- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: నేను భగవంతుడిని
నేను భగవంతుడిని
నేను మాట్లాడను, కన్పించను
శిల రూపంలో వుంటాను.
రోజూ వేలమంది నా దర్శనానికి వస్తుంటారు. తమ కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తూ వుంటారు. ఎంతోమంది ఎన్నో కోరికలు కోరతారు. తమ కోరికలు తీరాలని హుండీలో డబ్బులు వేస్తారు. కోరికలు తీరిన వాళ్ళు, తమ కోరికలు తీరినందుకు గానూ హుండీలో డబ్బులు వేస్తారు. నిలువు దోపిడీలను కూడా సమర్పిస్తారు. తల నీలాలని సమర్పిస్తారు. రకరకాలుగా తమ కృతజ్ఞతలను వెలిబుచ్చుతారు.
ఇంకా కొంతమంది నడిచి కొండ ఎక్కుతారు. మోకాళ్ల మీద కొండ ఎక్కుతారు. కోనేటిలో మునుగుతారు. పోర్ల దండాలు పెడతారు. ఎన్నని చెప్పను. ఇట్లా ఎన్నో రకాలుగా నన్ను మొక్కుతారు. ప్రార్థిస్తారు. నేను ఊహించని విధంగా వాళ్ళు తమ ప్రార్థనలను సమర్పిస్తారు. తమ కోరికలు తీరాలని!
నేను భగవంతుడిని
నేను మాట్లాడను, కన్పించను
శిల రూపంలో వుంటాను.
అనుక్షణం నన్ను వేలమంది ప్రార్థిస్తూ ఉంటారు. నాకు కనీస విశ్రాంతి లేకుండా దర్శనానికి వస్తుంటారు. కొంతమంది దగ్గర నుండి దర్శిస్తారు. మరికొంతమంది దూరం నుంచే దర్శిస్తారు. దర్శనం సరిగ్గా కానీ వాళ్ళ కోసం విమాన పేరుతో నేను వుండనే వున్నాను.
కొంతమందికి హారతిలో దర్శనం చేయిస్తారు. మరికొంతమంది దీపంతో దర్శనం చేయిస్తారు. ఎంతోమందిని మెడల మీద చెయ్యి వేసి నెట్టివేస్తూ దర్శనం చేయిస్తారు. ఓ యుద్ధ వాతావరణం వుంటుంది. అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళకి గొప్ప దర్శనాలు వుంటాయి. పాపం అమాయకులు ఏమో మాట్లాడకుండా వెళ్ళిపోతూ వుంటారు.
ఎప్పుడో అర్థరాత్రి పూట నాకు జోలపాట పాడతారు. నిద్రపుచ్చుతారు. నా గుడి తలుపులు మూస్తారు. ఆ తలుపులని ఇలా మూసారో లేదో, నేను ఇట్లా కునుకు తీశానో లేదో. ఇలా సుప్రభాతంతో నిద్రలేపుతారు. అలంకారాలు చేస్తారు. తోమాల సేవ అంటారు. ఇంకా ఏవేవో సేవలు అంటారు. పదివేల రూపాయల టికెట్టుతో దర్శనం అంటారు. కొంతమంది అక్కడున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఓ రెండు నిముషాలు నా ముందు నిల్చోవడానికి అనుమతి పొందుతూ వుంటారు. అన్నీ చూస్తూ మౌనంగా నేను అలా నిల్చోని వుంటాను. మౌనంగా, ఏమి మాట్లాడకుండా కోరికలు తీరిన వాళ్ళు కొండంత దండం పెడతారు. కోరికలు తీరని వాళ్ళు నిరాశగా వెళతారు. కొంతమంది తిడతారు, శాపనార్థాలు పెడతారు నేను లేనని సూత్రీకరణ చేస్తారు.
ఒక్క కోరిక లేకుండా వచ్చిన వ్యక్తి నాకు కన్పించలేదు. అట్లా అని వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. అది మనుష్య నైజం. ఆ నైజాన్ని నేను సృష్టించానని అంటారు. కోరికలు తీరని వ్యక్తుల శాపనార్థాలు చెప్పడానికి వీల్లేదు. ఎన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషిస్తారు. దూషిస్తూ ఉంటారు. అన్ని వింటూ మౌనంగా నేను...
నేను భగవంతుడిని
నేను మాట్లాడను, కన్పించను
నేను శిలరూపంలో ఉంటాను
అందుకే బతికి పోయాను
నేను కన్పిస్తే, ఈ మనుషులు... అదే తమ కోరికలు తీరని వాళ్ళు నన్ను చంపి పోగులు పెట్టేస్తారు. నేను శిలరూపంలో వుండి బతికిపోయాను. గర్భ గుడిలోకి ఎవరినీ రానివ్వక కూడా శిల రూపంలో నేను బతికిపోయాను.
(శ్రీరామ్ సార్‌తో మాట్లాడిన తరువాత)
మంగారి రాజేందర్ జింబో
94404 83001