- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదోళ్లంటే ఎవరు?
మన దేశంలో పేదరికం నిర్ధారణలో మొదటి నుంచీ ఒక నిర్ధిష్ట విధానమంటూ ఏ ప్రభుత్వమూ అనుసరించలేదు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి 1951 నుంచీ 2020 వరకు మొత్తం 78 జాతీయ శాంపిల్ సర్వేలు జరిగాయి. దేశంలోని అన్ని కుటుంబాలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించే ఈ సర్వేలో ఏటా పేదరికాన్ని కొలిచేందుకు అవసరమైన అన్ని రకాల వివరాలను సేకరిస్తారు. అయినప్పటికీ ఈ 70 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వమూ పేదరికాన్ని నిర్వచించి, కరెన్సీ రూపంలో సంవత్సరాదాయ పరిమితులను నిర్ణయించి, దేశంలో ఇంతమంది పేదలున్నారని అధికారికంగా ప్రకటించలేకపోయింది.
అసలు సమస్యంతా ఈ తెల్లకార్డుల జారీ ప్రక్రియలోనే ఉంది. ఎవరు రేషన్ కార్డుకు అప్లయి చేసుకున్నా కొంచెం పలుకుబడో, పైసల పెట్టుబడో ఉంటే తప్పకుండా మంజూరయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి స్థిరచరాస్తులు, ఆదాయవివరాలు కనుక్కునే యంత్రాంగమేదీ లేదు. ఆధార్ కార్డు ఆధారంగా చెకింగ్ ఉండదు. మీసేవ కేంద్రానికి వెళ్లి కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు జతచేసి, అప్లికేషన్‌లో అడిగిన వివరాలను నింపి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తే చాలు. నిర్ధిష్ట కాలవ్యవధిలో కార్డు మంజూరవుతుంది.
తెలంగాణలో ఉన్న మొత్తం కోటి మూడు లక్షల కుటుంబాలలో ఇప్పటికే 90 లక్షల 47 వేల తెల్లకార్డులున్నా, మరో 4 లక్షల 46 వేల కొత్త కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెల్లకార్డులు లేని 12.50 లక్షల కుటుంబాల్లో మరికొందరు పేదలు ఉన్నారనా? ఓటుబ్యాంకును పెంచుకోవడానికా? ఈ కొత్తకార్డులను కలుపుకుంటే, ఇక రాష్ట్రంలో పేదలు కాని కేటగరీలో ఉన్న కుటుంబాలు కేవలం 8 లక్షలే మిగులుతాయి. వాళ్లేం పాపం చేశారు? మొత్తం కోటి మూడు లక్షల కుటుంబాలను పేదలుగానే గుర్తించి, అందరికీ తెల్లకార్డులిస్తే బాగుంటుంది. దరఖాస్తుదారులకు అప్లయి ఇబ్బందులు, అధికారులకు టైం వేస్ట్, ప్రభుత్వానికి కార్డుల జారీ ఖర్చు దండగ అనుకుంటే, రాష్ట్ర జనాభా అంతా పేదలేనని ఒక జీవో జారీ చేయండి. చాలు.
అదేం అమాయకపు ప్రశ్న! తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని వాళ్లందరూ పేదలే కదా! ఆ మాత్రం తెలియదా? అని ఆశ్చర్యపోకండి. తెలంగాణలో, జాతీయస్థాయిలో, ప్రపంచదేశాలలో పేదోళ్లంటే ఇచ్చే నిర్వచనం వేర్వేరుగా ఉంది. కొన్నిచోట్ల ఇన్ని మెతుకులు దొరికితే చాలనే పరిస్థితి వుంటే, మరికొన్ని చోట్ల దేశ సగటు జనాభా అనుభవిస్తున్న సకల సౌకర్యాలలో కనీసం 50శాతం కంటే ఎక్కువ ఉండాలనే కొలమానం ఉంది. మన రాష్ట్రాన్నే తీసుకుంటే వార్షికాదాయం పల్లెలలో అయితే రూ. లక్షా యాభై వేలు, పట్టణాలలో అయితే రూ. రెండు లక్షలకు మించనివాళ్లను పేదలుగా పరిగణిస్తున్నారు. ఇక 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం నెలకు గ్రామీణప్రాంతాలలో రూ. 1060, పట్టణప్రాంతాలలో రూ. 1286 ఖర్చు చేసే స్థితిలో లేని కుటుంబాలు దారిద్ర్యరేఖకు (బీపీఎల్) దిగువన ఉన్నట్లు లెక్కిస్తున్నారు.
