- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధితులు వద్దు.. హంతకులే ముద్దు!
ఒకవైపు వరదలతో ప్రజలందరూ అనేక ఇక్కట్లు పడుతూ ఉంటే.. వారి ఇక్కట్లు చూసి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు మనోధైర్యం కల్పించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతోంది. అనేకమంది దాతృత్వ స్ఫూర్తి ప్రదర్శిస్తూ అనేక రూపాల్లో బాధితులకు అండగా నిలిచారు. ఊహించని పెనువిపత్తు రాష్ట్ర ఆర్థిక రాజధాని విజయవాడను అతలాకుతలం చేసింది. వేలాదిమంది నిరాశ్రయులై వరదల్లో బిక్కుబిక్కుమంటూ పది రోజుల పాటు గడిపారు. ఇంకా విపత్తు నుంచి పూర్తిగా ఉపశమనం లభించకముందే బాధితుల ఆర్తనాదాలు, గోడును పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారు.
ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. తనకు సెక్యూరిటీ పెంచాలని, తమ నాయకులకు రక్షణ కల్పించాలని ఢిల్లీలో ఆందోళన చేశారు. అదేదో రాష్ట్రానికి నిధులు కావాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే బాగుండేది. కానీ తనకు ప్రతిపక్ష హోదా కావాలని, పాస్‌పోర్టు కావాలని, విదేశీ పర్యటనకు అనుమతించాలనే అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, ఉద్యమాలు చేపడుతున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క ప్రజా ఉద్యమం కూడా చేపట్టలేదు. అధికారంలో వున్నంతకాలం జగన్ తన విధ్వంస కార్యకలాపాలను నిర్వహించడానికే ఎమ్మెల్యేలు, ఎంపీలను వినియోగించారు. వాళ్ళను వీధి రౌడీలకంటే కింద స్థాయికి దిగజార్చారు. తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడటానికి, దాడులు చేయడానికి ఉపయోగించారు. విజయవాడకు వరదలు పోటెత్తి ప్రజలు ఇబ్బందులు పడితే.. రెండు రోజులు కూడా ప్రజల కష్టాల గురించి పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి సేదతీరారు.
జైళ్లలో ఉన్న నేతలకు పరామర్శలా?
నందిగం సురేష్ ఏదో స్వాతంత్ర్య సమరయోదుడైనట్లు జగన్ పరామర్శకు రావడం దారుణం. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో అతను నిందితుడు. అతనిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి జైలుకు వెళ్లారు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వందమందికి పైగా చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు జగన్ వాళ్లకు ఎలాంటి సాయం అందివ్వలేదు. వారి కష్టాలను పట్టించుకోలేదు. ఇప్పుడు విజయవాడలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారిని కూడా గాలికి వదిలేశారు. వరద బాధితులకు ఒక్క రూపాయి సాయం చేయకపోగా.. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను ఆయన పరామర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి వారికే పదోన్నతులు కల్పించారు. జోగి రమేష్‌కు మంత్రి పదవి దక్కడానికి, నందిగం సురేష్‌కు పార్లమెంట్ సీటు దక్కడానికి, మాచర్లలో తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ కావడానికి వారి వారి అర్హతలు హింసా ప్రవృత్తి, నేరమయ జీవితమే కారణం.
వరద బాధితులు కనిపించలేదా?
75 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రి చంద్ర బాబు, మంత్రులు, అధికారులు, ప్రభుత్వ యావత్ యంత్రాంగం బాధితులకు అండగా నిలిచింది. పదిరోజుల పాటు చంద్రబాబు ఇల్లు వదిలి బస్సులోనే ఉంటూ కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. పగ లు, రాత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపారు. అలుపెరుగకుండా ఆయన పరిగెత్తుతూ అందరినీ పరిగెత్తించారు. ఆయన నిద్రపోలేదు, ఎవరినీ నిద్రపోనివ్వలేదు. ఎప్పుడు ఎక్కడ విపత్తు సంభవించినా ఆయనే ముందుంటూ వచ్చారు. హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖలోనే మకాం వేసి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఒక సమస్య ముగిసేలోగా మరో సమస్య చుట్టుముడుతోంది. అయినా ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ఎక్కడా ఆత్మస్థైర్యం సడలకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష కుట్రలను ఛేదిస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యత వహించి, ఎవరికి వారు తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. కానీ జగన్ రెడ్డిలో అది ఏ మాత్రం కనిపించడం లేదు. ఆయనకు వరద బాధితులు మాత్రం కనిపించడంలేదు.
బురద జల్లేందుకే సమయమంతా...
2002లో హత్య కేసులో అరెస్టై కర్నూలు జైలులో ఉన్న గౌరు వెంకటరెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలవడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. సంఘవిద్రోహ శక్తులను కలవడానికి ఆసక్తి చూపుతూ.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారు. విపత్తుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కంటే.. ప్రజలను చంపేందుకు కుట్ర చేస్తున్న వారిని పరామర్శించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, బురద జల్లేందుకు తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పట్ల జగన్ రెడ్డికి ఉన్న సంకుచిత స్వభావం, లెక్కలేనితనం, చిన్నచూపును అందరూ గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు. కుట్రలు, కుతంత్రాలు, అసత్యాలు, అర్థసత్యాలను సోషల్ మీడియాలో, తన సొంత మీడియాలో ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డిని ఏవీ కాపాడలేవు. ప్రజలే అంతిమ నిర్ణేతలని గుర్తించాలి.
- మన్నవ సుబ్బారావు
99497 77727