- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏక పార్టీ పాలనకే జమిలి ఎన్నికలు
జమిలి ఎన్నికలు (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చి 15వ తారీఖున ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసిన 18626 పేజీల నివేదికలోని ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తే, భవిష్యత్తులో ఒక జాతీయ పార్టీ ఏకస్వామ్య పాలన సాధించడం కొరకేనని ప్రతి బుద్ధి జీవికి అర్ధం అవుతుంది.
2029 సంవత్సరంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ప్యానెల్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ ప్యానెల్ లో సభ్యులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్, గులాంనబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, న్యాయ కోవిదులు హరీష్ సాల్వే, మాజీ సి.వి.సి సంజయ్ కొఠారి ఉన్నారు. రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ 191 రోజులపాటు నిర్విరామంగా నిపుణులు, సంబంధిత భాగస్వాములతో విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపిందని పేర్కొనడం జరిగింది. తమకు 21,558 ప్రతి స్పందనలు రాగా వాటిలో 80 శాతం మంది జమిలి ఎన్నికలు సమర్థించారని కమిటీ తమ నివేదికలో పేర్కొనడం జరిగింది. నివేదిక లోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 2029లో ఎలాగైనా జమిలి ఎన్నికలు సాధించాలానే లక్ష్యంను సాధించే దిశగానే రూపొందించారు అని అర్ధం అవుతుంది.
రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు
జమిలి ఎన్నికలను దేశంలో చాలా రాష్ట్రాలు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాయి. కావున రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యం కనుకనే రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం అమలు కోసం చేపట్టే ఏ రాజ్యాంగ సవరణకూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవలసిన అవసరం లేదని నివేదికలో పేర్కొనడం జరిగింది. జమిలి ఎన్నికల నేపథ్యంలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి నియామవళిని అమల్లోకి తీసుకురావడానికి కేవలం పార్లమెంట్ ఉభయ సభల పదవి కాలంకు సంబంధించిన రాజ్యాంగంలోని 83వ అధికరణను, రాష్ట్రాల శాసనసభల పదవీకాలంకు సంబంధించిన 172వ అధికరణను సవరిస్తే సరిపోతుందని పేర్కొనడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఆ మేరకు చేసే సవరణలకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు దేశ పౌరులకు ఒకే ఓటరు జాబితా, ఒకే గుర్తింపు కార్డు ఉండడానికి రాజ్యాంగంలోని 325వ అధికరణ సవరించాలని పేర్కొంది.
అసెంబ్లీకి ఐదేళ్ల పరిమితి ఉండదు..
లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలుగా రాజ్యాంగంలో "82 ఏ"అధికరణ చేరిస్తే సరిపోతుంది అని పేర్కొనడమైంది. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే తొలి పార్లమెంట్ సమావేశంలోనే 82 ఏను చేర్చేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొన్నారు. అంటే 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదేళ్ల పూర్తి కాలం ఉండదు. సాధారణంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో రాష్ట్రాలలో అదే పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీనే తర్వాత దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరిస్తుంది. ఇది క్రమంగా ఏకస్వామ్య పార్టీ పాలన దిశగా కొనసాగి చివరకు నియంతృత్వ పాలన దిశగా మరే ప్రమాదం ఉంది. అంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది.
అధ్యక్ష తరహా విధానమే...
ఒక జాతీయ పార్టీ ఏకస్వామ్య పాలన సాధించడం వలన ప్రాంతీయ వైవిధ్యాలు తుడిచిపెట్టుకుపోతాయి. పార్టీ ఎజెండాను సులువుగా అమలు చేసి, తమ భావజాలాన్ని దేశం మొత్తం విస్తరింప చేయడం జరుగుతుంది. చివరికి దేశంలో జమిలి ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం విధానం క్రమంగా అంతరించి నియంతృత్వం కూడిన అధ్యక్ష తరహా విధానం అమలులోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కావున దేశ ప్రజలు త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో వేసే ఓటును ప్రజాస్వామ్యంను బ్రతికించటానికి వేయాల్సిన అవసరం ఉంది.
-పల్లె నాగరాజు,
టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,
85004 31793