గాల్లో కలిసిన పాలన.. దుమ్మెత్తిపోయడమే ఎజెండా!

by Ravi |
AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

ప్రభుత్వానికి, పార్టీ కార్యక్రమాలకు మధ్య తేడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెలియకపోవడం రాష్ట్ర ప్రజల ప్రారబ్ధం. అధికారులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉన్న తేడా కూడా తెలిసినట్లు లేదు. అధికారులను కూడా తమ పార్టీ కార్యకర్తలే అనుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది అమరవీరుల సంస్మరణ సభ అయినా కావచ్చు, లేదా స్వాతంత్ర్య దినోత్సవ సభ అయినా కావొచ్చు.. వాహనమిత్ర అమ్మఒడి, ఆసరా.. సభ ఏదైనా అసందర్భ ప్రేలాపనలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. సంతాప సభలకు, సన్మాన సభలకు కూడా తేడా తెలియడం లేదు. ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి పెట్టడం మానేశారు. పూర్తి సమయం ప్రతిపక్షాలపై, మీడియాపై దుమ్మెత్తి పోయడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి నిర్వాకాలను ప్రశ్నించినా, విమర్శించినా తట్టుకోలేక విచక్షణ కోల్పోయి ప్రజాస్వామ్య గొంతుల్ని నులిమేస్తున్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలను, మీడియాను ఉద్దేశించి సంఘవిద్రోహ శక్తులుగా, పరోక్షంగా నక్సలైట్లుగా అభివర్ణించారు. ఎంత మంచిపని చేసినా ప్రతిదానిని వక్రీకరించి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతి సభలోనూ దుష్టచతుష్టయం అని, పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమని, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా, అదేవిధంగా దత్తపుత్రుడంటూ హేళనగా మాట్లాడుతున్నారు.

ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పుతారా?

గతంలో కలెక్టర్ల సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాను, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అమరవీరుల సంస్మరణ సభలో పోలీసులను రెచ్చగొడుతూ మీడియాపైనా, ప్రతిపక్షాలపైనా ఉసిగొల్పుతున్నారు. బెయిల్ రాకపోతే జడ్జీలను ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. గతంలో అమరావతి రాజధాని వ్యవహారంలో తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని హైకోర్టు న్యాయమూర్తులపై మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పెట్టిన అసభ్యకరమైన పోస్ట్‌లు, బూతు పురాణం జగన్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నారు. గతంలో ప్రభుత్వం తరపున తప్పులు జరిగినా, విమర్శలు వచ్చినా కలెక్టర్లు మీడియా ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చుకునేవారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్న విపక్షాలు, మీడియా సంస్థలపై జగన్ రెడ్డి తన ఉక్రోషాన్ని ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్లు తిట్టాలని, పోలీసులు అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలన్నా, అర్హతకు మించి ఆయాచితంగా ప్రమోషన్లు రావాలన్నా తమ పార్టీ నాయకుల తరహాలో అధికారులు కూడా బండ బూతులు తిట్టాలి. అలా తిట్టిన వారికి, కొట్టిన వారికే ప్రమోష్లన్లు, మంత్రి పదవులు లభించాయి. ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని, విషపు రాతలు రాసేవారికి దేవుడే మొట్టికాయలు వేస్తాడని అనేక సభల్లో శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జగన్ రెడ్డి విష కౌగిలిలో ప్రజాస్వామ్యం బందీ అయిందనే విషయం గుర్తించడం లేదు.

ఇప్పటికే ముఖ్యమంత్రి మాట విని కొంతమంది అధికారులు అనేక కేసుల్లో కోర్టు బోనుల్లో జడ్జిల ముందు దోషులుగా నిలబడి పరువు పోగొట్టుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లు మీ పార్టీ నాయకుల తరహాలో కలెక్టర్లు తిట్టాలి, పోలీసులు కొట్టాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నాలుగున్నరేళ్లుగా పత్రికలపై, ప్రతిపక్షాలపై మీ పార్టీ నాయకులు, మంత్రివర్గ సహచరులు తిడుతూ దాడులు చేస్తున్నది చాలదన్నట్లు అధికారులను కూడా సన్నద్ధం చేస్తున్నారు. వారికి ఎలా తిట్టాలో, కొట్టాలో జోగి రమేష్, కొడాలి నాని, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, రోజాలాంటి వాళ్లతో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. సంస్మరణ సభల్లో అమరులైన వారికి నివాళులు అర్పించడం, వారి ఆత్మకు శాంతి కలిగేలా సందేశాలు ఇచ్చి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడం పరిపాటి. కానీ దానికి భిన్నంగా ప్రజానీకం యావగించుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉంటున్నాయి.