వివిధ దేశాలలో
ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలున్నాయని భావిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో సమాజం సగటున అనుభవిస్తున్న సౌకర్యాలు, సేవలు అందక, దీనావస్థలో ఉన్నవారందరినీ పేదలుగా పరిగణిస్తున్నారు. డబ్బుల లెక్కలలో చూస్తే ఏటా 12,880 డాలర్లు (రూ. 9 లక్షల 57 వేలు) ఖర్చు చేయని ఒక వ్యక్తి లేదా 26,500 డాలర్లు (రూ. 19 లక్షల 69 వేలు) వెచ్చించలేని నలుగురు సభ్యులున్న కుటుంబం పేదరికంలో ఉన్నట్లుగా ఆ దేశం భావిస్తోంది. తమ దేశంలోని కుటుంబాల సగటు సంవత్సరాదాయంలో కనీసం 60శాతం సంపాదన లేని కుటుంబాలను పేదలుగా గ్రేట్ బ్రిటన్ గుర్తిస్తోంది. కరెన్సీ రూపంలో అయితే, 2014-15లో నిర్ణయించిన ప్రకారం అక్కడి కుటుంబాల సగటు సంవత్సరాదాయం 24,596 పౌండ్లు (రూ. 24 లక్షల 68 వేలు) ఇందులో 60 శాతం కంటే తక్కువ అంటే ఏటా 14,758 పౌండ్లు (రూ.14 లక్షల 81 వేలు) సంపాదించలేని కుటుంబాలన్నీ పేదరికంలో ఉన్నట్టేనని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని పలు పేదదేశాలో ఆకలి కేకలు రాజ్యం చేస్తున్న స్థితిలో తినడానికి ఇంత తిండి దొరికితే చాలన్న పరిస్థితి ఉంది. పేదరికం అంశాన్ని పట్టించుకునే పరిస్థితులలో అక్కడి ప్రభుత్వాలు లేవు.
శాంపిల్ సర్వేలు జరిగినా
నిజానికి మన దేశంలో పేదరికం నిర్ధారణలో మొదటి నుంచీ ఒక నిర్ధిష్ట విధానమంటూ ఏ ప్రభుత్వమూ అనుసరించలేదు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి 1951 నుంచీ 2020 వరకు మొత్తం 78 జాతీయ శాంపిల్ సర్వేలు జరిగాయి. దేశంలోని అన్ని కుటుంబాలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించే ఈ సర్వేలో ఏటా పేదరికాన్ని కొలిచేందుకు అవసరమైన అన్ని రకాల వివరాలను సేకరిస్తారు. అయినప్పటికీ ఈ 70 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వమూ పేదరికాన్ని నిర్వచించి, కరెన్సీ రూపంలో సంవత్సరాదాయ పరిమితులను నిర్ణయించి, దేశంలో ఇంతమంది పేదలున్నారని అధికారికంగా ప్రకటించలేకపోయింది. 1978లో నిపుణుల కమిటీ సూచన ఆధారంగా ప్రణాళికా సంఘం (ప్రస్తుతం నీతీ ఆయోగ్) తొలిసారిగా దారిద్ర్యరేఖ విషయంలో కొన్ని నిర్ధారణలకు వచ్చింది. రోజుకు పట్టణాలలో 2,100 కిలో కేలరీలు, పల్లెలలో 2,400 కిలో కేలరీలు ఆహారం రూపంలో పొందలేని జనాభాను పేదలుగా పరిగణించాలని ప్రతిపాదించింది. అప్పటి (1978) ధరల ఆధారంగా ఏటా పల్లెలలో రూ.741, పట్టణాలలో రూ.855 ఖర్చు పెట్టలేనివాళ్లను పేదల కింద చేర్చింది. ఆ తర్వాత ప్రతి యేటా జరిగే నేషనల్ శాంపిల్ సర్వేలను ఆధారం చేసుకుని, ద్రవ్యోల్బణంతో గణించి ఎప్పటికప్పుడు ఎవరు పేదలో అంకెలు విడుదల చేస్తూ వస్తున్నది. అయితే, ఏ ప్రభుత్వమూ ఈ ప్రాతిపదికను చట్టబద్ధం చేయలేదు.
