భూ సేకరణా, తస్కరణా..?

by Ravi |   ( Updated:2025-01-18 01:15:22.0  )
భూ సేకరణా, తస్కరణా..?
X

మన ప్రపంచంలో అందరికంటే రైతులకు భూమిపై మమకారం చాలా చాలా ఎక్కువ. ఎంతగా అంటే గుంట భూమి ఉన్నా దాన్ని పట్టుకొని పాకులాడే మనస్తత్వం రైతుది. దాన్ని అమ్ముకొని బతకాలని ఏనాడూ అనుకోడు. పంట పండకపోయినా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు అయినా పడుతుందేమోనని చెమటోడుస్తూనే ఉంటడు. రైతుకు పుట్టుక నుంచి చావు వరకు అన్ని బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు బంధుత్వాలు భూమితోనే పెన వేసుకొని ఉంటాయి.. భూమితో సంభాషించి, లాలించి, గౌరవించి, ఒప్పించి, తనకు కావాల్సిన మరో పచ్చని జీవరాశికి ప్రాణం పోసే ఒకే ఒక్కడు రైతు.. అలాంటి రైతు నుండి భూమిని తీసుకుంటే, కాదు కాదు వేరు చేయడం అంటే భూసేకరణ నోటిఫికేషన్ కాగితం ఇచ్చినంత ఈజీ కాదు..

అప్పటి వరకూ తాము తాత తండ్రుల కాలం నుండి చెమటోడ్చి కాపాడుకుంటూ వచ్చిన నేల తల్లిని, వారికి మాట మాత్రమైనా చెప్పకుండా ఎక్కడో కూర్చొని మేం నిర్ణయం తీసుకున్నాం, అంతో ఇంతో పడేస్తం అంటే రైతులు నమ్ముతా రా? భూ దొంగతనమే అనుకుంటరు, తిరగబడతరు.. తన నుండి భూమిని లాగేసుకుంటున్నారు అని విలవిలలాడిపోతోంది రైతు ప్రాణం. ఏదో భవిష్యత్ తరాల తలరాత మార్చడం కోసమే తీసుకుంటోందని ఏ రైతూ అనుకోడు. వారు దీన్ని భూ సేకరణే కాదు భూ తస్కరణగానే చూస్తారు. తమ కళ్ల ముందే తమ భూమిని ఎవరో దొంగిలించుకొని పోతున్నట్టు ఫీలవుతారు. దీనికి కారణం ఎన్నో ఏళ్లుగా భూ సేకరణ పేరిట అధికారికంగా జరుగుతున్న తంతు ఇలానే ఉంది.

అన్యాయానికి పరాకాష్ట 'పునరావాసం'

గతంలో చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఎలా ఉందో వారికి తెలియదా..? శ్రీశైలం, నాగార్జున సాగర్ పులిచింతల, శ్రీరాం‌ సాగర్, మానేరు, హైటెక్ సిటీ పక్కన సేకరించిన భూములు, ఔటర్ రింగు రోడ్డు, ఎం.ఆర్ ప్రాపర్టీస్, గోల్ఫ్ కోర్టులు, రహేజా, సింగపూర్ టౌన్ షిప్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, శిల్పారామం, ఈ మధ్య నిర్మించిన కాళేశ్వరం, ఫార్మా సిటీ, ఇంకా ఈ రాష్ట్రంలో భూ నిర్వాసిత రైతుల బాధలు వర్ణనాతీతం.. శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన వారికి దశాబ్దాలైనా పునరావాసం అందలేదు. వారి వారసులు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వాలని సెక్రటేరియట్‌కు అడపా దడపా చుట్టూ తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఎదురుగా ప్రస్తుతం శిల్పారామం ఉన్న ప్రదేశం సామాన్య రైతులది. వారి నుండి భూమి తీసుకున్న ప్రభుత్వం వారికి కొండాపూర్‌లో మరో చోట భూమి ఇస్తే ఆ భూమి ఎవరో కబ్జా చేశారు. మూడు దశాబ్దాలుగా ఆ భూమి మాదేనని కొట్లాడుతున్నారు. అందులో కొంత మంది చనిపోయారు కూడా. వారి వారసులు కూలీ పనులు చేసుకుంటున్నారు. నమ్మకం వీడని కొందరు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హైటెక్ సిటీ కేంద్రంగా జరిగిన అభివృద్ధి ఫలాలు ఆ రైతు కుటుంబాల దరిదాపులకు కూడా చేరలేదు. పైగా దిక్కూ దివానం లేని వారిగా చేసింది.

లేబర్ వాడలుగా పాత ఊర్లు..

పోనీ కనీసం సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే పర్వాలేదులే అది కొద్ది మంది రైతులు నష్టపోయినా చుట్టూ ఉన్న కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కదా అనుకోవచ్చు.. దీని వల్ల పంటలు పండుతాయి. ఇది రైతులకు సామాన్య మధ్య తరగతికి మేలు చేస్తుంది అని భావిస్తాం. నీటి ప్రాజెక్టులను చిత్తశుద్ధితో కాకుం డా అందులో నిక్షిప్తమై ఉన్న కాంట్రాక్టులు, అవి నీతి డబ్బు కోసం చేపట్టడం మరో విషయం. ఇక పరిశ్రమల కోసం చేపట్టే భూసేకరణ వల్ల వచ్చే లాభాల్లో భూములు కోల్పోయిన రైతులకు దక్కే వాటా శూన్యమనే చెప్పాలి. చాలా చాలా తక్కువ భాగం మాత్రమే ఆ భూములు కోల్పోయిన పల్లెల ప్రజలకు లాభం కలుగుతోంది.. పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత ఒకరిద్దరు మినహా మిగిలిన రైతులు కూడా కొద్దిగా భూమి ధరలు పెరగ్గానే అమ్మేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత చూస్తే డబ్బులన్నీ ఖర్చయి పోయి మళ్లీ పేద, మధ్య తరగతిగానే మిగిలిపోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధితో విపరీతంగా పెరిగిన జనాభాతో తమ ఊరిలోనే పరాయి వాళ్లుగా జీవిస్తున్నారు. తమ ఊరి చుట్టూ ఉన్న తమ పొలాల్లో వెలసిన కాంక్రీట్ భవనాల మధ్య పచ్చని పాత ఊరు ఒక లేబర్ వాడగా మారిపోతున్నాయి.

