- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధురవాణి అదరహో..
మధురవాణి గురజాడ అప్పారావు అపూర్వ సృష్టి. కన్యాశుల్కం నాటకానికి సొగసులు, సోయగాలు కల్పించిన పాత్ర ఇది. మధురవాణి అంటూ ఓ వేశ్య శిఖామణి కళింగ రాజ్యంలో లేకపోతే సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండేదోనని కరటకశాస్తుర్లు అన్న మాటలు ముత్యాలసరాలే. ఆమె కొన్నాళ్లు వేశ్యా వృత్తిని అవలంబించి ఉండొచ్చు. అయితే ఆమె సరళ స్వభావం, నిర్మలమైన అంతరంగం, పరోపకారం, మాటల మధురిమలు కొంపలు కూలదోసే గాలివానలో కూడా నాట్యం చేసే విలక్షణ ఆమె సొంతం.
నేనుండగా మీరెలా వెధవలౌతారు?
విశ్వ సాహితీ గగనంలో మధురవాణితో సరితూగే పాత్ర మరొకటి లేదు. కాళిదాసు విక్రమోర్వశీయంలోని ఊర్వశి, శూద్రకుని మృచ్ఛకటికంలోని వసంత సేన కవితా కన్యలు గానే తారసపడతారు. షేక్ స్పియర్ క్లియోపాత్రా గాని, సోఫోక్లిస్ నాయికలు గాని వేశ్యా మణులు కారు. ఇందుకు విభిన్నంగా గురజాడ సృష్టించిన మధురవాణి వేశ్యామణి కావచ్చు. అయితే నాట్య సంగీత, సాహిత్యాలలో ఘనాపాఠి. రామప్పపంతులును పతిదేవునిగా ఆరాధిస్తుంది.నేనుండగా మీరెలా వెధవలౌతారు అంటుంది. వాక్పటిమలో ఆమెకు ఆమే సాటి.నువ్వు మంచిదానివి, ఎవరో కాలు జారిన సత్పురుషుడి పిల్లవై వుంటావు అని సౌజన్యరావు సుమధురంగా వ్యాఖ్యానిస్తాడు.
విదుషీమణి మధురవాణి
వైవిధ్యమైన ఈపాత్రకు మరింత వన్నె, ప్రాచుర్యం కల్పించేందుకు సుప్రసిద్ధ సంపాదకుడు, రచయిత పురాణం సుబ్రహ్మణ్యశర్మ మధురవాణి ఇంటర్ వ్యూలు పేరుతో అద్భుతమైన పుస్తకాన్ని వెలువరించారు. మధురవాణి సాహితీ ప్రముఖులైన పలువురితో జరిపినట్టు పేర్కొనే ఊహాజనిత సంభాషణలివి. ఇవి చదువుతుంటే విదుషీమణి మధురవాణి ప్రతిభా, పాటవాలు కన్నులకు కట్టినట్టుగా ఉంటుంది.
కండలేదు, సేరు మాంసం లేదు
గురజాడతో జరిపిన సంభాషణలో తిండి కలిగితే కండ కలదోయ్, కండకలవాడె మనిషోయ్ అన్నారు. ఇదేం కవిత్వం. మీకు కండలేదు, సేరు మాంసం లేదు. కనుక కండగలవాళ్ళంతా మీకు మనుషుల్లా కనిపించారు. అవునా(నవ్వు).అందుకు గురజాడ 'ఈ వేళ నన్ను పట్టించావేమిటి నేన్నిన్నుఈ నెగ్గగలనా' అని జవాబిచ్చాడు. ఆరుద్రతో జరిపిన సంభాషణలో భాగవతుల శంకరశాస్త్రి అని మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదని ఈ పురుగు పేరు పెట్టుకున్నారేమిటి ప్రతి కవికి కలం పేరు ఫ్యాషన్ కదా! అందుకే మరి ఈ పేరని జవాబిచ్చాడు.
ఈ యుగమే నాదన్నారే మహానుభావా
శ్రీశ్రీతో జరిపిన సంభాషణ చూడండి. 'శ్రీశ్రీ గారు ఎవరైనా ఈ ఇల్లు నాది, ఈ తోట నాది, ఈ ఆస్తి నాది అంటారు అనే వాళ్లను చూశాం గాని ఈ యుగం నాది అన్నవాళ్ళను చూడలేదు. ఎందుకిలా అన్నారు' అందుకు శ్రీశ్రీ 'యావదాంధ్ర దేశంలో ఏ ఇంటికైనా వెళ్లి నేను శ్రీశ్రీని నాకు ఆకలేస్తుందంటే ఏ తల్లి అయినా పిలిచి నాకింత అన్నం పెడుతుంది. అంతకంటే నాకేం కావాలి' అని జవాబిచ్చాడు.
సన్మానాలు, పూలదండలు లేకపోతే...
