బండకింది బతుకుల ఘోష!

by Mahesh |
బండకింది బతుకుల ఘోష!
X

దేశానికీ, రాష్ట్రానికి వెలుగును అందిస్తున్న విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు రాక్షసి బొగ్గును అందిస్తున్న బండ కింద బతుకులు బొగ్గు గని కార్మికుడివి! బోలెడు సమస్యలతో సతమతం అయ్యే కుటుంబాలు! ప్రతీ గడపకు ఎదిగిన బిడ్డలు, నిరుద్యోగులయిన కొడుకులు కనిపిస్తారు! చాలా భారీ కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ నల్ల నేలలో దర్శనం ఇస్తాయి! ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు కేర్ అఫ్ అడ్రస్, దిక్సూచిగా నిలిచింది నల్ల నేల! సారా వ్యతిరేక ఉద్యమం మొదలు, తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో ఉన్నారిక్కడి నల్ల సూర్యుల కుటుంబాలు! పుట్టెడు బండ కిందికి పోయి, దేశం కోసం అవసరం అయిన నల్ల బంగారాన్ని తమ రక్తాన్ని చెమటగా మార్చి వెలికి తీస్తున్న నల్ల సూర్యులకు ప్రశాంతంగా ఉండే పదవీ విరమణ జీవితం దొరకడం లేదు!

రిటైరైనా టెన్షన్ తప్పదు

ఒక సర్వే ప్రకారం1998 నుంచి 2008 సంవత్సరంకు ముందు పదవీ విరమణ గావించిన వారికి పెన్షన్ 1200 నుంచి 3000 రూపాయల లోపే వస్తున్నది! కొందరికి 1000 లోపే వస్తుంది! పెన్షన్ పెంచాలని చేస్తున్న విజ్ఞప్తులు,ఆందోళనలు ఏ మాత్రం ఫలితం ఇవ్వక పోగా దేశంలో మొత్తంగా ఇలా లక్ష కు పైగా రిటైర్డ్ కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి! బొగ్గు గని కార్మికులది విధి నిర్వహణలోనూ, అనంతరం కూడా టెన్షన్‌ల జీవితం అయిపోయింది! అనారోగ్యంతో ఉండి రెండు సంవత్సరాల మిగులు సర్వీస్ ఉన్న జేబీసీసీఐ పరిధి కార్మికుల, ఉద్యోగుల డిపెండెంట్‌లకు సీఎం కెసిఆర్ ఉద్యోగం కల్పించే అవకాశం ఇప్పించారు! అయితే మెడికల్ బోర్డు ఇన్ వ్యాలిడేషన్ ( అన్‌ఫిట్ ) చేస్తుంది! ఇందులో పైరవీలు, అవినీతి జగమెరిగిన సత్యం! ఇది నిత్యం ఒక స్కాం లా అయిపోయింది! సీఎం కేసిఆర్ ఆదేశాలను కాదని కొందరిని 'ఫిట్' కూడా చేస్తున్నారు! అందుకే కార్మికులు రెండో మార్గం అయిన పైరవీకారుల దగ్గరకు వెళుతున్నారు! పూర్తిగా పైరవి కారులుగా మారిన, లంచగొండి నేతలు, దాదాపు అందరూ కార్మికుల నుంచి 5 నుంచి 8 లక్షలు తీసుకుంటున్నారు! వారిని అధికారులకు చెప్పి అన్ఫిట్ చేయిస్తున్నారు!

అవినీతికి పరాకాష్ట సింగరేణి

ఇందులో పైరవీలు తెలియని కార్మికులు 'ఫిట్ 'అయి ఆగం ఆగం అయి, ఇంటిలో డిపెండెంట్‌కు ఉద్యోగం ఇప్పించక పోతే కుటుంబం బతికే పరిస్థితి లేదని, ఆత్మహత్యలకు పాల్పడిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మిగులు సర్వీస్‌తో నిమిత్తం లేకుండా, సర్వీస్‌లో ఉండి చనిపోతే డిపెండెంట్‌కు ఉద్యోగం ఇస్తారు కాబట్టి అలా అతి విషాదకరంగా తనువు చాలిస్తున్న వారు ఉన్నారు. బతికి ఉండగా సాధించ లేనిది, చచ్చి సాధిస్తున్నారు.. కార్మికులు!..ఇది నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి! ఈ విషయం అధికారులకు పట్టదు! నాకు తెలిసే ఒకరు ట్రైన్ కింద పడి చని పోతే, మరొకరు పురుగుల మందు తాగి చనిపోయిన వారున్నారు! మిగులు సర్వీస్ ఉన్నవారు అందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే అందరినీ ఇన్వాలిడేట్ చేసి డిపెండెంట్‌కు ఉద్యోగం ఇస్తారని, ఇందులో అవినీతి ఉండబోదని, సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ అవినీతి ఆగడం లేదు! కార్మిక నేతలే కాదు, మధ్యవర్తులు, ప్రజా ప్రతినిధులు ప్రతీ మెడికల్ బోర్డు సమయంలో ఇలా కార్మికుల చెమట చుక్కలను దోపిడీ చేస్తున్నారు! రక్తపు డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు! రక్తం పీల్చుతున్నారు! పంది కొక్కుల్లా కార్మిక కుటుంబాలను దోచుకుంటున్నారు! వీరికి బుద్ధి ఇక వస్తుందో రాదో! బుద్ధి చెప్పేవారు, 'అన్నలు 'లేరు కదా! అనే ధైర్యం కాబోలు!

