ఏకస్వామ్యం వైపుగా జమిలి ఎన్నికలు..

by Ravi |
ఏకస్వామ్యం వైపుగా జమిలి ఎన్నికలు..
X

'ఒకే దేశం ఒకే పన్ను' నినాదం తర్వాత, నేడు ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అనే యజ్ఞం కోసం కేంద్రం సిద్ధమైపోయినట్టుంది. గత సంవత్సరమే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం, అది సిఫారసులు ఇవ్వడం, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం, ప్రభుత్వం అందుకు అనుగుణంగా సన్నద్ధం కావడం జరిగిపోతోంది. ఈ సిఫారసుల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగితే, వాటి కాలపరిమితి కూడా లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత, ఆ రాష్ట్రాలు మరలా లోక్‌సభతో కలిపి ఎన్నికల కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది.

ప్రభుత్వం వాదన ప్రకారం, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. ఎన్నికల కోడ్ మాటిమాటికి లేకపోవడం కారణంగా వివిధ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తొలగుతాయి. కాబట్టి పరిపాలనలో అడ్డంకులు లేకుండా సున్నితంగా ముందుకు నడుస్తుంది. ప్రతిపక్షం ప్రకారం, భారతదేశం ఫెడరల్ రాజ్యాంగం స్వభావంతో ఉంది. కేంద్రం హక్కులు కేంద్రానికి ఉన్నాయి. రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదం కింద రాష్ట్రాలు తమకంటూ ఒక ఉనికిని కోల్పోతాయి.

అవిశ్వాస తీర్మానాలు పనిచేయవ్!

ఈ కొత్త విధానం ఎన్నో కొత్త సమస్యలను సృష్టి స్తుంది. లోక్‌సభలో ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆ ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే, ఆ ప్రభుత్వం మీద అవిశ్వాసం ఏర్పడినప్పుడు, ఆ ప్రభుత్వం పడిపోయి మరలా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, జమిలి ఎన్నికల ప్రకారం, ఈ అవకాశం ప్రజలకూ, ప్రజాప్రతినిధులకూ దొరక్కుండా పోతుంది. అంటే, ఒకసారి మనం ఎన్నుకుంటే, ఆయా ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేసినా సరే, అవిశ్వాస తీర్మానం అనేది అసాధ్యం అయ్యేలా వాస్తవ పరిస్థితి ఉంటుంది. ఒకవేళ, కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చేటప్పుడు, రాష్ట్రాల అసెంబ్లీల పరిస్థితి ఏమవుతుంది? ఇదే పరిస్థితి రాష్ట్రాలలో కూడా రావచ్చు. అప్పుడు లోక్‌సభ గడువు వరకు ఆ రాష్ట్రాలు వేచి ఉండాలా? అంతవరకూ ఆయా రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ రూల్ విధిస్తారా? కనీస ప్రజాస్వామ్య హక్కులు ఇవ్వరా?

జమిలి... సమాఖ్యకు వ్యతిరేకం

నోట్ల రద్దు సమయంలో కూడా దేశానికి ఏదేదో మంచి జరిగిపోతుందనీ, ఇదో మహా యజ్ఞం అనీ నమ్మించారు. జీఎస్‌టీ సమయంలో కూడా ఇలానే నమ్మించారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయి. ఖర్చు తగ్గుతుందనే సాకుతో దేశమంతా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అనేది పార్లమెంటరీ రాజ్యాంగానికి, ఫెడరల్ విధానానికి విరుద్ధం. 2014 నుండి ఎన్నికలు మరింత ఈవెంట్ మేనేజ్మెంట్‌గా మారిపోయాయి. ఎన్నికలు ఒక భారీ వ్యాపారం అయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల కుంభ కోణం మనకు తెలిసిందే. వ్యాపారాలు నిశ్చయంగా ధనిక వర్గానికి మాత్రమే ప్రయోజనం ఇస్తాయి. అలానే, వ్యాపారంగా రూపొందిన ఎన్నికలు కూడా. ప్రజలకు ప్రజాస్వామ్యం అనే మాటలు చెబుతూ, ఒకవైపు కార్పొరేట్లు, మరోవైపు విపరీతంగా డబ్బు బలం ఉన్న ధనిక పార్టీలు కుమ్మక్కై మొత్తం ఎన్నికలని హైజాక్ చేసి దేశమంతా ఒకే పార్టీ ఉండేలా శాసించే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా 1990 తర్వాత ప్రారంభమైన ప్రపంచీకరణ ప్రజా ప్రయోజనాలను పక్కకు తోసి, పాలసీల్లో కార్పొరేట్ వర్గం ప్రయోజనాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2014 తర్వాత ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రశాంత్ కిషోర్‌ల ప్రవేశంతో ఎన్నికల రూపురేఖలే మారిపోయాయి.

