- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కథా సంవేదన: ఖాళీ సిగరెట్ పెట్టె
నా చిన్నప్పుడు మా ఇంటి ముందే గ్రామ పంచాయతీ ఆఫీసు ఉండేది. ఆ తరువాత అది పోలీసు స్టేషన్ ఎదురుగా మారిపోయింది. గ్రామ పంచాయతీ కాస్త మున్సిపల్ ఆఫీసుగా మారిపోయింది. అది వేరే విషయం. అప్పుడు మా వూర్లో ఇప్పటి మాదిరిగా టీవీలు లేవు. టీవీల సంగతి దేవుడెరుగు. రేడియోలు సరిగ్గా అందరి దగ్గరా లేని కాలం అది. మా గ్రామపంచాయతీ ఆఫీసులో ఓ రేడియో ఉండేది. మైకులాగా ఉండేది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మైకు ద్వారా రేడియో మారుమోగేది. అప్పట్లో రేడియో ఉన్నవాళ్లకి లైసెన్స్ ఉండాలి. వాటిని పరిశీలించడానికి ఓ అధికారి వచ్చేవాడు. అతను వస్తున్నాడని తెలియగానే లైసెన్స్ లేని వాళ్లు రేడియోల గొంతు నొక్కేసేవారు.
మా గ్రామ పంచాయతీ ఆఫీసు కిష్టయ్య సార్ వాళ్లది. గ్రామ పంచాయతీలో ఆఫీసు వెనుక రెండు జామ చెట్లు ఉండేవి. మా ఇంటిలోని జామచెట్టు కాయలు అయిపోయినవని అనిపించగానే మేం గ్రామ పంచాయతీ ఆఫీసులోకి వెళ్లి తెంపుకునేవాళ్లం. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అందరూ వెళ్లిపోయిన తర్వాత నేనూ నా మిత్రులం గ్రామ పంచాయతీ లోకి వెళ్లి జామకాయలను తెంపుకునే వాళ్లం. గ్రామ పంచాయతీలో కాకుండా మాకు జామకాయలు దొరికే స్థలం మా భీమన్న గుడి.కొన్ని సార్లు ఇంట్లో జామ కాయలు ఉన్నప్పటికీ ఈ రెండింటిలో నుంచి తెచ్చుకోవడం మాకు గొప్ప సరదాగా ఉండేది.
మా గ్రామ పంచాయతీలోకి ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవాడు. చాలామంది మా చిన్నతనంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వచ్చి పోయి ఉంటారు. వాళ్ల పేర్లు కూడా మాకు తెలిసేవి కావు. కానీ అభిమన్యు పేరు మాత్రం బాగా గుర్తు. ఆయన మా ఇంటి ముందర ఉన్న బ్రాహ్మల ఇంట్లో కిరాయికి ఉండేవారు. ఆయన తనతోపాటు తన తమ్ముడిని తెచ్చుకున్నాడు మా వేములవాడకి. అతని పేరు ప్రహ్లాద్. అతను మా వయస్సు వాడు. మాతోపాటు స్కూలుకి వచ్చేవాడు. బడి అయిపోయిన తరువాత అతని మకాం మా ఇంట్లోనే. వాళ్లు హైదరాబాద్ నుంచి వచ్చారు. అందుకని అతను కాస్త తెలివిగా ఉండేవాడు. ఎన్నో కొత్త ఆటల గురించి చెప్పేవాడు. అంతకు ముందు మేం చెర్ర గోనే, మారం ఫీట్, కబడ్డీలాంటి ఆటలు ఆడేవాళ్లం. అతను ఎన్నో కొత్త ఆటల గురించి మాకు చెప్పేవాడు. అందులో ముఖ్యమైనవి పిల్లి గీతలు, గోళీలాటలు కొత్తవి. చదరంగం లాంటివి ముఖ్యమైనవి.
