- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: బిగ్గరగా నవ్వాలంటే..
చిరునవ్వు అందరిలో వుంటుంది. అందరితో కూడి చిరునవ్వు బిగ్గరగా నవ్వాలంటేనే కష్టం. బిగ్గరగా నవ్వాలంటే పాత స్నేహితులైనా ఉండాలి. లేదా కుటుంబ సభ్యులైనా ఉండాలి. చిరునవ్వుకి, గట్టిగా నవ్వడానికి మధ్యన భేదం..
మొన్నీ మధ్య మిత్రుడు సంజీవరెడ్డి ఫోన్ చేస్తే కాసిన్ని జోకులు వేసుకొని బిగ్గరగా నవ్వుకున్నాం. ఐదారు సంవత్సరాల క్రితం జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆనందపడినాం. బాధపడినాం . అప్పుడు మిత్రులందరమూ హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో వుండేవాళ్లం. రోజూ ఉదయం ఇందిరా పార్క్‌లో ఉదయపు నడకను కొనసాగించేవాళ్లం. అది ఒక నడక మాత్రమే కాదు. ఎన్నో విషయాలు మా మధ్యన దొర్లేవి. అవి రాజకీయాలు కావచ్చు సినిమాలు కావచ్చు. కోర్టుల విషయాలు కావచ్చు. కాలేజీ ముచ్చట్లు కావచ్చు. ఒకరి మీద ఒకరి జోకులు. కొన్నిసార్లు కఠినమైన జోకులు కూడా వుండేవి. అయినా ఎవరూ బాధపడేవాళ్లు కాదు. బాధపడినా అది కొంతసేపు మాత్రమే. ఆ తరువాత అంతా మామూలే.
కొద్దిరోజులకి సంజీవరెడ్డి సోమాజిగూడలోని కొత్త ఫ్లాట్‌కి మారిపోయాడు. ఆ తరువాత సత్యంరెడ్డి ఇనార్బిట్ మాల్ దగ్గరికి వెళ్లిపోయాడు. కిషొర్ బోయిన్ పల్లి వైపు వెళ్లిపోయాడు. రాజేందర్, ధనంజయ్, అజయ్‌రెడ్డి, రాజ మౌళి శర్మలు మిగిలిపోయారు. ఓ ఐదు సంవత్సరాల క్రితం నేనూ అక్కడి నుంచి సన్ సిటీకి మారిపోయాను. ఇందిరా పార్క్ చిన్నబోయింది. ఆ రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా మేమంతా చిన్నబోయేవాళ్లం. కొత్త స్నేహాలు, కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం. కొత్త స్నేహితులు. కానీ అంత బిగ్గరగా నవ్వడం తగ్గిపోయింది. ఇదే పరిస్థితి అందరి విషయంలో.
కొత్తలో అప్పుడప్పుడు ఆదివారం ఉదయం ఇందిరా పార్కు లో కలిసేవాళ్లం. హోటల్‌కి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసే వాళ్లం. అది కాస్తా తగ్గిపోయింది. కాదు మాయమైపోయింది. కరోనా కాలం కూడా అందుకు కారణం. ఫోన్‌లో సంజీవరెడ్డి గుర్తు చేసింది ఇదే విషయం. ఎప్పుడో చిన్నప్పటి విషయాలు కాదు. నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలే అద్భుతంగా కన్పిస్తున్నాయి. ఇప్పటి నుంచి తరుచూ కలుసు కోవాలని నిర్ణయం తీసుకున్నాం.
బిగ్గరగా నవ్వుకోవాలంటే చిరకాల స్నేహితులని కలుసుకోవాల్సిందే. కలవకపోయినా మాట్లాడుకొని నవ్వాల్సిందే. ఎందుకంటే చిరునవ్వు అనేది క్లిష్ట పరిస్థితులకి ప్రతిస్పందన. అయితే నవ్వు అనేది టానిక్ లాంటిది. గడిచిన రోజులని తలుచుకోవడమే కాదు. వర్తమానంలోనూ ఆనందంగా గడపాలి. బిగ్గరగా నవ్వడం అందుకు ఓ పనిముట్టు. మాయమైన నవ్వులని మళ్లీ తీసుకొని రావాలని అనుకున్నాము.
మంగారి రాజేందర్ జింబో
94404 83001