగా 39.2 శాతం, 43.6 శాతం, 39.4 శాతం, 41.8 శాతం, 42.0 శాతం, 40.5 శాతం, 42.1 శాతం, 42.7 శాతంగా ఆర్‌బీఐ నివేదికలో పేర్కొన్నారు.

పథకాలకు అనేక వేల కోట్లు

పైన చెప్పిన నిధుల కేటాయింపులతో తెలంగాణ ప్రభుత్వం 90 లక్షలకు పైగా కుటుంబాలకు ఒక్కో సభ్యుడికి నెలకు ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. 39 లక్షలకు పైబడిన వ్యక్తులకు నెలకు రూ. 2016 లేదంటే రూ. 3016 చొప్పున ఆసరా పింఛన్లు అందిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున గుంట నుంచి వందల ఎకరాల భూములున్న 56 లక్షలకు పైగా రైతులకు బ్యాంకు అకౌంట్లలో జమచేస్తోంది. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తోంది. 60 ఏళ్ల లోపున్న 32 లక్షలకు పైగా రైతులకు రూ.5 లక్షల మొత్తానికి ఏటా జీవితబీమా ప్రీమియం చెల్లిస్తోంది. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఏటా ఆరు లక్షల కుటుంబాలకు రూ. లక్షా 116 అందజేస్తోంది. విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, గొర్రెలు, గేదెల పంపిణీ, చేపపిల్లల పెంపకం, సబ్సిడీ ట్రాక్టర్లు, ఇతర వాహనాల అందజేత, వడ్డీలేని/పావలా వడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ, ఎస్సీ-ఎస్టీ-బీసీ కార్పొరేషన్ల కింద మరెన్నో స్కీంల కోసం కూడా రూ. వేలాది కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్తగా అమలు చేస్తున్న దళితబంధు కింద అర్హులైన ఎస్సీ కుటుంబాలకు రూ.10లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకాలన్నీ అర్హులకే అందుతున్నాయా? లేక అనర్హులకు చెందుతున్నాయా? అనే విషయం పక్కన పెడితే తెలంగాణలోని మొత్తం ఒక కోటి మూడు లక్షల కుటుంబాలలోనే ఎవరో కొందరికి అందుతున్న మాట నిజం.

అప్పు చేసి పప్పు కూడు

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని, ఖర్చును అనగా బడ్జెట్ స్వరూపాన్ని స్థూలంగా సామాన్యుడి భాషలో చెప్పుకుందాం. 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని కేస్ స్టడీగా తీసుకుందాం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఆ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయం (సవరించిన అంచనాలు) రూ. ఒక లక్షా 17వేల 757.84 కోట్లు. ఇందులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తం రూ.87 వేల 926.9 కోట్లు. ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాల నుంచి, ప్రభుత్వరంగ సంస్థల లాభాల నుంచి, సామాజిక సేవల నుంచి, వడ్డీల నుంచి, కేంద్ర గ్రాంట్ల నుంచి వచ్చిన ఆదాయం రూ.29 వేల 830.94 కోట్లు. కాగా, ఇదే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద పెట్టిన మొత్తం ఖర్చు రూ.ఒక లక్షా 33 వేల 984.31 కోట్లు. ఇందులో వివిధ రకాల సంక్షేమ, జనాకర్షక పథకాల కోసం రూ.56 వేల 215.75 కోట్లు ఖర్చు చేసింది. అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక కార్యకలాపాల కోసం రూ.43 వేల 989.39 కోట్లు వెచ్చించింది. పోలీసులు సహా ప్రభుత్వోద్యోగుల వేతనాలు, రిటైరైన వారికి పెన్షన్లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు గ్రాంట్లు, పరిపాలన-నిర్వహణ, విరాళాలు వగైరా అభివృద్ధేతర పద్దుల కింద రూ. 33 వేల 769.06 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం రాష్ట్రం ఆదాయం కంటే పెట్టిన ఖర్చు రూ.16 వేల 226.47 కోట్లు ఎక్కువ. దీనినే బడ్జెట్ భాషలో రెవెన్యూలోటుగా పిలుస్తారు. ఈ లోటును కేసీఆర్ సర్కారు అప్పులు చేసి సమకూర్చుకున్నది.

బాకీలు బాగానే ఉన్నాయి

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.2 లక్షల 12 వేల 122.2 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చుకున్న అప్పులు రూ.43 వేల 784 కోట్లు. ఇందులో నుంచి పాత అప్పులకు వడ్డీలు, ఇన్‌స్టాల్మెంట్లు చెల్లించగా మిగిలిన సొమ్ము రూ.16 వేల 226.47 కోట్లను రెవెన్యూ లోటును పూడ్చడానికి వాడుకున్నారు. ఆ ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రారంభంలో రిజర్వు బ్యాంకులో తెలంగాణ అకౌంట్‌లో రూ.1689.15 కోట్ల ఓపెనింగ్ బ్యాలన్స్ ఉండగా, ఏడాది ముగిసిన తర్వాత.. 2021 మార్చ్ 31 నాటికి రూ.1676.22 కోట్ల క్లోజింగ్ బ్యాలన్స్ మిగిలివుంది.

