- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: కైలాసం
నీడ పట్టున ఆడే ఆటలు మా చిన్నప్పుడు చాలా వుండేవి. అందులో ముఖ్యమైనవి క్యారమ్ బోర్డ్, చెస్, అష్టాచెమ్మా, పచ్చీసు, కైలాసం. ఎండాకాలం బయటకు పోనిచ్చే వాళ్ళు కాదు. అప్పుడు మేం ఆడే ఆటలు ఎక్కువ ఇవే. శివరాత్రి రోజు ఈ ఆటలకి ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళం. మా అమ్మ వదినలు పచ్చీసు ఎక్కువగా ఆడేవాళ్ళు. మా బావలు మా వేములవాడలో ఉండే రెమ్మీ ఆడేవాళ్ళు. మా చిన్నతనంలో టీవీలు లేవు. స్మార్ట్‌ఫోన్లు మీ ఊహాలో లేవు. వున్న రేడియో కేంద్రాలు కూడా త్వరగా నిద్రపోయేవి. శివరాత్రి రోజు జాగరణ చేసేవాళ్ళు. పిల్లలం రాత్రి పన్నెండు గంటల దాకా మెలకువతో ఉండి ఆటలు ఆడి ఆ తరువాత నిద్రలోకి జారుకునేవాళ్ళం. అందుకని ఒక్క పొద్దు విడిచిన తరువాత ఈ ఆటల్లో మునిగి పోయేవాళ్ళు.
అప్పటికీ మా రాజేశ్వరుని దర్శనం ఒకసారి అయిపొయ్యేది. ఓపిక వున్న వాళ్ళు 12 గంటల తరువాత కూడా మరో దర్శనం చేసుకునే వాళ్ళు. ఇప్పటి మాదిరిగా ఇంత రష్ అప్పుడు వుండకపోయేది. ఊరి వాళ్ళకి కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చి లోపలికి పంపించేవాళ్ళు. మేం అష్టాచెమ్మా, కైలాసం ఆటలు ఎక్కువగా ఆడేవాళ్ళం. ఈ రెండు ఆటల్లో కైలాసం ఆట ఆడటానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళం. పరమపద సోపానం దాటి కైలాసం చేరుకోవడం త్రిల్లింగ్‌గా ఉండేది. శివరాత్రి రోజు కైలాసం ఆట ఎందుకో రెలవెంట్‌గా అనిపించేది. కైలాసం ఆటలో ఎన్నో పాములు ఉండేవి. మరెన్నో నిచ్చెనలు ఉండేవి. అందరి కన్నా ముందు పరిగెత్తిన వ్యక్తిని ఎక్కడో పెద్ద పాము మింగి మళ్లీ కిందకు వచ్చేవాడు. ఆ ఆటలో విజయం మనమీదే ఆధారపడి ఉండేది. మిగతా ఆటల మాదిరిగా ఇతరుల శక్తి సామర్థ్యాల మీద మన విజయం ఆధారపడి ఉండేది కాదు.
కాలక్రమంలో చదువు నాకు పడదు. కానీ నన్ను డాక్టర్ చదివించాలని రఘుపతన్నకి కోరిక. నాకు ఇంటర్మిడీయట్‌లో మంచి మార్కులు రాకపోయినా నన్ను బీఎస్సీ చదవమన్నాడు. కాలేజీలో వున్న ధర్మయ్య లెక్చరర్‌కి చెప్పి నన్ను సైన్స్‌లో చేర్పించాడు. లాంగ్వేజెస్‌లో మంచి మార్కులు వచ్చేవి. సైన్స్‌లో తక్కువ మార్కులు వచ్చేవి. ఆర్గానిక్ సైన్స్ క్లాసు వున్నప్పుడల్లా క్లాస్ ఎగ్గొట్టి లైబ్రరీలో కూర్చోని సాహిత్యం చదువుకునేవాడిని. సైన్స్ చదవను అని చెప్పే స్వాతంత్ర్యం అప్పుడు లేదు. చివరికి ఫైనల్ ఎగ్జామ్ పోయింది. మా ఫ్రెండ్స్ పాసయినారు. నా సన్నిహిత మిత్రుడు రవీందర్ పాసయినాడు. నేను ఫెయిల్ అయ్యాను. ఒక రకమైన భావానికి లోనయ్యాను. బీఎస్సీ పూర్తి చేస్తానా అన్న సందేహం కూడా నాలో కలిగేది. కరీంనగర్ నుంచి వేములవాడకి వచ్చేశాను.
