- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజకులను దళితులలో కలపమనడం న్యాయబద్ధమేనా?
తెలంగాణ రాష్ట్రంలో రజకులు గత కొన్ని సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాల జాబితాలో తమను విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలలో కూడా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ జరగక మునుపే షెడ్యూల్డ్ కులాల జాబితాలో తమ కులాన్ని విలీనం చేయాలని ప్రభుత్వంపై రజకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రజకులు అలా కోరుకోవడంలో చట్టబద్ధత ఉందేమో కానీ అది న్యాయబద్ధమైన డిమాండ్ కాదు. రజకులు వారి కులాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో కలపాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ వారు షెడ్యూల్డ్ కులాల చరిత్రను, వారికి కల్పించిన రిజర్వేషన్ల ప్రాతిపదికను అధ్యయనం చేయకపోవడం పెద్ద పొరపాటు.
మన సమాజంలో స్వాతంత్య్రం అనంతరం మాత్రమే దళిత కులాలను షెడ్యూల్డ్ కులాలు అని పిలుస్తున్నారు. కానీ స్వాతంత్య్రానికి పూర్వం వారిని "అంటరాని కులాలు, ముట్టరాని కులాలు"గా వివక్ష చూపిస్తూ ఊరికి దూరంగా ఉంచేవారు. భారతదేశ బ్రాహ్మణీయ సంస్కృతి ఆచారాల మంటల్లో మాడి మసైపోయిన వారే "మాల మాదిగ"లు. ఆఫ్రికా నీగ్రో నల్లజాతి బానిసల కంటే నీచమైన బతుకులు ఇక్కడి షెడ్యూల్డ్ కులాల ప్రజల బతుకులు. మహారాష్ట్ర పీష్వా రాజుల పరిపాలనా కాలంలో మాల మాదిగ కులాల ప్రజలు నడవడానికి ఖాళీ బాటలను ఉపయోగించుకోనివ్వలేదు అక్కడి పీష్వా బ్రాహ్మణ సంస్కృతి. ప్రకృతి మానవులకు ప్రసాదించిన ఏ వనరులను కూడా ఇక్కడి దళితులు ఉపయోగించుకోనివ్వలేదు. పైగా పశువులు నీళ్లు తాగే చెరువులో కూడా దళితులకు ప్రవేశం లేకుండా చేశారు. ఇదంతా ఓ భయానకమైన సామాజిక వివక్ష.
సామాజిక వివక్షే రిజర్వేషన్లకు మూలం
దళితులకు సామాజిక వివక్షతో పాటుగా తరతరాల ఆర్థిక వివక్ష కూడా ఉంది. గతంలో వెనుకబడిన కులాలలో(బీసీ కులాలలో) ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉన్నది కానీ షెడ్యూల్డ్ కులాల మాదిరిగా సామాజిక వెనకబాటుతనం లేదు. భారతదేశం ఏర్పడిన కొత్తలో ఈ దేశంలో ఎవరిని షెడ్యూల్డ్ కులాలలో కలపాలనే చర్చ వచ్చినప్పుడు ఆర్థిక వెనుకబాటుతనంతో పాటుగా తరతరాలుగా సామాజిక వెనుకబాటుతనాన్ని అనుభవించిన ప్రజలను షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలని అంగీకారానికి వచ్చి, సామాజిక వెనుకబాటుతనాన్ని అనుభవించిన ప్రజలను షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారు.
రజకులు దేన్ని ప్రశ్నించాలంటే...!
రజకులకే కాదు ఈ దేశంలో ఏ వెనుకబడిన కులం పట్ల కూడా సామాజిక వివక్ష లేదు. కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉన్నది. షెడ్యూల్డ్ కులాల జాబితాలో రజకులను కలుపాలని కోరుకునే రజకులు గ్రామంలో సబ్బండ బీసీ కులాల "మురికి" బట్టలు ఉతికారు తప్ప, "మాల, మాదిగల" బట్టలు ఉతికారా? మాల మాదిగల ఇండ్లలోకి ప్రవేశించారా? తెలంగాణ సమాజ రజక సోదరులు అడగవలసిన ప్రశ్న! వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో కలపమని కాదు.. ఈ దేశంలో రిజర్వేషన్ల పద్ధతికే వ్యతిరేకంగా పుట్టించిన ఈడబ్ల్యూఎస్ (ఎకనామిక్ వీకర్ సెక్షన్) కోటాను వారు వ్యతిరేకించాలి.
ఐదు శాతం ప్రజలకు..
దీనిని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా అక్రమంగా తీసుకొచ్చింది బీజేపి. ఈ దేశంలో అగ్రకుల పేదల శాతం కేవలం ఐదు శాతం మాత్రమే. కానీ వారికి కల్పించిన రిజర్వేషన్ల శాతం పది శాతం. కాబట్టి రజకులు ఈడబ్ల్యూఎస్ కోటాలో వారిని చేర్చమనడం న్యాయమవుతుంది. కానీ షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చమని డిమాండ్ చేయడం న్యాయబద్ధమైన కోరిక కాదు. అది రాజ్యాంగ సహితమైనది కూడా కాదు.
గుండమల్ల సత్యనారాయణ
89199 98619