మానవాళి స్వయంకృతాపరాధమే..

by Ravi |   ( Updated:2025-01-04 01:00:17.0  )
మానవాళి స్వయంకృతాపరాధమే..
X

గత రెండు మాసాల కాలం నుండి ప్రాణహిత నదీ తీరం అవతలి వైపు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి అభయారణ్యాల నుండి, తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ ప్రాంతాలలో అడపా దడపా జనావాసాలలోకి ప్రవేశిస్తూ సమీప గ్రామాలలోని ప్రజల ఆవులూ, గొర్రెలు, మేకలతో పాటు మనుషులను సైతం గాయపరుస్తూ, కొన్ని సందర్భాల్లో వారి మరణాలకు కారణమౌతున్నాయంటూ ప్రతిరోజూ పత్రికలూ, ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తలు.. అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులులు అటవీ సమీప గ్రామాల ప్రజలను వెంటాడి వేటాడుతున్నాయనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.

నిజానికి పులికి మనిషి ఆహారం కాదు. దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు జీవించే పులి వంద చదరపు కిలోమీటర్ల పరిధి గల తన ఆవాసంలో ఒంటరిగానే జీవిస్తుంది. కేవలం మేటింగ్ సమయంలో తప్ప తన టెరిటరీలోకి ఏ జంతువునూ పులి అనుమతించదు. ఒక వేల ఏ ఇతర జంతువు గానీ, మనిషి గానీ తన టెరిటరీ‌లోకి ప్రవేశించినప్పుడు, లేదా తన గూడు చెదిరిన పులి తన ఆవాసానికి ఆవల తిరుగుతున్నప్పుడు తనకు ఎదురైన మనిషితో తనకు ప్రమాదముందని భావించినప్పుడు మాత్రమే అది మనిషిపై దాడి చేసి గాయపరుస్తుంది. అంతేకాని మనిషిని తనకిష్టమైన ఆహారంగా భావించి ఎప్పుడూ వేటాడి భుజించదు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే..

ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మనుషుల ప్రాణాలను తీసిన ఏ పులి కూడా తన ఆకలిని తీర్చుకోవడానికి మనుషులను చంపలేదనే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. తమ వృత్తి జీవనంలో భాగంగా అనునిత్యం పులులు, ఇతర క్రూర మృగాల జీవన శైలిని పరిశీలించే వీలున్న క్షేత్ర స్థాయి అటవీశాఖ అధికారులు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే పులులు తమ ఆవాసాలను వదిలి అటవీ సమీప గ్రామాలలోకి ప్రవేశిస్తున్నాయనీ, ఆ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పరుగులు తీస్తున్న పులులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే క్రమంలో చెట్ల పొదల్లో, పంట చేన్లల్లో పనులు చేసుకుంటున్న మనుషులను వెనక నుండి చూసి జంతువులుగా భావించి అవి వారిని గాయపరుస్తున్నాయనేది వైల్డ్ లైఫ్ నిపుణుల నిశ్చితాభిప్రాయం. పైగా ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ ఆడ, మగ పులులు పరస్పరం మేటింగ్ కోసం తహతహలాడే నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే జరగడం గమనార్హం. ఇలాంటి సందర్భాలలో అడవుల్లో పులుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ సదరు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేసే ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అడవి బిడ్డల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదేమోననే భావన సర్వత్ర వెల్లువెత్తుతోంది.

ప్రజలకు అవగాహన కల్పించాలి..

ఓ వైపు అటవీ సంరక్షణ మా ప్రథమ ప్రాధాన్యత అంటూ చెబుతూనే యురేనియం, బాక్సైట్ లాంటి సహజ వనరులను అన్వేషించి వెలికి తీయడం ద్వార సత్వర పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చనే సాకుతో ప్రభుత్వాలు అటవీ సంరక్షణ చట్టాలను సవరిస్తూ వేలాది చదరపు కిలోమీటర్ల అడవుల విధ్వంసానికి తెరదీస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఇక రోజు రోజూ అడవుల్లో పచ్చిక నశిస్తున్నందున జింకలు, కుందేళ్లు, అడవి దున్నలు, అడవి పందుల లాంటి శాఖాహార జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. ఫలితంగా వాటిని ఆహారంగా తీసుకుంటూ బతికే పులులు, చిరుత పులుల్లాంటి క్రూర మృగాలు దట్టమైన అడవుల్లోని తమ శాశ్వత ఆవాసాలను వదిలి అటవీ సమీప గ్రామాలలోకి చొరబడి తమ స్వాభావిక ఆహా రంగా పరిగణించబడని పశువులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. అడపా దడపా ఆత్మరక్షణ కోసం మనుషుల పైన దాడి చేస్తూ వారిని గాయపరుస్తుండడమే చంపడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించే బాధ్యతను అటవీశాఖ త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాల్సిందే. ఇందుకోసం అవసరమైతే ఎంపిక చేసిన అటవీశాఖ అధికారులను డెహ్రాడూన్ లాంటి ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ శిక్షణా కేంద్రాలకు పంపించాలి. అదే విధంగా క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది ఎప్పటి కప్పుడు ట్రాప్ కెమెరాల ద్వారా పులి, చిరుత పులి లాంటి క్రూరమృగాల పగ్ మార్క్‌లను ట్రేస్ చేయడం ద్వారా వాటి కదలికలను గుర్తిస్తూ ఆ ప్రాంత ప్రజ లను అప్రమత్తం చేయాలి. అదే సమ యంలో కలప స్మగ్లర్ల పై ఉక్కు పాదం మోపాలి.

ఈ నష్టాలను ప్రభుత్వమే భరించాలి!

అడవులకు సమీపంలో వుంటూ అడవి మృగాలను వేటాడుతున్న వేటగాళ్లకు చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినా అవసరమైన మేరకు వన్య ప్రాణుల సంరక్షణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటు ఆశించిన ఫలితాలను అందిస్తుందని చెప్పక తప్పదు. అలాగే వన్యప్రాణుల దాడుల మూలాన జరిగిన ప్రాణ నష్టానికి, పంటల నష్టానికి అటవీ చట్టాల ననుసరించి తగు నష్ట పరిహారాన్ని సత్వరమే చెల్లించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, అటవీ శాఖ త్రికరణ శుద్ధిగా నిర్వర్తించినప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతారు. అలా చేయకపోతే మృగాల దాడిలో ప్రజలు చనిపోతే ప్రతీకార చర్యగా ప్రజలు విషప్రయోగం లాంటి మార్గాలతో వాటిని చంపివేయడానికి తెగబడే ప్రమాదం లేకపోలేదు. గతేడాది కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రెండు పులులపై జరిగింది ఇదే! ప్రతి పులి సురక్షిత జీవనానికి అవసరమైన నీరు, అవసరమైన ఆహారాన్ని అన్ని కాలాలలో అందుబాటులో ఉంచినప్పుడు అడవిలో పులి మనుగడ సుస్థిరమౌతుంది. అటవీ సంరక్షణతోనే పులుల సంరక్షణ ముడిపడ్డ నేపథ్యం లో ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అడవుల రక్షణకు కృషి చేసినప్పుడు పులుల రక్షణకు మార్గాలు సుగమమౌతాయి. ఇది చేయగలిగినప్పుడే అటవీ సమీప గ్రామాల ప్రజలు, వారి పశుసంపద సురక్షిత జీవనాన్ని కొనసాగించే అవకాశాలు సుస్థిర మౌతాయి.

- డాక్టర్ నీలం సంపత్,

డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్

98667 67471

Advertisement

Next Story