అదానీ గ్రూపుతో సెబీ చీఫ్ కుమ్మక్కయ్యారా?

by Ravi |
అదానీ గ్రూపుతో సెబీ చీఫ్ కుమ్మక్కయ్యారా?
X

18 నెలల క్రితం అదానీ గ్రూపు ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన హిండెన్‌బర్గ్ కంపెనీ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్' లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబును పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చైర్ పర్సన్ 'మాధవి పురి బుచ్' తో పాటు ఆమె భర్త 'దవల్ బుచ్'కు రహస్య వాటాలు ఉన్నాయని అందుకే అదానీ వ్యాపార లొసుగులు, చట్ట వ్యతిరేక లావాదేవీలు వెలుగు చూడటం లేదని హిండెన్ బర్గ్ శనివారం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ తీవ్రంగా ఆరోపించింది.

విజిల్ బ్లోయర్’ అందించిన పత్రాల ఆధారంగా సెబీ చీఫ్‌పై ఈ ఆరోపణలు గుప్పించింది. బుచ్ దంపతులు 'ఐపీఈ ప్లస్ ఫండ్ -1'లో ఖాతాలను 2015 జూన్ 5న సింగపూర్‌లో తెరిచారని, ఈ 'ఆఫ్ షోర్ మారిషస్ ఫండ్'ను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ 'ఇండియా ..ఇన్ఫోలైన్(ఐఐఎఫ్ఎల్)' ద్వారా అక్రమంగా తెరిచారని విజిల్ బ్లోయర్ పత్రాలను అనుసరించి తెలుస్తున్నదని హిండెన్‌ బర్గ్ పేర్కొంది. అయితే, మాధవి పురి బుచ్ సెబీలో చేరక ముందు జరిగిన విషయమిది. ఆమె 2017లో సెబీలో పర్మినెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2022 మార్చిలో సెబీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.

అక్రమ నిధుల మళ్లింపు కుంభకోణంతో..

ఐఐఎఫ్ఎల్ ప్రిన్సిపల్ సంతకం చేసిన డెక్లరేషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం.. విదేశీ ఫండ్లలో వీరి పెట్టుబడి జీతం ద్వారా సమకూరిందని పేర్కొనగా.. దంపతుల మొత్తం ఆస్తి కోటి డాలర్లు ( సుమారు 84 కోట్లు)గా ఉండవచ్చని అంచనా వేసింది. సెబీ చైర్ పర్సన్‌గా తన నియంత్రణ పరిధిలోకి వచ్చే వేలాది మ్యూచువల్ ఫండ్లు ఉండగా... తాను, తన భర్త మాత్రం అతి తక్కువ ఆస్తులతో కూడిన హై రిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటైనా, అదానీ అక్రమ నిధుల మళ్లింపు కుంభకోణంతో సంబంధాలు ఉన్న మల్టీ లేయర్డ్ విదేశీ ఫండ్లలో పెట్టుబడి.. పెట్టారని కొన్ని పత్రాలు తెలుపుతున్నాయంది. ఈ షెల్ కంపెనీల ద్వారానే వినోద్ అదానీ నిధులను మళ్లించి అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించినట్లు హిండెన్ బర్గ్ గతంలోనే ఆరోపించింది. కాగా, హిండెన్‌బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై సెబీ డైరెక్టర్ మాధవీ పురి బుచ్ ఆలస్యంగా స్పందించింది. తమకు అదానీ గ్రూప్ అక్రమాలతో సంబంధం లేదని తెలిపింది. అదానీ కూడా ఇదే విషయాన్ని బలపరిచాడు.

చీఫ్‌పై విచారణ చేయరా?

అదానీ అక్రమాలపై తమ నివేదిక విడుదల చేసి 18 నెలలు అవుతున్నప్పటికీ, అదానీ కంపెనీలకు ఇతర షెల్ కంపెనీలకు ఉన్న అక్రమ లావాదేవీలను అదానీ బహిర్గతం చేయలేదని.. మారిషస్, ఇతర విదేశీ షెల్ కంపెనీలపై చర్యలు చేపట్టేందుకు సెబీ ఎందుకు విచారణను జాప్యం చేస్తోంది? సెబీ ఈ విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం విస్మయం కలిగించిందని హిండెన్ బర్గ్ తన బ్లాగ్‌లో అభిప్రాయపడింది. అదానీ 'ఆఫ్ షోర్ ఫండ్లకు' ఎవరు నిధులు సమకూర్చారనే విషయాన్ని సెబీ తన దర్యాప్తు పత్రాల్లో ఖాళీగా ఉంచిందన్న సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒకవేళ ఈ విదేశీ ఫండ్ హోల్డర్లను గుర్తించాలనుకుంటే సెబీ చైర్ పర్సన్‌ మీదనే విచారణ చేయాలి. కానీ తమ చీఫ్ గుట్టు విప్పే దర్యాప్తు జరిపేందుకు సెబీ ఇష్టపడకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని హిండెన్ బర్గ్ పేర్కొంది. అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతూ ఉండడంతో పాటు అనుచిత పద్ధతుల్లో గ్రూపు కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటూ వస్తోందని 2023 జనవరి 24న విడుదల చేసిన నివేదికలో హిండెన్ బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో అదానీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీతో పాటు చిన్న మదుపరులు భారీగా నష్టపోయారు. హిండెన్ బర్గ్ నివేదికలో స్టాక్ మార్కెట్‌తో పాటు కార్పొరేట్ రంగం భారీ కుదుపునకు లోనైంది. ఈ విషయంలో దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించడంతో పాటు గత ఏడాది మార్చి 2న సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని..

ఈ నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్‌పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాక ఈ స్కాంను సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నిర్ధిష్ట ఆరోపణలు చేసినప్పుడు.. సుప్రీంకోర్టు స్వయంగా తన పర్యవేక్షణలో అదానీ గ్రూప్ కార్యకలాపాలపై నేరుగా విచారణ జరపకుండా "దొంగ చేతికి తాళాలు అప్పగించినట్లు" సెబీని విచారణ సంస్థగా దర్యాప్తు చేయమంది. ఇప్పుడు సాక్షాత్తు సెబీ చీఫ్ పైనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు వేగంగా జరపాలని మిగతా విపక్షాలు కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఆమె డైరెక్టర్ పదవి నుండి తప్పుకొని విచారణకు సహకరించాలని విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.

డా.కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story

Most Viewed