అనేకానేక విమర్శలు
కాగా, పేదరికాన్ని నిర్ధారించే పద్ధతిపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రణాళిక సంఘం ప్రకటిస్తున్న అంకెలు ఓ వ్యక్తి తీసుకునే ఆహారం కొనడానికి ఏమాత్రం సరిపోవని, పేదరికాన్ని తక్కువ చేసి చూపడానికే ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా ఉన్న ప్రణాళిక సంఘం ఈ పని చేస్తోందని పలువురు మేధావులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే 1971లో దండేకర్-రథ్ కమిటీ, 1979లో అలఘ్ కమిటీ, 1993లో డీటీ లక్డావాలా కమిటీ, 2005లో సురేష్ టెండూల్కర్ కమిటీ, 2009లో ఎన్‌సీ సక్సేనా కమిటీ, 2012లో రంగరాజన్ కమిటీ.. ఇలా అనేక కమిటీలను సర్కారు నియమించి పేదరికంపై అధ్యయనం చేయించింది. ఇవి పేజీల కొద్దీ నివేదికలు సమర్పించాయి. అన్ని కమిటీల నివేదికల వివరాలకు వెళ్లకుండా చివరిది అయిన రంగరాజన్ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం.
ఇదీ అసలు పరిస్థితి
ఏటా పల్లెలలో రూ.11 వేల 664, పట్టణాలలో రూ.16వేల 884 ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నవాళ్లను దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలుగా పరిగణించాలని సూచించింది. ఈ మేరకు 2014 జూన్ 30న కమిటీ ఇచ్చిన నివేదిక వివరాలను అప్పటి కేంద్ర పథకాల అమలు, గణాంకాల శాఖ సహాయమంత్రి రావ్ ఇందర్‌జిత్‌సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఆయా వ్యక్తుల వయస్సు, లింగం, చేసే పనిని బట్టి ఎంత మొత్తంలో కిలో కెలరీలు, ప్రొటీన్లు, ఫ్యాట్స్ అవసరమవుతాయో ఆ ప్రాతిపదికన ఒక వ్యక్తికి రోజువారీగా ఎంత ఖర్చవుతుందో ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన సంస్థ) చెప్పిన ప్రకారం పై ఆదాయ పరిమితులను కమిటీ నిర్ణయించింది. ఇలా చూస్తే, ప్రాథమికంగా పల్లెలలో అయితే, రోజుకు 2,155 కిలో కేలరీలు, పట్టణాలలో అయితే 2,090 కిలో కేలరీలు ప్రతి వ్యక్తికీ అవసరమవుతాయని వెల్లడించింది.
పట్టించుకోని ప్రభుత్వాలు
అయితే, గత ప్రభుత్వాలలాగే మోడీ ప్రభుత్వం కూడా రంగరాజన్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసింది. ఇప్పటికి ఏడేళ్లు గడిచినా ఎలాంటి తదుపరి చర్యా చేపట్టలేదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2022 ఆగస్టు 15 కల్లా దేశంలో పేదరికాన్ని, అవినీతిని అంతమొందిస్తామని 2020 జూలైలోనే ప్రధాని గొప్పలు చెప్పారు. వరుస కమిటీల నివేదికలను, చివరి కమిటీ అంతిమ నివేదికను పట్టించుకోకుండా, పేదలెవరో, ఆదాయ పరిమితులేంటో, పల్లెలు-పట్టణాలలో ఎంతెంతో చట్టబద్ధంగా నిర్ణయించకుండా.. పేదరికాన్ని ఎలా గుర్తిస్తారు? ఏ విధానాల ద్వారా నిర్మూలిస్తారన్నది వేయి డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. రోజుకు పల్లెలలో 2,155 కిలో కేలరీలు, పట్టణాలలో 2,090 కిలో కేలరీలు పొందే పోషకాహారం లభించాలంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి పల్లెటూరులో రూ.11 వేల 664, పట్టణాలలో రూ.16 వేల 884 ఏమాత్రం సరిపోవని అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోదు. నిర్ధిష్ట అధ్యయనం జరిపించి, ఆ ప్రకారం ఆదాయ పరిమితులను నిర్ణయించదు. పేదలను గుర్తించి వారికి ఆర్థిక చేయూతను అందించదు. బహిరంగసభలలో మాత్రం ఆయన ఉపన్యాసాలు మానవీయంగా, భావోద్వేగంగా సాగుతుంటాయి.