ఇవే కాకుండా సిగరెట్ అట్టపెట్టెలతో ఓ కొత్త ఆట చెప్పాడు. ఓ పెద్ద గుండారంలో సిగిరెట్టు అట్టలని మట్టిలో నిల్చోబెట్టి, ఓ సన్నని శాబాష్ బండతో కొట్టాలి. ఎన్ని సిగరెట్టు పెట్టెలు బయటకు వస్తే అవి వాటిని కొట్టిన వాళ్లకి చెందుతాయి. ముందు ఎవరు కొట్టాలి. ఆ తరువాత ఎవరెవరు అన్న దానికి కొన్ని నియమాలు ఉండేవి. మా వూర్లో ఎక్కువగా దొరికే చార్మినార్‌కి తక్కువ విలువ చాలా అరుదుగా దొరికే సిగరెట్ కవర్లకి ఎక్కువ విలువని అతడు నిర్ణయించేవాడు. మేమందరం అంగీకరిస్తేనే దానికి ఆ విలువ ఖరారు అయ్యేది. బర్కిలీ, విల్స్, గోల్ట్ ప్లేక్, ప్యాసింగ్ సో, ప్లేయర్స్ నేవీ కట్, విల్స్ క్లాసన్, ఫోర్ స్క్వేర్ ఇట్లా ఎన్నో. ఈ ఆటలో శారీరక శ్రమే కాదు గురి చూసే తత్వం, నేర్పు కూడా మాకు తెలిసేవి. మరీ ముఖ్యంగా వాటికి ఏర్పరిచిన విలువ వల్ల మా దగ్గర చాలా డబ్బులు ఉన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్లం.
అప్పటివరకు మా దృష్టికి రాని పాన్ డబ్బా దుకాణాలు మా దృష్టికి వచ్చాయి. రాజేశ్వరుని గుడి దగ్గరి మెయిన్ రోడ్‌లో డబ్బా రాజం పాన్ షాప్ ఉండేది. అది మా వూర్లో పాపులర్ పాన్ షాప్. చాలామంది ఆక్కడ పాన్లు కట్టించుకునేవాళ్లు. సిగరెట్లు కొనేవాళ్లు. చాలామంది ప్యాకెట్లుగా కాకుండా లూజ్‌గా కొనుక్కుని తాగేవాళ్లు. అందువల్ల అతని దగ్గర ఖాళీ సిగరెట్ పెట్టెలు ఉండేవి. అందుకోసం అతని దగ్గరకి సిగరెట్ డబ్బాల కోసం నేనూ మా మిత్రులం అడిగేవాళ్లం. మొదట ఇవ్వలేదు. ఆ తరువాత మా ఆట విషయాలు తెలుసుకుని ఖాళీ డబ్బాలని ఇచ్చేవాడు. మేం సిగరెట్లు అడగడం లేదని సంతోషపడే వాడేమో తెలియదు గానీ ఖాళీ సిగరెట్ డబ్బాలని మాకు ఇచ్చేవాడు.
ఒక్క అతని షాపే కాదు. మా వూర్లో పాన్ షాపులన్నీ మా మిత్రులందరికీ పరిచయం అయిపోయాయి. పాన్ షాప్‌ల్లోనే కాదు మా ఇంటి దగ్గర ఉన్న ప్రైవేట్ సర్వీస్ స్టాండ్ దగ్గర కూడా మాకు ఖాళీ సిగరెట్ పెట్టెలు దొరికేవి. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మా దృష్టి ఖాళీ సిగరెట్ పెట్టెలవైపు వెళ్లేది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పెద్దవాళ్లు మా జోలికి వచ్చేవాళ్లు కాదు. ఆ తరవాత చదువుకొమ్మని గట్టిగా చెప్పేవాళ్లు. మా ఇంటి ముందూ ఇంటికి వెనకా విశాల స్థలం ఉండేది. మేం ఎక్కువగా అక్కడనే ఆటలు ఆడేవాళ్లం. పెద్దవాళ్ల కనుసన్నల్లో ఉండేవాళ్లం.
