బాల్య వివాహాలపై .. ఈ తీర్పు ఓ మైలురాయి

by Ravi |   ( Updated:2024-08-02 00:45:14.0  )
బాల్య వివాహాలపై .. ఈ తీర్పు ఓ మైలురాయి
X

మైనర్ ముస్లిం బాలికకు 18 ఏళ్లలోపు వివాహాన్ని నిర్వహించారనే ఆరోపణలపై గత నెల 15వ తారీఖున కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థలో ఓ మైలురాయి లాంటిది. బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 మతంతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ వర్తిస్తుందని, ప్రతి భారతీయుడు మొదట దేశ పౌరుడని, ఆ తరువాతనే మతంలో సభ్యుడు అవుతాడని, పౌరసత్వం మొదటిది, మతం ద్వితీయమైనదని తీర్పు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం.

ఈ తీర్పులోని ఒక్కొక్క వాక్యం ఒక్కో ఆణిముత్యం లాంటిది. ఈ తీర్పులో తొలుత మనం భారతీయులం అనే వ్యాఖ్యానం విస్తృత అర్థాన్ని ఇస్తుంది. దేశం మొత్తం మీద ఒకే దేశం - ఒకే చట్టం గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. దేశంలో మతం అనేది వ్యక్తిగతానికి సంబంధించిన విషయంగా పరిగణించాలి. బాల్య వివాహాలు శతాబ్దాలుగా వివిధ సంస్కృతులు, ప్రాంతాలలో కొనసాగుతున్న ఒక లోతైన సామాజిక సమస్య. బాలల శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సుపై దీని హానికరమైన ప్రభావాలను గుర్తించి అనేక దేశాలు బాలల హక్కులను రక్షించడానికి చట్టాన్ని రూపొందించాయి. మన దేశంలో బాల్య వివాహాల ఆచారాన్ని తొలిసారిగా 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం - 1929 ద్వారా చట్టబద్ధంగా నిషేధించబడింది. 1978లో చేసిన చట్టం మహిళలకు కనీస వయస్సును 18 ఏళ్లకు, పురుషులకు 21 ఏళ్లకు పెంచింది. బాల్యవివాహాల నిషేధ చట్టం-2006 చట్టం కూడా ఇదే కనీస వయో పరిమితులను కలిగి ఉంది.

బాల్యవివాహాల తీరు తెన్నులు

భారతదేశంలో 2.4 కోట్లకు పైగా బాల వధువులు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ప్రకారం ప్రపంచంలోని ఆరు కోట్ల బాల్య వివాహాలలో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ప్రపంచంలో బాల్య వివాహాల రేటులో మనదేశం 14వ స్థానంలో ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ సంస్థ తెలిపింది. విభిన్న వివాహ సంప్రదాయాలు, ఆచారాలు, ప్రాంతాలు, కులాలు తెగలు ఉండడం వలన దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఆగ్నేయం కంటే బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్, బిహార్, త్రిపురలలో 20 నుండి 24 వయస్సు గల స్త్రీలలో 40 శాతం కంటే ఎక్కువ మంది 18 సం. కంటే తక్కువ వయస్సులో వివాహం అయిన వారు ఉన్నారు. కేరళలో 18 ఏళ్లలోపు వివాహం చేసుకున్న మహిళలు 2015-16లో 7.6 శాతం నుండి 2019-20లో 6.3 శాతానికి చేరుకున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 2019-21 ప్రకారం 20 నుండి 24 మధ్య వయస్సు గల స్త్రీలలో 23 శాతం మంది 18 సం. కంటే ముందే వివాహం చేసుకున్నారు. 2005-06 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 సర్వేలో 47 శాతం నుండి 2015-16 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే-4లో 27 శాతానికి బాల్య వివాహాలు తగ్గాయి.

బాల్యవివాహం పరిణామాలు..

బాల్య వివాహాలు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ ప్రభావితం చేసినా కూడా, ఆడపిల్లలను మాత్రం అసమానంగా ప్రభావితం చేస్తాయి. బాలికల బాల్యాన్ని తుంచి వేస్తాయి. పిల్లలకు విద్య, ఆరోగ్యం, దోపిడీ నుండి రక్షణ లాంటి ప్రాథమిక మానవ హక్కులను నిరాకరిస్తాయి. శిశు మరణాలు, ప్రసూతి మరణాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు లాంటి ఆరోగ్య సమస్యలకు ఈ వివాహాలు దారి తీస్తాయి. పేదరికాన్ని శాశ్వతం చేస్తాయి. ఆర్థిక అవకాశాలను పరిమితం చేస్తాయి. డిప్రెషన్, ఆందోళన కలిగించి మానసిక గాయాలకు దారితీసే పరిస్థితులను కలిగిస్తాయి. కుటుంబం, సమాజం నుండి వేరుచేయడానికి దోహదపడి సామాజిక ఒంటరితనాన్ని పెంచుతాయి. గృహ హింస, లైంగిక వేధింపుల ప్రమాదాలను, ప్రసూతి మరణాల రోగాల రేటును పెంచుతాయి. తక్కువ వయస్సు తల్లులకు జన్మించిన పిల్లలు అధిక మరణాల రేటును కలిగి ఉంటారు.

పరిష్కారాలు..

బాల్య వివాహాలను అంతం చేయడం కోసం వ్యవస్థలన్నీ సమన్వయంతో కూడిన చర్యల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతీ వివాహం అధికారికంగా నమోదు చేయడం తప్పనిసరి చేయాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. బాలికలకు వారి కుటుంబాలకు ఆర్థిక మద్దతు కల్పించాలి. బాలికలకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలి. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ వివాహాలపై అధికారులు, మీడియా ప్రజలలో అవగాహన కల్పించాలి. ఈ చట్టాల నిబంధనలు అతిక్రమించిన వారిపై శిక్ష కఠినంగా అమలు చేయాలి.

- డి జె మోహన రావు

94404 85824

Advertisement

Next Story

Most Viewed