యూపీఐ లావాదేవీలపై చార్జీలు నిజమేనా?ఆర్బీఐ ఏం తేల్చనుంది?

by Ravi |   ( Updated:2022-08-26 18:45:54.0  )
యూపీఐ లావాదేవీలపై చార్జీలు నిజమేనా?ఆర్బీఐ ఏం తేల్చనుంది?
X

యూపీఐపై చార్జీల వడ్డన పడితే మరలా ప్రజలు నగదు వైపు మరలడం ఖాయమని కొందరు, కాదు లావాదేవీల సౌలభ్యతకు అలవాటు పడ్డకా నగదుకు మారడం సాధ్యం కాదని మరి కొందరు చెబుతున్నారు. ప్రజలు అలవాటు పడ్డాక చార్జీల వడ్డనకు సిద్ధమయ్యారని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఎండీఆర్ తప్పనిసరి అయితే వ్యాపారి చెల్లించేలా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎండీఆర్‌పై ఆర్‌బీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, కేవలం ఫార్మాలిటీ కోసమే ప్రజల అభిప్రాయం కోరుతోందని, తప్పకుండా చార్జీల వడ్డన ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

2016లో డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నగదు చెలామణి తగ్గి డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ఎంతగా ప్రోత్సహించినా నిరక్షరాస్యత, అందరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో డిజిటల్ చెల్లింపుల వేగం సాధ్యం కాదని భావించారు. కానీ, అనూహ్యంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి. ఇందుకు కారణం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తీసుకువచ్చిన మొబైల్ ఫ్లాట్ ఫామ్.

దీని ద్వారా ఒకరి నుంచి మరొకరికి, ఒకరి నుంచి వ్యాపార సంస్థకూ నగదు చెల్లింపులు సెకన్‌లలో అయిపోయే అవకాశం కలిగింది. దీంతో మొబైల్ యాప్ ద్వారా పనిచేసే యూపీఐ డిజిటల్ చెల్లింపుల కోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ ఫ్లాట్ ఫామ్‌లు పుట్టుకొచ్చాయి. సురక్షిత చెల్లింపులకు అవకాశం ఏర్పడింది. నగదు కోసం ఏటీఎంల మీద ఆధారపడే ప్రజలు యూపీఐ చెల్లింపులు ఉచితంగా ఉండటంతో వాటిని విరివిగా వాడుకున్నారు.

ఐదొందల శాతం పెరిగి

నేడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నగదు చెల్లింపులకు బదులు యూపీఐ లావాదేవీలపైనే అధికంగా ఆధారపడుతున్నారు. కోవిడ్ సమయంలో ఈ చెల్లింపులు జోరందుకున్నాయి. పెద్ద వ్యాపార సంస్థల నుండి ఫుట్ పాత్ వ్యాపారస్తుల వరకు అందరూ ఈ లావాదేవీలకు ఉత్సాహం చూపుతున్నారు. ఇవి నేడు పట్టణాలు నగరాలకే కాదు, గ్రామీణ స్థాయికి సైతం విస్తరించుకుపోయాయి. క్రమేపీ భారీ డిటిజల్ ఎకనామీకి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి సాంకేతికత అభివృద్ధి కోసం ఎన్నో స్టార్టప్ కంపెనీలు అవతరించాయి. ఆయా రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం ప్రతి నెలా దాదాపు రూ.122 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు తేలింది.2016 తో పోల్చితే ప్రస్తుతం 550 శాతం పెరిగాయి.

2016-17లో 1,004 కోట్లు, 2020-2021 లో 5,554 కోట్లుగా లావాదేవీలు జరిగాయి. రోజూ సగటున రూ.21 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో రూ. 200 లోపు విలువ గలవి 50 శాతం మేర ఉంటున్నాయి. తక్కువ విలువగల లావాదేవీలలో నగదు వాడకాన్ని తగ్గించడమే యూపీఐ లక్ష్యాలలో ఒకటి. అది సఫలీకృతం అయింది. కనిష్ట విలువల లావాదేవీలు అధికంగా వాడుకోవడంతో సిస్టమ్ ఓవర్ లోడ్ కారణంగా చెల్లింపులు విఫలమవుతున్నాయి. దీంతో సమర్థవంత చెల్లింపు వ్యవస్థ కొనసాగించడానికి, వినియోగదారులకు సముచిత ఖర్చు, ఆపరేటర్లకు తగిన రాబడిని నిర్ధారించడానికి లావాదేవీలపై చార్జీలు విధించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

ఎండీఆర్ విధించాలని

యూపీఐ లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేటు' (ఎండీఆర్)ను విధించాలని ఆయా ప్లాట్‌ఫామ్‌లు ఎప్పటినుంచో ఆర్‌బీ‌ఐని కోరుతున్నాయి. ఎండీఆర్ అంటే, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై విధించే రుసుమును బ్యాంకు, కార్డు కంపెనీ రెండు కలిసి పంచుకుంటాయి. అయితే, డెబిట్ కార్డులు, రూపే కార్డులు, యూపీఐ ద్వారా నిర్వహించే లావాదేవీలపై ఈ రుసుము విధించడం లేదు. కానీ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి ఎండీఆర్ విధించాలని, తద్వారా తమకు ఆదాయం సమకూరి మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తామని అంటున్నాయి. ఈ ప్రతిపాదన మొదటిసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి వచ్చింది. దీంతో ఆర్‌బీఐ దీనికి సంబంధించి అభిప్రాయం కోరుతూ ఆగస్టు 17 న చర్చా పత్రాన్ని విడుదల చేసింది. అక్టోబర్ మూడవ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది.

లావాదేవీలపై చార్జీలు విధించడం ప్రత్యామ్నాయం అవుతుందా? నిర్ధారిస్తే లావాదేవి శాతంగా ఉండాలా లేదా స్థిరమొత్తానికి ఉండాలా? అని ప్రశ్నించింది. ఇందులో (యూపీఐ)తో పాటు ఇమ్మిడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌), డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ప్రిపెయిడ్‌ పేమెంట్‌ ఇనుస్ట్రుమెంట్స్‌ (పీపీఐలు) వంటి వివిధ చెల్లింపు సాధనాల చార్జీలకు సంబంధించి కూడా అన్ని అంశాలనూ ఈ చర్చా పత్రంలో పొందుపర్చారు.యూపీఐపై చార్జీల వడ్డన పడితే మరలా ప్రజలు నగదు వైపు మరలడం ఖాయమని కొందరు, కాదు లావాదేవీల సౌలభ్యతకు అలవాటు పడ్డకా నగదుకు మారడం సాధ్యం కాదని మరి కొందరు చెబుతున్నారు. ప్రజలు అలవాటు పడ్డాక చార్జీల వడ్డనకు సిద్ధమయ్యారని ఇంకొందరు విమర్శిస్తున్నారు.

ఎండీఆర్ తప్పనిసరి అయితే వ్యాపారి చెల్లించేలా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎండీఆర్‌పై ఆర్‌బీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, కేవలం ఫార్మాలిటీ కోసమే ప్రజల అభిప్రాయం కోరుతోందని, తప్పకుండా చార్జీల వడ్డన ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 'డిజిటల్ చెల్లింపులపై పన్ను విధించడానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం సుముఖంగా లేదంటున్నారు. మరి అక్టోబర్ మూడున ఆర్‌బీ‌ఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

రుద్రరాజు శ్రీనివాసరాజు

లెక్చరర్. ఐ.పోలవరం

94412 39578

Advertisement

Next Story

Most Viewed