జల వనరులను కాపాడదాం

by Ravi |   ( Updated:2024-03-22 00:30:56.0  )
జల వనరులను కాపాడదాం
X

జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ లేదు. మన పురాతన నాగరికతలు కూడా జలవనరుల దగ్గర విలసిల్లినవే. సమీప భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇటీవల బెంగళూరు మహానగరాన్ని నీటి కొరత వేధిస్తున్న సంగతి విదితమే. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ప్రతియేటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’ను నిర్వహిస్తున్నది. శాంతి కోసం నీటి పరపతి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జరుపుకుంటున్నారు.

2015లో పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం (SDG)- 6 ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నీరు, పారిశుధ్యం కల్పించాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ వాగ్దానానికి మనం ఆమడ దూరంలో ఉన్నాము. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి శుద్ధమైన తాగునీరు దొరకడం లేదు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ 25 శాతానికి, నీటి డిమాండ్ 50 శాతానికి పైగా పెరగనుందని అంచనా. ప్రపంచ జనాభాలో 17% భారత్ లో ఉన్నప్పటికీ మంచి నీటి వనరులలో భారతదేశం కేవలం 4% మాత్రమే కలిగి ఉంది. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా నీటి ఎద్దడి దారుణంగా తయారైనది.

నీటి లభ్యతలో అసమానత్వం

భారతదేశంలో సరైన నీటి పొదుపు ప్రణాళికలు, నిర్వహణ , ప్రజల్లో అవగాహన లేమి వలన నీటి వృధా జరిగి జల సంక్షోభానికి దారి తీయడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఋతుపవనాల వల్ల నీరు లభ్యమైనప్పటికి.... నిర్వహణ లోపం, డ్యాములు, ప్రాజెక్టులు సరిపడా లేకపోవడం వలన వృధా కావడం జరుగుతుంది. దేశంలో నీటి లభ్యత కూడా అసమానంగా ఉండటం వలన తరచుగా వివిధ ప్రాంతాలు కరువు, వరదల ప్రభావానికి గురికావడం జరుగుతుంది. మానవ తప్పిదాల వలన వాతావరణ మార్పులు సంభవించి వర్షపాతంలో అనిశ్చితి ఏర్పడి జల సంక్షోభానికి దారితీస్తుంది. రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం అనేవి ప్రజల కనీస ప్రాథమిక హక్కులుగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ నేటికీ ఆచరణలో అమలు కావడం లేదు.

నీటి కరువుకు చరమగీతం

నేడు సమర్థవంతమైన జల వనరుల నిర్వహణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి పౌరుడు జలవనరుల పట్ల జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి రాజస్థాన్‌లోనీ అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్ర సింగ్, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్నా హజారే చేపట్టిన కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణకు చేపట్టిన ‘జల శక్తి అభియాన్’‌ను జల ఉద్యమంగా తీసుకువెళ్లి నీటి కరువుకు చరమగీతం పాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. 2018-2028 దశాబ్దాన్ని ‘వాటర్ ఫర్ సస్టెనెబుల్ డెవలప్‌మెంట్’గా ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. దీనికనుగుణంగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్లాలి. అప్పుడే మన ముంగిటి నీటి సంక్షోభం తొలగిపోతుంది.

(నేడు ప్రపంచ జల దినోత్సవం)

సంపతి రమేశ్ మహరాజ్

79895 79428

Advertisement

Next Story

Most Viewed