- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర అంతా ఆధిపత్య కులాలదేనా ?
కింది వర్గాల చరిత్రను సమాధి చేసి అగ్రవర్ణాల చరితనే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. ఈ కొనసాగింపులో ఉత్పత్తి, సేవా కులాల చరిత్రను , వీరుల గాథలను మటుమాయం చేస్తున్న దుర్మార్గమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉత్పత్తి, సేవా కులాలు సమాజ ఉద్దరణలో ఏమాత్రం పాలు పంచుకోలేదని చరిత్రకు చెదలు పట్టిస్తున్నారు. ఈ పరంపరలో సేవా కులాల వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని ఎవరూ ఏమంత మాట్లాడకపోవడం, గుర్తు చేయకపోవడం బాధాకరం. సమాజంలో చాలామంది బుద్ధిజీవులు, మేధావులు, చరిత్రకారులుగా పిలవబడుతున్న వారు కూడా తమకు కావాల్సిన వాటిని మోస్తున్నారు. ప్రసంగిస్తున్నారు కాని, ఇంకా సమాజంలో అట్టడుగు వర్గాలుగా పిలవబడుతున్న కులాలకు చెందిన సంస్కర్తల గురించి మాట్లాడేందుకు పెదాలు విప్పడం లేదు. కలాలను కదపడం లేదేందుకో.
చరిత్ర కులం కంపుతోనే..
సంత్ గాడ్గే బాబా మహాత్మా ఫూలే తర్వాత అంతటి కీర్తిని గడించాల్సింది. కానీ ఆయన చరిత్ర వెలికి తీయాల్సిన పుస్తకం అయింది. కారణం.. కులం. ఆయన విద్యా వ్యాప్తికి, సమాజ ఉద్దరణకు పాటుపడినా, సేవా కార్యక్రమాలు చేసినా అవన్నీ అంటరానివి అయ్యాయి. ఆయన చరిత్ర కులం కంపుతోనే ఇంకా పాతిపెట్టబడింది. మోదీ స్వచ్చ భారత్ ను వేనోళ్ళ పొగుడుతున్న మేధావులు, రాజకీయ నేతలు.. ఆ నినాదం సృష్టికర్త గాడ్గే బాబా కృషిని ఎక్కడా ప్రస్తావించడం లేదు. కనీసం జయంతి, వర్ధింతికో మననం చేసుకోవడం లేదు. అసలు చరిత్రను నేటి తరానికి అందించాలనే ఆలోచన చేయడం లేదు. సేవా కులాలను తమతో నడవమని చాటింపు వేసే బహుజన ఆధిపత్య కులాలు కూడా గాడ్గే బాబాను విస్తృతం చేయడం లేదు.
గాడ్గే బాబా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అభిమానం చూరగొన్నాడు. మహాత్ముడిని సైతం అబ్బురపరిచాడు. మెప్పించాడు. అయినా ఇదంతా చరిత్ర పొత్తిళ్ళలోనే ఉండిపోయింది. ఆయన తన జీవితాంతం మూఢనమ్మకాల వలన కలిగే అనర్ధాలను స్పష్టంగా వివరించేవాడు. కులం చేసే గాయాలను చెప్పి సామాజిక చింతన కలిగి ఉండాలని చైతన్యం చేసేవాడు.
ఆ చరిత్రను వెలికితీయాలి..
సామాజిక రుగ్మతలను నిరసించి సమాజ ఉద్దరణకు పాటుపడాలని బోధించేవాడు. మహారాష్ట్రలోని నాసిక్, సతారా, పూణే, అమరావతి, ముంబై వంటి ప్రాంతాల్లో స్కూల్స్, వృద్దాశ్రమాలు, వసతి గృహాలు , స్నాన ఘట్టాలు నిర్మించాడు. ముంబై జేజే ఆసుపత్రి వద్ద ధర్మశాల నిర్మించి ఎంతోమంది పేద రోగులకు సహాయంగా నిలిచాడు. మెహర్ బాబాతో కలిసి కుష్టు రోగులకు సేవలు అందించాడు. అమానవీయ సమాజంలో మానవీయతను సమున్నంతగా చాటిన మహా మనిషి సంత్ గాడ్గే బాబా. ఆయన చేసిన కృషి ఫలితంగా అంబేడ్కర్ తన గురువుగా గాడ్గేను ప్రకటించుకున్నారు. కానీ, ఈ విషయాన్ని మేము విశ్వవిద్యాలయం స్థాయికి వచ్చే వరకు ఏ పంతులూ చెప్పలేదు. ఏ మేధావి ఏ వేదికగా స్పష్టంగా ప్రసంగంలో ఒక్క వాక్యంగా మాట్లాడలేదు.
అంబేడ్కర్ గురువుగా ఫూలేను బహుజనులు చాటింపు వేసుకున్నారు. కానీ, అదే స్థాయిలో ప్రచారంలో ఉండాల్సిన గాడ్గే బాబాను తొక్కి పెట్టేశారు. మాకు ఆలస్యంగా పరిచయం చేసిండ్రు. కుల అవమానాలను బలంగా అనుభవించిన దళిత సమాజం కూడా గాడ్గే బాబా కృషిని విస్మరించింది. ఏదీ ఏమైనా, తొక్కిపెట్టిన చరిత్రను వెలికి తీయాల్సిన అవసరమున్నది. ఆధిపత్య కులాల కింద నలిగిన చరిత్రను, చరిత్రకారులను సమాజానికి పరిచయం చేయాల్సిన అనివార్యత ఉన్నది.
ప్రశాంత్ పగిళ్ళ
ఓయూ విద్యార్థి
9581262429