కాకి నేర్పిన సత్యం..!

by Ravi |   ( Updated:2023-04-23 00:15:34.0  )
కాకి  నేర్పిన సత్యం..!
X

కాకిని చూసినప్పుడు నాకు మనిషి కూడా గుర్తుకొస్తాడు. మనుషుల్లోనే ప్రేమా, బాధా, ఇతరుల పట్ల కన్‌సర్న్ ఎక్కువ అని అనుకుంటాం. కానీ, ఇవి మనుషుల్లో కన్నా కాకుల్లోనే ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది.

నా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తుంది. నా నాలుగవ అక్క వినోదక్క వాళ్లింట్లో తుపాకులు ఉండేవి. మా బావ వాళ్ల అన్నదమ్ములు వేటకి వెళ్లేవాళ్లు. పిల్లల కోసం చిన్న తుపాకులు కూడా వుండేవి.

ఇది యాభై ఐదు సంవత్సరాల కిందటి మాట. మా అక్క వాళ్ల ఇంటి ముందు ఓ పెద్ద చెట్టు ఉండేది. దానిపై రకరకాల పక్షులు వచ్చి వాలేవి. ఎక్కువగా కాకులు వచ్చి వాలేవి. మా బావ అన్న కొడుక్కి తుపాకీ ఎలా కాల్చాలో తెలుసు. అతను చిన్న చిన్న పక్షులని కాల్చేవాడట. అతని మాటలని విని నేనూ తుపాకి కాల్చాలని ఉత్సాహపడ్డాను. అతను తుపాకీ తెచ్చి ఎలా కాల్చాలో చెప్పాడు. ఎలా గురి చూడాలో కూడా చెప్పాడు.

నేనూ కాల్చి చూద్దామని అనుకున్నాను. నా ఉత్సాహాన్ని చూసి తుపాకీ నాకు ఇచ్చి కాల్చమని చెప్పాడు. నేను సరదా పడి గురి చూసి ఆ చెట్టు మీద ఉన్న ఓ కాకిని కాల్చాను. అది గాయపడి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది. నా గురి మీద కలిగిన సంతోషం ఒక్క క్షణంలోనే ఎగిరిపోయింది. నిరుత్సాహంగా నిలబడిపోయాను. నన్ను చూసి అతనూ నిరుత్సాహ పడిపోయాడు.

ఒక్క నిమిషంలో లెక్కలేనన్ని కాకులు వచ్చి ఒకటే పనిగా అరవడం మొదలుపెట్టాయి. దాంతో మా నిరుత్సాహం రెండింతలు అయిపోయింది. కొన్ని కాకులు ఆ చనిపోయిన కాకి దగ్గరికి వచ్చి అరిస్తే మరికొన్ని కాకులు చెట్టుమీదనే అటూ ఇటూ కదులుతూ అరవడం మొదలుపెట్టాయి. అది చూసి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కన్నా మాకు భయం ఎక్కువ వేసింది. దెబ్బకు ఇంట్లోకి పరిగెత్తాం ఇద్దరమూ. ఎవరో పెద్దవాళ్లు వచ్చి ఆ చనిపోయిన కాకిని అక్కడి నుంచి తొలగించిన తరువాత కొంతసేపటికి ఆ కాకుల గుంపు సద్దుమణిగింది.

అందుకే పెద్దలు ‘కాకి బలగం’, ‘కాకి గోల’ అంటారు. కాకుల్లోని ప్రేమ, బాధ ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి ఏర్పడింది నాలో. ఆ తర్వాత సరదాగా కూడా ఎప్పుడూ తుపాకీని, రివాల్వర్‌ను ముట్టుకోలేదు. ఆ తరువాత ఎంతో మంది మరణాలను చూసాను. చాలా మంది మరణాల్లో ఆ కాకి చావు వేదన కనిపించలేదు. నామమాత్రంగా చూట్టూ చేరేవాళ్లు. రెండు రోజుల తరువాత ఆ దు:ఖం కూడా కనిపించకపోయేది. ఆస్తుల గొడవ. బంగారం గొడవ కనిపించేది. వినిపించేది.

కాకులకి ఆస్తుల గొడవలు లేవు. బంగారం సంగతి వాటికి తెలియదు. పక్షుల్లోని ప్రేమా, ఐకమత్యం మనుషుల్లో కొరవడిందని అప్పుడు నాకు అనిపించేది. మనుషులు మరణాల తరువాత మనుషుల్లోని గొడవలు పెరగడం చూసినప్పుడల్లా నాకు నా చిన్నప్పటి కాకి మరణం గుర్తుకొచ్చేది. వాటి ప్రేమా, ఆందోళనలు గుర్తుకొచ్చేవి. మనుషులకి కాకులకి మధ్యన వున్న భేదం స్పష్టంగా కనిపించేది. అప్పటి తుపాకీ గుర్తుకొచ్చేది.

ఈ మనుషుల్లోని అత్యాశని చంపే తుపాకి ఒకటి వుంటే బాగుండునని అనిపిస్తుంది. ఇది కూడా నా అత్యాశేనేమో!

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story

Most Viewed