ఆస్తిపరులకూ, అసాములకూ

ఇక ఈ లెక్కల గందరగోళం నుంచి అసలు విషయానికి వద్దాం. వివిధ రకాల పన్నుల ద్వారా 2020-21లో తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.87 వేల 926.9 కోట్లు. ఇందులో నుంచే రేషన్ బియ్యం, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, బీమా, గొర్రెలు-బర్రెల పంపిణీ తదితర అన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న మొత్తం రూ.56 వేల 215.75 కోట్లు. అనగా, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల నుంచే కేసీఆర్ ప్రభుత్వం వివిధ స్కీంల కింద అదే ప్రజలకు లబ్ధిని చేకూరుస్తోంది. అదీ 50 శాతం కంటే ఎక్కువ మంది అనర్హులకు. బాగా బతుకుతున్నవాళ్లకు. ఆస్తులను, ఆదాయాన్ని దాచిపెట్టి అక్రమంగా తెల్లరేషన్ కార్డులు పొందినవాళ్లకు. లక్షల ఆస్తులున్న ఆసాములకు. పదుల ఎకరాలున్న భూస్వాములకు. అయినా, తమ ప్రభుత్వం సంక్షేమం అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉందని అధికార పార్టీ చెప్పుకోగలుగుతోంది. వృద్ధులు తమ పెద్దకొడుకుగా, రైతులు ఆపద్బాంధవుడిగా, ఆడపడుచులు ఆప్తుడిగా, పేదలు అన్నదాతగా కేసీఆర్‌ను కొలుస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. 2018 ఎన్నికలలో మలిదఫా ఆయన అధికారంలోకి వచ్చింది రైతుబంధు పేరిట రాష్ట్ర ఓటర్లలో సగానికి పైగా కుటుంబాలకు ఎకరాకు రూ.4 వేలు జమచేయడం, లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని, 30లక్షలకు మించిన ఓటర్లకు ఆసరా పింఛన్లను పెంచుతామని హామీ ఇవ్వడమేనన్న విషయం జగమెరిగిన సత్యం.

ఓట్ల కోసమే ఈ తంటాలన్నీ

ఓట్ల కోసం జనాకర్షక పథకాలు ప్రకటించడం మనదేశంలో 1970లలోనే మొదలైనా పీవీ ప్రధానిగా తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ-ప్రైవేటీకరణ విధానాలతో వలన పుంజుకున్నాయి. మన్మోహన్‌ సింగ్ హయాంలో మరింత జోరందుకున్నాయి. విదేశీ బహుళజాతి సంస్థల నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులు వరదలా వచ్చాయి. ఆ వర్గాల నుంచి అధికారిక-అనధికారిక విరాళాలు వైట్-బ్లాక్ మనీ రూపంలో అధికార పార్టీలకు పెద్దయెత్తున కమీషన్లు రావడం మొదలైంది. పార్టీల వద్ద డబ్బు నిల్వలకు కొదవ లేకుండాపోయింది. ప్రభుత్వాలకు వచ్చిన పెట్టుబడులను అధికారికంగానే ఓట్లను రాబట్టుకునే పథకాలకు మళ్లించడం సాధారణమైంది. ఎన్నికల కోడ్ రావడానికి ముందే ఆయా ప్రభుత్వాలు ప్రజలను ప్రలోభపెట్టే పథకాలు కుప్పలు తెప్పలుగా అమలుచేస్తున్నాయి. ఆడపిల్లలకు సైకిళ్లను ఇవ్వడం నుంచి ఇంటింటికి కలర్ టీవీలు, మిక్సర్-గ్రైండర్లు, ఫ్యాన్లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం వరకు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నుంచి రుణమాఫీ వరకు ఎన్నో ఓటరు ఆకర్షక పథకాలు ప్రకటించడం, అమలు చేయడం ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. అధికారంలోకి రావడానికి సులువైన మార్గంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కేసీఆర్ రైతుబంధు ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. ఏపీ, ఒడిషా, బెంగాల్, ఢిల్లీ, యూపీ తదితర అనేక రాష్ట్రాలు ప్రస్తుతం ఉచితాల దారిలో నడుస్తున్నాయి. బడ్జెట్లలో జనాకర్షక పథకాలకు కేటాయింపుల శాతం క్రమంగా పెరుగుతుంటే, విద్య-వైద్యం వంటి కీలక రంగాలకు, శాశ్వత ఫలాలనిచ్చే అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపుల శాతం బాగా తగ్గుతోంది.

ఇది నేరం కాదా మరి?

ఎన్నికలకు ముందు అధికారిక పథకాలతో ఓటర్లను ప్రలోభపెట్టడం, పోలింగ్‌కు ముందు అనధికారికంగా ఓటుకు నోటును ఎరవేయడం.. అవినీతి-లంచగొండితనం కిందికి రాదా? ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల భిక్ష కోసం ఎదురుచూసేలా ప్రజలను తయారుచేయడం నేరం కాదా? ఇంతకంటే కేవలం అర్హులైన కటిక దారిద్ర్యంలో ఉన్న నిరుపేదలకు కనీస వసతులు కల్పించి, నిర్ధిష్ట ఆదాయ పరిమితి లోపల ఉన్న పౌరులందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడి బతికేలా చేస్తే సరిపోదా? పశ్చిమదేశాలు ఇలా సక్సెస్‌ఫుల్‌గా చేయడం లేదా? మన ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి ఎందుకు కొరవడింది? స్వార్థమా? అధికార వ్యామోహమా?

పాలకుల సందేశమేమిటో?

అలాకాకుండా పన్నులు పెంచుతాం.. అప్పులు తెస్తాం.. ఆస్తులు అమ్ముతాం.. మేం పెట్టే భిక్షతో కష్టపడకుండా కూర్చుని తినండి.. చాలీచాలని బతుకులు గడపండి.. కొత్త పథకాల కోసం, నోట్లను రాల్చే ఓట్ల కోసం ఎదురుచూడండి.. మాకు మాత్రమే ఓటేయండి.. ఇదేనా! పాలకపార్టీలు ప్రజలకు ఇచ్చే సందేశం..?

-డి మార్కండేయ

Advertisement

Next Story

Most Viewed