- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: తిరిగి ఇచ్చే కానుక
నా చిన్నప్పుడు మా బాపుని కలువడానికి చాలా మంది వచ్చేవాళ్లు. ఆయన దగ్గర చికిత్స పొందిన వ్యక్తులే కాదు. ఆయనకు తెలిసిన వ్యక్తులు ఎందరో ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు. అధికార పార్టీతో సంబంధం వున్న వ్యక్తి కాదు. మా వేములవాడ ప్రాంతంలోని మొట్టమొదటి డాక్టర్. మా రాజేశ్వరుని దేవాలయంలో పనిచేసిన మొదటి డాక్టర్. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.
ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్లు వొట్టి చేతులతో వచ్చేవాళ్లు కాదు. వాళ్ల తోటలో పండిన జామకాయలని కొందరు తెస్తే, మరి కొందరు మక్క కంకులని తెచ్చేవాళ్లు. ముంజలను తీసుకొని రాజాగౌడ్ వచ్చేవాడు. కొంతమంది కోడిగుడ్లను, కోళ్లని, జొన్న గింజలని ఇట్లా ఏవో తెచ్చేవాళ్లు. వద్దని మా బాపు వారిస్తే ‘మేమేమీ కొనుక్కొని రావడం లేదు. మా దగ్గర ఉన్నవే తెస్తున్నాం’ అని చెప్పేవాళ్ళు.
అదే విధంగా, మా ఇంటికి వచ్చిన వాళ్లు ఎవరూ వూరికే వెళ్లేవాళ్లు కాదు. అన్నం తిని వెళ్లేవాళ్లు. కనీసం 'సల్ల' తాగి వెళ్లే వాళ్లు. మా ఇంట్లో నాలుగు బర్రెలు ఉండేవి. ఎప్పుడూ రెండు బర్రెలు పాలు ఇచ్చేవి. మాకు పాలు, పెరుగు సరిపోగా ఎన్నో పాలు మిగిలేవి. వాటిని తోడుపెట్టి పెరుగు చేసి ఆ తర్వాత సల్ల తయారుచేసేది మా అమ్మ.
మా బావి దగ్గర నుంచి మా వాడకట్టు వాళ్ళు నీళ్లు తోడుకొని వెళ్లేవాళ్లు, మా అమ్మ దగ్గర మజ్జిగనే కాదు. ఆ సమయంలో మాకు వచ్చిన మామిడి పండ్లని, మొక్కజొన్న కంకులని, ముంజలని కూడా తీసుకొని వెళ్లేవాళ్లు. మా అమ్మ ఇచ్చేది. ‘మా బాపు ఒక మాట ఎప్పుడూ అనేవాడు. మన పంటని పదిమందికి పంచాలని’
కవులకి, రచయితలకి ఒక వెసులుబాటు వుంది. తమ పుస్తకాలని మిత్రులకి ఇచ్చే అవకాశం. ఆ మాట కొస్తే కళాకారులందరికీ ఆ వెసులుబాటు వుంటుంది. అట్లా ఓ రెండు పెయింటింగ్‌లని నేను పొందాను. అట్లా ఇచ్చిన మిత్ర చిత్రకారులు కూడా నాకు వున్నారు.
ఆ మధ్య నూతన గృహ ప్రవేశానికి ప్లాన్ చేశాం. కానుకలు వద్దని చెప్పినా చాలామంది కానుకలు ఇస్తూనే ఉంటారు. అదొక సరదా. అదొక అలవాటు. వద్దని వారించినా చాలామంది వినరు. అందుకని రిటర్న్ గిఫ్ట్‌ల ప్రస్తావనని మా ఆవిడ తీసుకొని వచ్చింది. ‘మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పాను. ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తుండగా మా బాపు ఎప్పుడూ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘మన దగ్గర ఏం పండుతుందో, అది పదిమందికి పంచాలి’
మా దగ్గర పండేది కథలూ, కవిత్వం. కవిత్వం ఎక్కువ మంది చదువకపోవచ్చు. కానీ కథలు చాలా మంది చదువుతారు. అందుకని కథల పుస్తకం రిటర్న్ గిఫ్ట్‌గా ఇద్దామని ప్రతిపాదన చేశాను. అందుకు మా ఆవిడ అభ్యంతరం చెప్పింది. ఆవిడ కవయిత్రి. అయినా అభ్యంతరం చెప్పింది. అందుకు ఆమె చెప్పిన కారణం ఇది. ‘వాళ్లు ఇచ్చే కానుకలు ఖరీదుగా ఉంటాయి. మన పుస్తకం ఖరీదు తక్కువగా ఉంటుంది. సమయం కూడా లేదు. వారం రోజులే టైం ఉంది. ఈ తక్కువ సమయంలో పుస్తకం తీసుకొని రావడం కష్టం.’
పర్వాలేదు. ఖరీదు కాదు ముఖ్యం. మనం పండించేది అదే’ చెప్పాను ఆవిడకి. నాలుగు రోజుల్లో కథలు కంపోజ్ అయినాయి. ఒక్కరోజులో ముఖచిత్రం వచ్చేసింది. రెండు రోజుల్లో పుస్తకం ప్రింట్ అయ్యింది. అందరికీ రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చాం. ఆ కథల పుస్తకం పేరు ‘కథలకి ఆవల’. అందులో వున్నవి ఉత్తేజపరిచే కథలు. ఆ పుస్తకాలని వచ్చిన అతిథుల అందరికీ ఇచ్చాం. ఎంతోమంది ఫోన్లు చేసి మళ్లీ కొన్ని కాపీలు తెప్పించుకున్నారు. పుస్తకాల షాపుకు వెళ్లి వంద, రెండు వందల ప్రతులు కొన్నవాళ్లూ ఉన్నారు.
‘మా రిటర్న్ గిఫ్ట్ ఖరీదు తక్కువే. కానీ అది ఇచ్చిన స్ఫూర్తి మాత్రం వెలకట్టలేనిది’. ఇది నేనన్న మాట కాదు. చాలామంది అన్న మాట. తిరిగి ఇచ్చిన కానుక అది.
-మంగారి రాజేందర్ జింబో
94404 83001