ప్రహ్లాద్ హైదరాబాద్ వెళ్లి వచ్చినప్పుడు కొన్ని కొత్త సిగరెట్ అట్టపెట్టెలు తెచ్చి వాటికి ఎక్కువ విలువని ప్రపోజ్ చేసేవాడు. అందుకు మేం అంగీకరించక పోయేవాళ్లం. చివరికి దానికి తక్కువ విలువని కేటాయించేవాడు. ఆ కొత్త లేబుల్స్ పైన మాకు మోజు ఉండేది. మా దగ్గర ఉన్న వాటితో దాని విలువకి తగినట్లుగా ఇచ్చి మార్చుకునేవాళ్లం. కరీంనగర్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొత్త ఖాళీ సిగరెట్ పెట్టెలు దొరుకుతాయేమోనని చూసేవాడిని. మా మిత్రులు కూడా అలాగే చూసేవాళ్లు. మా వూర్లో దొరకని బ్రాండ్లకు ఎక్కువ విలువని పెట్టడానికి ఎవరూ అంగీకరించేవాళ్లం కాదు.
సిగరెట్ లేబిల్స్ జమ చేయడం అందరికీ హాబీగా మారింది. అలా కొంత కాలం తరవాత అభిమన్యు గారికి మా వూరి నుంచి బదిలీ అయ్యింది. ప్రహ్లాద్ మమ్ములను విడిచి పెట్టే పరిస్థితి వచ్చింది. అతను వెళ్లిపోయాడు. సిగరెట్ అట్టపెట్టెల ఆట మూలకు పడింది. మేం పెద్దవాళ్లం అయిన తర్వాత కొత్త ఆటల్లోకి మారిపోయాం. వేములవాడ నుంచి ప్రహ్లాద్ వెళ్లిపోయినా కూడా అతన్ని మేం మర్చిపోలేదు. అతనూ మమ్మలను మర్చిపోలేదు. శివరాత్రి సమయంలో వచ్చి వెళ్లేవాడు. రెండు మూడుసార్లు వచ్చినట్లు గుర్తు. ఆ తర్వాత మా మధ్యన గ్యాప్ ఏర్పడింది.
ఒకసారి వేములవాడకి వచ్చినప్పుడు, నా అడ్రస్ తెలుసుకుని కరీంనగర్‌కి వచ్చి కలిశాడు. అప్పుడు నేను క్లాక్ టవర్ దగ్గర మా రాధక్క దగ్గర ఉండి చదువుకుంటున్నాను. అడ్రసులు దగ్గర ఉంచుకోవడం అదీ తెలియదు. రవీందర్ హైద్రాబాద్‌లో చదువుతున్నప్పుడు యుగంధర్‌తో కలిసి ఒకసారి ప్రహ్లాద్‌ని కలిశాడు.
అంతే! మాకు అతనితో అట్లా దూరం పెరిగిపోయింది. ఆధునిక సాంఘిక మాధ్యమాల్లో అతని కోసం శోధించినా ఫలితం లేకపోయింది. కొత్త సిగరెట్ లేబిల్స్ కనిపించినప్పుడల్లా అతని జ్ఞాపకం చల్లటి గాలిలా నా మదిని తాకుతుంది. అతని కోసం ఇంకా కాస్త గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఖాళీ సిగరెట్ పెట్టెలని జమ చేయడం లేదు. వాటికోసం వెతకడం లేదు. అప్పటి జ్ఞాపకాలను వెతుకుతున్నాను. మా మిత్రులు కూడా అదే పని చేస్తున్నారు.
బహుశా ప్రహ్లాద్ కూడా తన జ్ఞాపకాలని వెతుక్కుంటున్నాడేమో! ఇప్పుడు అవి ఖాళీ సిగరెట్ పెట్టెలు కాదు. జ్ఞాపకాల ముద్రలు. అప్పుడు వాటికి ఓ విలువని (ఖరీదు) ఏర్పరిచాం. ఇప్పుడు ఖరీదుని ఏర్పాటు చేయడం అసాధ్యం.
మంగారి రాజేందర్ జింబో
94404 83001