మీడియా, మీకు భజన చేయాలా?

ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. నిజాలు మాట్లాడటం ఎప్పుడో మర్చిపోయారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ఎదురుదాడి చేయాలని, కొట్టాలని, తిట్టాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే బహిరంగంగా ప్రోత్సహించడం దేనికి సంకేతం? ఆధారాలు లేకుండా ఒక వార్తకాని, ఒక విమర్శ కాని చేస్తే బతికి బట్టకట్టగలిగే పరిస్థితులు నేడు రాష్ట్రంలో లేవు. జగన్ తనది రాచరికపు పాలన అనుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు. మీడియా, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి భజన చేయాలని కోరుకోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంపై అనేక రూపాల్లో బురదజల్లుతూ విమర్శలు చేశారు. మీ సాక్షి పత్రిక మీకు వంతపాడుతూ, నిరంతరం అసత్యాలను, అర్థసత్యాలను, వండివార్చలేదా? నిజాలకు పాతరవేసి అబద్ధాలను, అభూతకల్పనలను ప్రచారం చేశారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాపై విషం కక్కుతూ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించారు. లోపాలు ఎత్తిచూపినప్పుడు సవరించుకోవడం పరిణితి చెందిన విజ్ఞుల లక్షణం. అందుకు భిన్నంగా మేము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఉన్నది ఉన్నట్లు చూపించడం, రాయడం నేరమా ముఖ్యమంత్రి మెచ్చే విధంగా, నచ్చే విధంగా రాయాలనుకోవడం, చూపాలనుకోవడం అవివేకం అవుతుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిని ప్రజలకు తెలియనీయకుండా దాచాలనుకోవడం సమర్థనీయం కాదు. మీకు నిరంతరం భజనలు చేయడానికి మీడియా మీ గడిలో బానిస కాదు.

ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. విమర్శించినంత మాత్రానా తిట్టడం, కొట్టడం, అణచివేయాలనుకోవడం మూర్ఖుల లక్షణం. ప్రజాస్వామ్యంలో పాలకపక్షాల తప్పిదాలను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి లభించింది. ఆ హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని తమ కబంధ హస్తాల్లో బందీ చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ స్థాయిని దిగజార్చుకుంటూ ముఖ్యమంత్రికి భజన చేయడమేమిటి? అధికారులు ఉన్నది ప్రజలకు సేవచేయడానికే తప్ప.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రుల సేవలో తరించడానికి కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సొంత పార్టీ ఎంపీని సైతం అత్యంత పాశవికంగా కొట్టారు. మాస్క్‌లు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ చనిపోయేలా చేశారు. మద్యం, ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారిని కిరాతకంగా హింసించి చంపేసిన ఘటనలు ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో ప్రతిపక్షాలకు చెందిన 72మంది కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన వారిపై 250కు పైగా అక్రమ కేసులు నమోదు చేసి కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో అక్రమ కేసులు నమోదు చేసి 40 రోజులకు పైగా జైలులో నిర్బంధించారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నించకుండా చేసేందుకు జీవో నెం.2430 తెచ్చారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో జీవో నెం.1 తెచ్చి ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నీతికి, న్యాయానికి చోటివ్వని జగన్ రెడ్డి పాలించే అర్హత కోల్పోయారు. ఇలాంటి దుష్టుల పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. ప్రజలు తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖచిత్రం మారిపోతుంది. త్వరలోనే మంచి రోజులు వస్తాయి.

మన్నవ సుబ్బారావు

99497 77727

Advertisement

Next Story

Most Viewed