కేదారేశు భజించితిన్

by Ravi |   ( Updated:2022-09-03 15:05:34.0  )
కేదారేశు భజించితిన్
X

కేదార్‌నాథ్ ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు అలరిస్తాయి. ఏ సమయంలోనైనా హిమపాతం కురిసే, వర్షం పడే అవకాశం ఉంటుంది. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు అక్కడికి చేరి, శివుడిని దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. రిషికేశ్ నుంచి కొండ చరియల దారిలో దాదాపు 16 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరో వైపు వెయ్యి మీటర్ల లోతులో లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. కేదార్‌నాథ్‌కు రావడానికి హరిద్వార్ నుంచి ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌కు రూ.1500 నుంచి 2,000 వరకు తీసుకుంటారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్‌కు రావాల్సిందే.

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలోని ఒక నగర పంచాయితీ కేంద్రమిది. సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో, మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. 2013 జూన్ 16,17 తేదీలలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఇక్కడ చాలా మార్పులు సంభవించాయి. చలి అధికంగా ఉండే కారణంగా ఈ గుడిని అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు మాత్రమే తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడికి చేరుకోవటానికి రోడ్డు మార్గం అంటూ ఏమీ లేదు. గౌరీకుండ్ నుంచి గుర్రాలు, డోలీలు, కాలినడకన గుడిని చేరుకోవాలి.

ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించారని విశ్వసిస్తున్నారు. గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. ఈ గుడి 12 జ్యోతిర్‌ లింగాలలో, ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో ఒకటిగా ఉంది. యమునోత్రి గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ను ఛోటా చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు. గుడి ముందు కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారేశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుంచి బయటపడటానికి పాండవులు శివుడి కోసం వెతుకుతూ ఇక్కడికి చేరుకున్నారని, వారిని చూసిన శివుడు ఎద్దు రూపంలో భూగర్భంలోకి వెళ్లిపోయాడని, పాండవులు విడవకుండా వెన్నంటి శివుడి వెనుక భాగాన్ని మాత్రం స్పర్శించి పాప విముక్తులయ్యారని పురాణ కథనం. తల భాగం నేపాల్‌లోని పశుపతినాథుని ఆలయంలో ఉందని స్వయంగా శివుడు పార్వతి తో చెప్పినట్లు స్థల పురాణంలో ఉంది. అందుకే చాలా మంది. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత పశుపతినాథ్ ఆలయానికి కూడా వెళతారు. గర్భగుడిలో శివలింగం ఉండదు. ఒక ఎద్దు వెనుక భాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు.

ప్రయాణం ఇలా

కేదార్‌నాథ్ ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు అలరిస్తాయి. ఏ సమయంలోనైనా హిమపాతం కురిసే, వర్షం పడే అవకాశం ఉంటుంది. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు అక్కడికి చేరి, శివుడిని దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. రిషికేశ్ నుంచి కొండ చరియల దారిలో దాదాపు 16 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరో వైపు వెయ్యి మీటర్ల లోతులో లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుంది.

కేదార్‌నాథ్‌కు రావడానికి హరిద్వార్ నుంచి ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌కు రూ.1500 నుంచి 2,000 వరకు తీసుకుంటారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్‌కు రావాల్సిందే. ఉదయం ఎనిమిది గంటలకు రిషికేశ్‌లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మరుసటి రోజు వరకు వేచి ఉండాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్త్య ముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ‌కుండ్ చేరుకుంటారు. ట్రాఫిక్ జామ్‌తో గంటల తరబడి వేచి చూడాల్సి రావొచ్చు. సాయంత్రం ఏడు తర్వాత ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితులలోనూ నమ్ముకోకూడదు. ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీపరులు. దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు.

గౌరీకుండ్ నుంచే అంతా

గౌరీకుండ్ నుంచి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్‌నాథుని గుడి ఉంది. గౌరీకుండ్ చిన్న ప్రాంతం. వందకు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పి పంపిస్తారు. అంతవరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్‌లో గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లేవారు కూడా చాలా మంది ఉంటారు. 40 సంవత్సరాలు దాటిన వారు ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన దాదాపు పది గంటలు పడుతుంది. ఏడు కిలోమీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి.

గౌరీకుండ్‌లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదార్‌నాథ్ కొండపైన ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. యాత్రికులు ఆలయదర్శనం చేసుకునేందుకు డోలీలు, గుర్రాలను సమకూర్చినవారు సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్‌లోని బసకు తీసుకు వస్తారు. హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వేడినీటిని అందించడం, ప్రాణవాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. వీరిలో అనేకమంది నేపాలీయులే. మంచుతో కప్పబడిన ఆలయ ప్రాంగణం యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఉత్తరకాశి నుండి హెలికాప్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు.

దక్షిణాది వారికి లంగర్

సిద్దిపేటవాసులు కొందరు 11 సంవత్సరాల క్రితం 'కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి' పేరుతో యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి లంగర్ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. చీకోటి మధుసూదన్, రత్నాకర్ అధ్యక్ష కార్యదర్శులుగా సేవా సమితి ఏర్పాటైంది. యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాదివారే. మే 4 నుంచి జూన్ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఉదయం ఏడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు లంగర్ సేవలు అందుబాటులో ఉంటాయి. భోజనాలతోపాటు వసతి, హెల్ప్ సెంటర్ కూడా ఉంటుంది. ఉదయం టీ, ఇడ్లీ, చపాతీ, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమపూరీ, పానీపూరి, కట్లీస్. రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు.

చిటుకుల మైసారెడ్డి

జర్నలిస్ట్, కాలమిస్ట్

సిద్దిపేట, 94905 24724

Advertisement

Next Story