చిన్నపార్టీలు కుప్పగూలుతాయ్!

దేశంలోకి విపరీతంగా వచ్చి పడుతున్న పెట్టుబడులకు ఒక సానుకూలమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు కావాలి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గానికి తమకు ఇబ్బంది కలగని, తమ పాలనా విధానాలకూ, తమ వ్యాపార ప్రయోజనాలకూ అడ్డంకులు లేని ఒక సున్నితమైన ఆర్థిక విధానం కావాలి. ఎన్నికలు దేశమంతా ఒకేసారి నిర్వహిస్తే ప్రయోజనం పొందేది. ఎన్నికల ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించగలిగే బీజేపీ లాంటి బలమైన పార్టీలే. చిరునామా కోల్పోయేది రాష్ట్రాలకు సంబంధించిన చిన్న పార్టీలే. ఎన్నికల మీద మరింత భారీగా పెట్టుబడులు చేరతాయి. కాబట్టి ఖర్చు తగ్గడం అనేది జరగదు. ఎన్నికల నిర్వహణ మరింత సులభం అవుతుందనే వాదన అర్థం లేని మాట. ఎన్నికలను నిర్వహించే ఎన్నికల కమిషన్ ఇలా ఎన్నికల నిర్వహణ కష్టం అవుతుందని ఏనాడైనా చెప్పినట్టు భారత పౌరులు విన్నట్టు లేదు. ఇంతవరకు ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలను మనం చూడ లేదు. అలానే, సంక్షేమ పథకాలకు ఎన్నికల కార ణంగా ఆయా రాష్ట్రాల్లో ఇబ్బంది వచ్చినట్టు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం వైఫల్యం అవు తుంది. కానీ, ఎన్నికలు అందుకు కారణం కావు.

ఏకస్వామ్యంలోకి ప్రజాస్వామ్యం!

ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతుందనేది మరో వాదన. రెండు సార్లు ఓటు వేసే ప్రజలు ఒకసారే ఓటు వేస్తారు అని. కానీ ప్రజలకు ఈ ఒక్క రోజూ ఆదా చేసేసినంత మాత్రాన వారికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు దేశమంతా జరిగి, ఆ తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా సరే మరలా ఐదు సంవత్సరాల వరకు ఎన్నికలు నిర్వహించని పరిస్థితి ఉన్నప్పుడు వినడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యం మెల్లమెల్లగా ఏకస్వామ్యంలోకి పయనిస్తుంది. లోక్‌సభకు అనుగుణంగా రాష్ట్రాలలోని శాసన సభలు తమకు తాము సర్దుకోవడం అలవాటు చేసుకుంటాయి. ఇలా సర్దుకోవడం పరోక్షంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి కేంద్రాన్ని బలోపేతంగా మార్చుతుంది. అప్పుడు వీరు కలలుగనే హిందూ రాష్ట్రం ఇంకా ఎంతో దూరంలో ఉండదు. ఎన్నికలు మాటిమాటికీ నిర్వహించేటప్పుడు ఏదైనా పాలనాపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని సులభతరం చేయడానికి మారుతున్న కాలంతో పాటు ఎన్నికల పద్ధతులు మరింత ఆధునికీకరణం చేయడానికి ప్రయ త్నాలు జరగాలి. అంతేగాని మొత్తం ఎన్నికలన్నిటినీ ఒక దగ్గరే ప్యాకింగ్ చేసే పద్ధతులు ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం అందించవు. ఏవైనా ప్రయోజనాలు అంది స్తే బలమైన పార్టీలకూ, స్వేచ్ఛా వాణిజ్యం చేస్తున్న కార్పొరేట్ వర్గానికి మాత్రమే. ప్రజలు కనీస హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి ఎంతో దూరంలో లేదు.

కేశవ్

ఆర్థిక, సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story