- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాళేశ్వరం… కాల పరీక్షకు నిలిచేనా?
అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రధాన రాజకీయ ఎజెండాగా ముందుకు వచ్చిన తరుణమిది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాన్ని ఎవరి నుండి, ఎలా పూడ్చాలి అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఒక చిన్న నిర్మాణం మొదలు పెట్టినా కూడా, మట్టి నాణ్యత పరీక్ష, పునాది ఎంత లోతు ఉండాలి, పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల మందపు స్లాబ్ ఉండాలి, ఎంత స్టీల్ వాడాలి అని వాటి భద్రత కోసం ఎంతలా తపన పడతాం. ఉండే ఇల్లు అయినా, కట్టే ప్రాజెక్టు అయినా నమ్మకంతో బాధ్యత గల మేస్త్రీ కాంట్రాక్ట్‌కు అప్పగిస్తాం. సుమారు రెండు వందల ఏళ్ల కింద సర్ ఆర్థర్ కాటన్ అనే పరదేశి ఇంజనీర్, గోదావరి తీరాన బీడు భూములకు నీళ్ళు ఉంటే పంటలు బాగా పండటమే కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయవచ్చని బ్రిటిష్ పాలకులను మెప్పించి మరీ చరిత్రలో నిలబడి పోయే ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు. అదీ బాధ్యతగా చేసిన పని అని గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం కదా !
ఇంజనీరింగ్ పరిజ్ఞానం అంటే...
ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టే సమయంలో... గోదావరి పుట్టిన ప్రదేశం నుండి మొదలుపెట్టి, నది సముద్రంలో కలిసే వరకు అడుగు అడుగునా నీటి ఉధృతి కొలతలు వేసి మరీ పరిగణనలోకి తీసుకున్నారు. నది సముద్రంలో కలిసే చోట, ఒంపులు తిరిగే చోట, నీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించి, ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని నిర్ధారించాడు కాటన్. ధవళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొదట పోలవరం దగ్గర ఆనకట్ట కడదామని అనుకున్నాడట. గోదావరి నీటి ఉరవడి అక్కడ ఎక్కువ ఉందని గ్రహించి, ఆ ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణ ఆలోచన విరమించుకుని, ధవళేశ్వరాన్ని ఎంచుకున్నాడు. నీటి గుంటలలో, వాగులలో చేపలు పట్టేవాడు కూడా నీటికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, నీళ్లు ఎలా బయటకు గుప్పాలి అని ఆలోచన చేస్తాడు. కానీ కొందరు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, హడావుడిగా గోదారమ్మకు నడకలు నేర్పాలి అనుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మొన్న వరదలు వచ్చాయి. కానీ బ్రిటిష్ కాలం నాడు కట్టిన ప్రాజెక్టు నీట మునిగినా కూడా, తట్టుకుని నిలబడింది.
మొహంజోదారో అంతర్ధాన కారణం
మొహంజోదారో నాగరికత మట్టిమనుషులు స్వేదంతో ఏర్పరచిన పురాతన జ్ఞాపకం. నదీ నాగరికత అంటేనే, మానవాళి మనుగడకు, వికాసానికి మూలం. ప్రజల నాగరికతకు ఏ నది జీవం పోసిందో, అదే నది తుడిచిపెట్టిన పురాతన జ్ఞాపకం మొహంజోదారో నాగరికత అని మరువరాదు. మొహంజోదారో నాగరికత అంతరించి పోవడానికి ప్రధాన కారణం, అవగాహన లేకుండా నదికి ఆనకట్ట కట్టడమే అని చరిత్ర నిరూపించింది. అదీ నీళ్లకు ఉన్న శక్తి. మరి మేడిగడ్డ దగ్గర, ఎలాంటి వానలు వరదలు లేని సమయంలోనే ఆనకట్ట రెండు అడుగులు కుంగిపోయింది అంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంజనీర్లు ఆనకట్ట కింద ఫిల్లింగ్ చేసి నిలబెడతాం అంటారేమో?
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే....
3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తి పోయడం, 240 టిఎంసీల ఉపయోగం... అర్ధం అయ్యేది ఏమిటి అంటే పైన పేర్కొన్న అన్ని నిర్మాణాలకు మూలమైనది, ప్రధాన కట్టడం మేడిగడ్డ. దాని ద్వారానే మిగతా అన్ని దారులకు నీళ్ళు వెళ్ళాలి. అంటే మొత్తం ప్రాజెక్టుకు వెన్నెముక మేడిగడ్డ. అంత పెద్ద పిల్లర్‌లు కూడా, నిట్టనిలువుగా చీలిపోయాయి అంటే ముందు ఉండే ప్రమాదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
వెన్నుపూస విరిగాక, మిగతావి ఉండేదెలా?
భారీ ప్రాజెక్టుల నిర్మాణం సరైనది కాదని పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా చూడాలని గగ్గోలు పెడుతున్నారు. ఈ నిర్మాణాల వలన పర్యావరణ సమస్య, భూకంపాల భయం, నిర్వాసితుల సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని బుద్ధిజీవులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వీరి సూచనలను, ప్రజా ప్రయోజనాలను పెడచెవిన పెడుతూ, కమీషన్ల కోసం కక్కుర్తి పడి, ఆర్భాటంగా నిర్మాణం చేస్తున్నారు. భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాన్ని ఎవరి నుండి, ఎలా పూడ్చాలి? కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పాలకుల నుండా, కాంట్రాక్టు సంస్థల నుండా, ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజనీర్ల నుండా? సిన్సియర్‌గా, సీరియస్‌గా ఆలోచించాలి.
రమణాచారి
99898 63039