రైతుల ఆవేదనలోంచే ఉద్యమాలు..

హైదరాబాద్ చుట్టూ తిరిగితే వందల గ్రామాలు ఇలాంటివి కనిపిస్తాయి. చుట్టూ హై క్లాస్ గేటెడ్ కమ్యూనిటీలు కాలనీలు.. భారీ భవంతులు, వాటి మధ్య బిక్కు బిక్కుమంటూ ఉన్న చిన్న పెద్ద గ్రామాలు దర్శనమిస్తాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారి తమ ఉనికిని కోల్పోయి ఉంటాయి. తెలంగాణాలోనే కాదు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మేధా పాట్కర్ ఆధ్వర్యంలో సాగిన నర్మదా బచావో ఆందోళన, బెంగాల్‌లో మమతా బెనర్జీ నడిపిన సింగూర్ నానో కార్ల ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమమైనా, ఒడిశాలోని నియమగిరి కొండల్లోని వేదాంత గ్రూప్ బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమం అయినా రైతుల ఆవేదనలో నుండి పుట్టినవే. ఎక్కడి ఉదాహరణలో ఎందుకు? ఈ గడ్డ మీదే రైతులు బరిసెలు, తుపాకులు చేతబట్టి నిజాంను, భూస్వాములను ఎదిరించింది భూమి కోసం, భుక్తి కోసమే కదా. ఇక్కడే కదా కమ్యూనిస్టులకు, నక్సల్స్‌కు దున్నేవాడిదే భూమి నినాదమై నిలిచింది.. పొడుస్తున్న పొద్దు మీద పాటలో మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా అని గద్దరన్న గర్జన తెలియని తెలంగాణ బిడ్డ ఉందా..?

సమిష్టి భూ సేకరణ పద్ధతి..

ప్రత్యామ్నాయంగా సమిష్టి భూ సేకరణ పద్ధతిని అవలంభించాలి. ఈ పద్ధతిలో ముందుగా కొత్తగా నిర్మించబోయే పరిశ్రమ లేదా సాగునీటి ప్రాజెక్టుల వల్ల చుట్టూ ఎంత మేరకు లబ్ధి ప్రభావం ఉంటుందో గుర్తించాలి. ఆ పరిధి మేరకు భూములన్నీ నోటిఫై చేయాలి. పరిశ్రమకు ఎంత అవసరమైన భూమిలో ప్రతీ రైతు భూమిలో దామాషా ప్రకారం తీసుకోవాలి. ఉదాహరణకు ఒక పరిశ్రమ లేదా సాగునీటి ప్రాజెక్టు కోసం ఒక వెయ్యి ఎకరాలు అవసరం అనుకుందాం. అప్పు డు ఒక అయిదు రెట్ల భూమి అంటే చుట్టూ ఉన్న అయిదు వేల ఎకరాలు నోటిఫై చేయాలి. ఆ వెయ్యి ఎకరాల నష్టాన్ని సమపాళ్లలో ఒక దామా షా ప్రకారం ఒక ఎకరం ప్రాతిపదికగా పంచాలి.. అప్పుడు కొంత మందే మొత్తం భూమి కోల్పో కుండా, సేకరణలో తలా కొంత భూమి కోల్పో తారు.. అప్పుడు నష్టాన్ని, అందువల్ల వచ్చే పరి హారం అందరికీ అందుతుంది. ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత భూమి మిగులుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆ పరిశ్రమ లేదా సాగునీటి ప్రాజెక్టు వల్ల వచ్చే లబ్ధిని అందరూ సమానంగా అనుభవిస్తారు. ఈ పద్ధతిలో రైతులకు అర్థమయ్యే విధంగా వివరిస్తే నూటికి నూరు శాతం రైతులు ఈ రక మైన సమిష్టి భూ సేకరణకు అంగీకరించే అవకాశాలు ఉంటాయి.

కార్పొరేట్ వ్యవసాయం మనకి నష్టమే!

రాను రానూ రైతుల వ్యవసాయం తగ్గి కార్పొరేట్ వ్యవసాయం పెరిగిపోతున్నది. కొంతమంది చేతు ల్లోకి భూమి చేరితే, అది ఏ రకంగానూ సమాజ అభివృద్ధికి ఉపయోగకరం కాదు. జనాభా తక్కువగా ఉన్న దేశాల్లో అది లాభమేమో కానీ, 65% వ్యవసాయంపై ఆధారపడిన మన లాంటి దేశాల్లో జనసమూహానికి తీరని నష్టం కలిగిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు దాపురించకుండా, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భూసేకరణ విధానాలు, చట్టాలు రూపొందించాలి. అవే పాలకుల ప్రతిష్టను పెంచుతాయన్న విషయం గమనించాలి.

బి. జయసారధి రెడ్డి

సీనియర్ జర్నలిస్టు

79893 35373

Next Story

Most Viewed