హక్కులపై పోరాడిన అడవి బిడ్డ

by Ravi |   ( Updated:2024-03-26 23:45:48.0  )
హక్కులపై పోరాడిన అడవి బిడ్డ
X

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొత్తగూడ మండలం మోకాళ్ళపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసీ బిడ్డగా జన్మించిన కుంజ రాము చిన్నతనం నుంచే ప్రగతిశీల భావంతో చైతన్యంగా ఉంటూ తన చుట్టూ ఉన్న తమ అడవి బిడ్డలకు జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో వీటినన్నింటిని విముక్తి కల్పించడానికి తన జాతి బిడ్డల రక్షణకు పోరాటమే సరైన పంథాగా ఎంచుకొని కుంజ రాము అజ్ఞాతంలో అన్నగా ఆదివాసీలకు పెద్దన్నగా గుర్తింపు పొందారు.

తన జాతి కోసం..

అజ్ఞాత జీవితంతో నిబద్దతతో నడుచుకుంటూ దళ సభ్యుడు నుంచి అంచెలంచెలుగా ఎదిగి కమాండర్‌గా ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనశక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై ఆదివాసీ బిడ్డగా ఆదివాసీలకు అదివాసేతర పేద ప్రజలకు తన పోరాట పంథాలో హక్కుల కోసం ఉద్యమించాడు. దీంతో రాజ్యం తీవ్రంగా నిర్భంధం పెంచింది.

రామన్న ప్రతి అడుగునూ అంచనా వేసి పసిగట్టి మట్టుబెట్టడానికి ఎన్నో ఎత్తుగడలు మొదలెట్టారు. ఎన్ని నిర్బంధాలు పెరిగినా, అదరక బెదరక చాకచక్యంతో విప్లవోద్యమ పంథాను ఎంతో దృఢంగా నిర్మాణాలు చేపడుతూ, విప్లవం పట్ల ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచాడు. విప్లవోద్యమంలో ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్న తన ఆదివాసీ గూడెల వెనుకబాటును పసిగట్టాడు, నల్లమల చెంచు బిడ్డల దీనస్థితులు అన్ని గమనించి తన జాతి బిడ్డల హక్కుల కోసం స్వతంత్ర ఆదివాసీ విప్లవ పోరాటం ఎంతో అవసరం అనుకొని జనశక్తి పార్టీ నుండి బయటకు వచ్చి ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ (ఏ.ఎల్.టి) సంస్థను 2004 సెప్టెంబర్ 30న స్థాపించి ఆదివాసీల కోసం సొంత విప్లవ పార్టీని నిర్మించి ఆశ్చర్యం కలిగించాడు.

ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో..

పెరిగిన పోలీసు నిర్భందం, దీనికి తోడు విప్లవ పార్టీలల్లో చిలికలతో వర్గ శత్రు అహంకారంతో కోవర్టుల వ్యవస్థ పెరిగిపోవడం అన్నీ పోలీసులకు కలిసివచ్చాయి. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న బయ్యారం మహబూబాబాద్ అటవీ ప్రాంతంలో సమావేశమై ఉన్న కుంజ రాముపై పోలీసులు ఏకపక్ష కాల్పులు మొదలుపెట్టారు. విల్లంబులు చేతపట్టి పోరాడుతున్న కుంజ రాము దళం పోలీసుల తూటాల ముందు ఎక్కువ సేపు నిలబడలేక పోయింది. దీంతో 2005 మార్చి 27న కుంజ రాము అమరుడయ్యడు. తమ జాతి బిడ్డల కోసం విల్లంబులు ఎక్కుపెట్టి రాజ్యంపై యుద్ధం చేసిన వీరుడు లేడన్న వాస్తవం దిగమింగుకొలేక ఆదివాసీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదివాసీ యువతరం తమ హక్కుల రక్షణ కోసం కామ్రేడ్ కుంజ రాము స్ఫూర్తితో పోరాడాలి.

(నేడు కుంజా రాము 19 వ వర్ధంతి)

తాటి మధు,

ఆదివాసీ హక్కుల పోరాట సమితి

76758 01248

Advertisement

Next Story

Most Viewed