సినారేతో ఈ వ్యవస్థపై ఆగ్రహం అక్షరాల్లో ప్రదర్శిస్తే చాలదు. సర్పంబు పడగనీడను కప్ప వసించిన విధంబు గదరా సుమతీ అవుతుంది. అందుకు సినారె మనమంతా అలాగే జీవిస్తున్నాం. నేను ధర్మామీటర్నే గాని మాత్రను కాదని చమత్కరించారు. 'సరే అండి. సినారె గారు ఒక్క మాట..మీకు మీటింగులు, సన్మానాలు, పూలదండలు లేకపోతే మీకు తోచదట. ఎవరు పిలిచినా వక్తగానో, అధ్యక్షుడిగానో, ముఖ్య అతిథిగానో వెళ్ళిపోతారట కదా..ఆఖరికి స్వీటు షాపు ప్రారంభోత్సవానికైనా సరేనట కదా' అన్నారు. 'నాకు అన్ని వర్గాల్లోను మిత్రులున్నారు. నువ్వే అన్నావు కదా! నన్ను శివుడితో పోల్చి భక్త సులభుడినని' అంటూ చమత్కరించారు సినారె.
ప్రోలిటేరియన్ మధురవాణి.. ముత్యాలు
కట్టమంచి రామలింగారెడ్డితో జరిపిన ముఖాముఖిలో మైసూరు వచ్చి వుంటే నీకు అర్థశాస్త్రం బోధించే వాణ్ణి అన్నప్పుడు నాకు అర్ధంతో పని గాని అర్థశాస్త్రం తో కాదని సరసమాడుతుంది. రావిశాస్త్రితో ముచ్చటిస్తూ మీరు మరో మధురవాణిని సృష్టించారట.. నాకు పోటీగానా, గురజాడకు పోటీగానా అని నిలదీస్తుంది. 'అదా! రత్తాలు-రాంబాబులో ప్రోలిటేరియన్ మధురవాణిగా ముత్యాలు అని ఉంది. ఈ ముత్యాలు పేదల మధురవాణి. గురజాడకు కృతజ్ఞతతోనే, పోటీ ఏం కాద'ని బదులిస్తాడు. ఇక జాషువాతో.. 'ఖండ కావ్యాలకు ఖ్యాతి తెచ్చిన జాషువా గారికి స్వాగతం. ముఖస్తుతి కాదు గాని మీ రచనల్లో అన్నిటికంటే మీకు ఇష్టమైంది ఏది నాకు ఫిరదౌసి, ఖండకావ్యాలు తర్వాత అన్నీ..' అంటుంది మధురవాణి. అందుకు జాషువా 'గబ్బిలం నీకు నచ్చలేదా! కావ్య శిల్పం కంటే అభిప్రాయ ప్రకటనే ముఖ్యం నాకు. వాస్తవికత నా పద్ధతి' అన్నారు జాషువా. మధురవాణి స్పందిస్తూ 'అసలు జ్ఞానపీఠ్ బహుమతికి మీరు అర్హులు' అంటుంది. జాషువా జవాబిస్తూ.. 'అర్హులకు ఎప్పుడైనా సరియైన సత్కారాలు జరిగాయా' అనేశారు.
మహాప్రస్థాన ముఖద్వారం తెరిచా...
పుట్టపర్తి నారాయణాచార్యుల కంటె గొప్పవాడెవ్వడు చెప్పు. గుడిపాటి వెంకటచలంతో ముచ్చటిస్తూ... 'శ్రీశ్రీ మహాప్రస్థానానికి మీరు రాసిన పీఠిక అన్నం కంటే ఆవకాయ ఎక్కువైనట్లు...' చలం జవాబిస్తూ 'కొంచెం ఆవకాయతో మర్డర్ జరిగిన ఇంప్రెషన్ కలిగించొచ్చు.నా చిన్న పీఠికతో పాఠకులకు శ్రీశ్రీ మహాప్రస్థాన ముఖద్వారాన్ని తెరిచాను' అంటారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో... 'భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతోందని జాగ్రఫీ చెబుతోంది. మీరు సుబ్రహ్మణ్యస్వామికి వేయిపడగలున్నాయని, ఆ పడగల మీద భూమిని మోస్తున్నాడని నమ్ముతున్నారేమిటి' అని మధురవాణి ప్రశ్నించగా...'భూమిని సుబ్రహ్మణ్యస్వామి మోస్తున్నాడన్నది పౌరాణికం మాటేగాని భూగోళ విషయం కాదు. ధర్మం సహస్ర ముఖంగా ఉంటుంది. ధర్మం చేత భూమి పాలింపబడుతుంది. అదే వేయిపడగలుగా గ్రహించాల'ని చెబుతారు.
ఇలా ప్రఖ్యాత సాహితీవేత్తల ఊహాజనిత అంతరంగాలను రసరమ్యంగా ఆవిష్కరించిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ అభినందనీయులు.
(సెప్టెంబర్ 21న గురజాడ జయంతి సందర్భంగా)
పుస్తకం మధురవాణి ఇంటర్ వ్యూలు,
పేజీలు 228,
వెల రూ.80,
ప్రతులకు ప్రముఖ పుస్తక కేంద్రాలు.
సమీక్షకులు
వాండ్రంగి కొండలరావు,
94905 28730