వేములవాడలోని చిన్ననాటి మిత్రులు చాలామంది కూడా డాక్టర్లు అయిదామనుకొని బీఎస్సీ చదివి ఫెయిల్ అయినారు. అందరమూ మా బంగ్లా మీద రెమ్మి ఆటలు, బీట్ సాట్ ఆటలు ఆడేవాళ్ళం. ఓ నలుగురం మాత్రం చెస్‌ని చాలా సీరియస్‌గా ఆడేవాళ్ళం. ఆ ఆటలో నేను ఎప్పుడూ గెలిచేవాన్ని. నాతో ఆడటానికి ఇష్టపడే మిత్రులు ప్రతాప్, అంజన్నలు. మా మిత్రులు ఉదయాన కొంతమంది బజార్‌కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు తిరిగి వచ్చేవరకు కూడా మా ఆటలు కొనసాగేవి. చాలా విషయాలు నాకు గుర్తుండేవి. చెస్‌లో నన్ను ఓడించే వాళ్ళు అప్పుడు మా వూరిలో లేరని చెప్పవచ్చు. ఇంత జ్ఞాపకశక్తి, ఇంత ఆలోచన వున్న నేను బీఎస్సీ ఎట్లా ఫెయిలైనానని మా మిత్రుడు మా జూనియర్ సాంబశివుడు ఒకసారి అన్నాడు. అదే విషయం నాకు అర్థం కాలేదు.
కొంతకాలానికి మా పరీక్షలు సమీపిస్తున్న దశలో శివరాత్రి వచ్చేసింది. శివరాత్రి అంటే మా వేములవాడలో పెద్ద జాతర. రకరకాల ఆటలు, సర్కస్‌లు, ఎలక్ట్రిక్ దీపాలు, అమ్మాయిలు ఒకటేమిటీ ఎన్నో.
అప్పుడు మా రెగ్యులర్ ఆటలు రెమ్మీ, చెస్ కాకుండా కైలాసం ఆడి జాగారణ చేద్దామని మా మిత్రులం నిర్ణయం తీసుకున్నాం. చిన్నప్పటి ఆట అప్పటి జ్ఞాపకాలకి అలా వెళ్ళిపోయాం. మా బంగ్లా మీద మా మకాం. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బంగ్లా మీదకు వెళ్లే సౌకర్యం ఉంది. అందుకని ఎంతమంది మిత్రులు వస్తున్నారన్నా విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసేది కాదు. తెలిసినా అభ్యంతరం పెట్టక పోయేవాళ్ళు. వాళ్ళ కోరిక ఒక్కటే చదువుకొని ప్రయోజకులు కావడం మాత్రమే.
మేం ఐదుగురం మిత్రులం కలసి కైలాసం ఆట ఆడటం మొదలుపెట్టాం. మిగతా మిత్రులు చెస్, రెమ్మి ఆడటం మొదలు పెట్టారు. రాత్రి 12 గంటల దాకా మెలకువలో వుండి ఆ తరువాత గుడికి వెళ్ళి రాజేశ్వరుని దర్శనం చేసుకొన్న తరువాత మాత్రమే పడుకోవడం. మా కైలాసం ఆట మొదలైంది. మంచి పంజాలు పడ్డ మిత్రుడు త్వరత్వరగా పైకి వెళ్ళాడు. కైలాసం దగ్గరికి వెళ్ళే దగ్గర ఓ పెద్ద పాముంటుంది. అది మింగింది అతన్ని. అంటే అతను వేసిన పంజం ఆ పాము దగ్గరికి మాత్రమే చేరింది. ఫలితంగా పూర్తిగా క్రిందకు వచ్చేశాడు. దాని పక్కనే నిచ్చెన ఉంది. మళ్ళీ అతని వంతు రాగానే పంజం వేసి ఓ చిన్న నిచ్చెన ఎక్కి మూడో వరసలోకి వచ్చాడు. అతని పరిస్థితిని చూసిన నాకు ఆ ఆటలో అంతర్లీనంగా వున్న సందేశం బోధపడింది.
చిన్నప్పుడు అర్థం కాని విషయం డిగ్రీ చదువుతున్నప్పుడు, మరో విధంగా చెప్పాలంటే రెండోసారి డిగ్రీ పరీక్షకి తయారవుతున్నప్పుడు అర్థమైంది. నిచ్చెనని అందుకోకపోయినా మామూలు అడుగులలో గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. చేయాల్సింది ఒక్కటే పాములు మింగే విధంగా మన పందెం పడకుండా జాగ్రత్తగా గవ్వలని ఉపయోగించాలి. ఆ రోజు ఆట తరువాత జీవితపు ఆటలో కష్టపడి మంచి పంజాలు వేశాను న్యాయమూర్తి అయ్యాను. ఎంతోమంది న్యాయమూర్తులను తయారు చేశాను. చేస్తున్నాను.
కైలాసం ఆట నుంచి నేను నేర్చుకున్నది ఇదే.
మంగారి రాజేందర్ జింబో
94404 83001