- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మారుతున్న సమీకరణాలు... కాగలవా ఓటర్లకు వశీకరణాలు!
తెలంగాణలో రాజకీయం మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత ఇక్కడ మార్పు మొదలయ్యింది. కాంగ్రెస్ కర్ణాటకలో భారీ విజయం సాధించడంతో రాష్ట్ర పరిస్థితి మారిపోయింది. అధికార బీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొనే పార్టీ బీజేపీనా లేక కాంగ్రెస్ పార్టీనా అన్న దానిపై చర్చలు, విశ్లేషణలు జోరందుకున్నాయి. ఎలాగైనా పార్టీని ఆధికారంలోకి తేవాలన్న తలంపుతో భేషజాలను పక్కనపెట్టి పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి రావాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పిలుపునిచ్చి, దానికి తగ్గట్టు సామాజిక వర్గ సమీకరణాలు ప్రభావితం చేసే చర్యలు ప్రారంభించారు. ఇది ఫలితం ఇచ్చినట్టే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పార్టీని విడిపోయిన ముఖ్య నేతలు ఘర్ వాపసీ ద్వారా వెనక్కి పిలవాలన్న రేవంత్ ప్రయత్నం పార్టీలోని ఆయన వ్యతిరేకులను సైతం ఆలోచింపజేసింది. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్న నేతలు సైతం మారిన రేవంత్ వ్యవహార శైలిని మాటల సరళిని ప్రశంసిస్తున్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అదంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుతుందని చాలామంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఈ దూకుడు అవశ్యం
కర్ణాటక తరహా వ్యూహాలకు పదునుపెట్టి పార్టీని వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి రప్పించడం. ఉన్న నాయకులకు పార్టీ వ్యవహారాలలో సముచిత స్థానం ఇవ్వడం. ఎన్నికల ప్రణాళికకు తదితర కార్యక్రమాల అమలుకు కమిటీలు వేసి క్షేత్రస్థాయి నుంచి శ్రేణులను బలోపేతం చేయడమే కాకుండా కలిసివచ్చే పార్టీలతో చర్చలు జరపడం. అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నాయకుల చేరికపై దృష్టి సారించడం లాంటి పదునైన వ్యూహాలతో కాంగ్రెస్ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోందనే చెప్పాలి. ఆధికార పార్టీ నుంచి బహిష్కరించిన నాయకుల చేరిక దాదాపు ఖాయమైన నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నారు. నాయకుల సమన్వయ బాధ్యతలు, చేరికల పైన దృష్టి సారించారు. అలాగే మూడు నెలల ముందే అభ్యర్దులను ప్రకటిస్తాం! అనే కొత్త వ్యూహం పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని తెస్తోంది. ఇవన్నీ చూస్తుంటే పార్టీ కర్ణాటక తీరులో బలపడటానికి సన్నద్ధం అవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణాలో పురుడు పోసుకున్న పార్టీలు కాంగ్రెస్‌లోకి విలీనం కావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు.. విలీనానికి సైతం సిద్ధమైందని సమాచారం. అయితే ఈ ప్రజా పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఓట్లను చీల్చే ప్రమాదమున్నది.
కమల దళంలో కలకలం
ఇక కమలం పార్టీ నేతల శల్య ప్రకటనలు.. కమరనాథుల్లో కలవరం రేపుతున్నాయి. కర్ణాటక ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతల్లో నిరాశను నింపినట్లు ఆ పార్టీకి చెందిన నేతల మాటల్లోనే వ్యక్తం అవుతోంది. కమల దళంలో నివురుకప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి, నాయకుల మధ్య సమన్యయలోపం, ఆశించిన స్థాయిలో ఇతరపార్టీల నుంచి చేరికలు లేకపోవడం. బీజేపీ చేరికల కమిటీ దాదాపు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలపై ఇప్పటికే ఆ పార్టీలోని అనేకమంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొంతమందైతే ఆయనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా నడిపారు. తాజాగా విజయశాంతి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని, తన వల్ల కొందరు అభద్రతగా ఫీల్ అవుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి ప్రయాణం చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కమలదళంలోని కొందరు నాయకులకు అభద్రతాభావం నెలకొంది. సీనియర్లను కలుపుకొని పోకపోతే ఇక పార్టీ ముందుకేం పోతుంది? అంటున్నారు విశ్లేషకులు.
మాటకు, చేతకు పొంతన లేమి
రాష్ట్రంలోని స్థానిక పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలి. కీలక సమయంలో వ్యూహాత్మక తప్పిదాలు చేయటం, వినూత్న ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోవడం ఈ మధ్య కమలదళానికి పరిపాటిగా మారింది. ఎల్లప్పుడు జాతీయ సమస్యలు, జాతీయ స్థాయి అభివృద్ధిపై తప్పా, ఇక్కడి అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయక పోవడం, పసుపు బోర్డుపై కల్లిబొల్లి మాటలు చెప్పి ఆచరణలో చూపకపోవడం. రాష్ట్రానికి ప్రాజెక్టు కేటాయింపులు లేకపోవడం వంటివన్ని తీవ్ర ప్రభావాన్ని చూపే ఆంశాలుగా బీజేపీ భావించడం లేదు. జాతీయ నాయకుల చరిష్మానే తప్ప ప్రాంతీయంగా బలమైన నాయకులను, నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వంటి ఆంశాలు కీలకమైన కారకాలు. పార్టీలో అసమ్మతి లేదని గాంభీర్యం ప్రదర్శించి ఇటీవలే కార్యవర్గాన్ని ప్రకటించినా అది ఫలితాన్ని ఇవ్వలేదు. తరచూ ఢిల్లీకి రాష్ట్రనాయకుల పయనం అధిష్టానంతో మంతనాలు, అసమ్మతి బుజ్జగింపులు దిద్దుబాటు చర్యలతో కమలదళం సతమతమౌతోందన్నది సుస్పష్టం.
ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ అంటకాగిన పార్టీలు, ఈ సారి వ్యూహాన్ని మార్చి ఒంటరిగా బరిలోకి దిగి రానున్న కాలంలో కీలకంగా మారాలని వ్యూహాత్మకంగా మంత్రాంగం నడుపుతున్నాయి. సీట్లను ఆశించకుండా మద్దతు ప్రకటిస్తున్నాయి. వామపక్షాలు గతంలో మాదిరిగా ప్రభావం చూపలేక రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. పరిణామాలను బీఆర్ఎస్ పార్టీ సునిశితంగా పరిశీలిస్తోంది. రెండో స్థానం కోసం మాత్రమే రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయని.. మొదటి స్థానం మాత్రం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ఈ సారి గెలుపు నల్లేరుపై నడక కాదని అధికార పార్టీ గ్రహించాలి.
వాడవల్లి శ్రీధర్
99898 55445