ఇలా కార్మికులను నిలువు దోపిడీ చేసే విషయంలో ఎవ్వరు కూడా అతీతులు కాని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు! ఇలా శవాల మీద పైసలు ఏరుకునే బుద్ధి నేతల్లో ఎప్పుడు మారుతుందో దేవుడా! అంటూ కనిపించని ఆ దేవుని కోసం మబ్బు దిక్కు చేతులెత్తి మొక్కుతూ వాపోతుంటారు కార్మికులు! ఇంతే కాదు డిపెండెంట్‌కు ఏదో ఒక మెడికల్ ఫాల్ట్ పేరిట ఫిట్ చేయకుండా, కనీసం ఉపరితలంలో పనికి 'ఫిట్'గా ఉన్నా అన్ఫిట్ చేసి వాళ్ళను గోస పెడుతున్నారు! అలాంటి కుటుంబాలు నెలలు, ఏండ్ల తరబడి డాక్టర్ల, అధికారుల చుట్టు, కార్మిక నేతల చుట్టూ తిరుగుతున్నా, పట్టింపు లేదు! కనీసం మానవత్వం లేదు! నాకు తెలిసి ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు! ఎవరో ఫిర్యాదు చేసారని, డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వకుండా సందట్లో సడేమియాలా విజిలెన్స్ వారితో గోస పడుతున్న వారు సంవత్సరాల కొద్దీ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు!

కార్మికులను చంపేయద్దు...

దీని మీద సింగరేణి డైరెక్టర్లు, సీఎండీ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి! అండర్ గ్రౌండ్ పనులకు వీరు ఫిట్ కాకుంటే ఉపరితలంలో పనిచేసేలా వీరిని ఫిట్ చేయాలి! ఇప్పుడు ఎలాగూ వస్తున్నవి, వచ్చేవి అన్నీ ఓపెన్ కాస్ట్ ఉపరితలం గనులేనాయె! మానవీయ కోణంలో ఆలోచించాలి! అమలు చేయాలి! ఇన్వాలిడేషన్‌ సమయంలో డబ్బులు తీసుకోవడం అంటే శవాల మీద పైసలు ఏరుకున్నట్టే! అనేది గుర్తుపెట్టుకోండి! నేతలారా! కార్మికులను కాపాడండి! వారి రిటైర్మెంట్ జీవితంకు ప్రశాంతత కల్పించండి! సింగరేణి డైరెక్టర్‌లారా! మానవత్వ కోణం నుంచి కూడా ఆలోచించండి! ఈ విషయంపై సీఎం కేసీఆర్ర్ సీరియస్‌గా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కార్మికులు! ఈ వాస్తవ పరిస్థితిని గుర్తించాలి! తప్పని పరిస్థితుల్లో తమ డిపెండెంట్‌ల భవిష్యత్తు కోసం గని కార్మికులు బలన్మరణం వైపు వెళ్లకుండా ఆ వైపు దృష్టి, ఆలోచన పోకుండా కాపాడండి! మానవత్వంతో విషయాన్ని ఆ కోణంలో పరిశీలించాలి! బొగ్గు గని కార్మికులను కాపాడాలి! వారి గోసను,ఘోషను ఆలకించండి! 200 మంది దాకా కార్మికులు 'అన్ఫిట్' అయినా వారికి రెండేండ్ల మిగులు సర్వీస్ లేదని, వారి డిపెండెంట్‌లకు ఉపాధి కల్పించాలని,హైకోర్ట్ ఆదేశించినా పట్టించుకోవడం లేదు! వారి సమస్య ఏండ్ల తరబడి నానుతూనే ఉంది! ఈ విషయాన్ని కూడా మానవీయ కోణం నుంచి చూడాలి!

ఎండి.మునీర్, జర్నలిస్ట్

99518 65223

Advertisement

Next Story