ఎవరికివారే పరిమితులు
సంవత్సరాదాయ పరిమితి వాస్తవ దూరంగా ఉందని గుర్తించిన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను గుర్తించడానికి తమకు తామే వేర్వేరుగా పరిమితులను నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో ఈ ఆదాయ పరిమితి ఏటా పల్లెలలో రూ.1 లక్షా 50 వేలు, పట్టణాలలో రూ.2 లక్షలుగా ఉంది. ఈ మేరకే కేసీఆర్ సర్కారు తెల్లకార్డులను జారీ చేస్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, అసలు సమస్యంతా ఈ కార్డుల జారీ ప్రక్రియలోనే ఉంది. ఎవరు రేషన్ కార్డుకు అప్లయి చేసుకున్నా కొంచెం పలుకుబడో, పైసల పెట్టుబడో ఉంటే తప్పకుండా మంజూరయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి స్థిరచరాస్తులు, ఆదాయవివరాలు కనుక్కునే యంత్రాంగమేదీ లేదు. ఆధార్ కార్డు ఆధారంగా చెకింగ్ ఉండదు. మీసేవ కేంద్రానికి వెళ్లి కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు జతచేసి, అప్లికేషన్‌లో అడిగిన వివరాలను నింపి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తే చాలు. నిర్ధిష్ట కాలవ్యవధిలో కార్డు మంజూరవుతుంది.
సీఎం సార్ ఆలోచించండి
ఈ పరిస్థితులలో తెలంగాణలో ఉన్న మొత్తం కోటి మూడు లక్షల కుటుంబాలలో ఇప్పటికే 90 లక్షల 47 వేల తెల్లకార్డులున్నా, మరో 4 లక్షల 46 వేల కొత్త కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెల్లకార్డులు లేని 12.50 లక్షల కుటుంబాలలో మరికొందరు పేదలు ఉన్నారనా? ఓటుబ్యాంకును పెంచుకోవడానికా? ఈ కొత్తకార్డులను కలుపుకుంటే, ఇక రాష్ట్రంలో పేదలు కాని కేటగరీలో ఉన్న కుటుంబాలు కేవలం 8లక్షలే మిగులుతాయి కదా? వాళ్లేం పాపం చేశారు? మొత్తం కోటి మూడు లక్షల కుటుంబాలను పేదలుగానే గుర్తించి, అందరికీ తెల్లకార్డులిస్తే బాగుంటుందేమో! దరఖాస్తుదారులకు అప్లయి ఇబ్బందులు, అధికారులకు టైం వేస్ట్, ప్రభుత్వానికి కార్డుల జారీ ఖర్చు దండగ అనుకుంటే, ఒక జీవో జారీ చేయవచ్చు. రాష్ట్ర పౌరులందరూ పేదలేనని. అప్పుడు రేషన్ బియ్యానికి, పింఛన్లకు, ఆరోగ్యశ్రీ సహా అన్ని రకాల సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. కేసీఆర్ కనుక ఈ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌నే గెలిపించడం ఖాయం. ఒక్కసారేంటి? ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తే ఎప్పటికీ గెలిపిస్తూనే వుంటారేమో..
మీరేమంటారు? ('సంక్షేమ పథకాలలో మూడోకోణం' వచ్చే వారం)
డి మార్కండేయ
- Tags
- Marokonam