- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యావరణ విధ్వంసక అభివృద్ధి అవసరమా..?
తెలంగాణలో ఇవాళ ప్రధాన రాజకీయ చర్చాంశం మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చగా మారింది. నాలాలపై కట్టడాలు, చెరువుల బఫర్ జోన్లలో, మూసీ గర్భంలో నిర్మించిన కట్టడాల కూల్చి వేత పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది.
నిజానికి అవి అక్రమ కట్టడాలే కావచ్చు. అయితే వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? ఆక్రమించి కట్టిన నిర్మాణాలలో రాజకీయ నాయకుల వాటా ఎంత? బడా పెద్దమనుషుల బాగోతం ఎంత? పేదలు నిర్మించుకున్న గృహాల వాటా ఎంత? ఇవి పరిశీలించాల్సిన కీలకాంశాలు. వీటికి అనుమతులిచ్చి దండుకున్న అధికారులు ఎవరు? వారినుండి రికవరీ చేస్తారా? ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజకీయాలు మంచిది కాదు. నష్టపోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపడం ప్రభుత్వ బాధ్యత. పర్యావరణం విషయంలోనూ ప్రతి ఒక్కరిని చైతన్య పరిచే విధంగా చర్యలు చేపట్టాలి.
రాష్ట్రం మొత్తం ఇదే సమస్య!
దామగుండం రిజర్వు ఫారెస్ట్‌ను నేవీ రీడర్ స్టేషన్‌కు అప్పగించే ప్రయత్నం, చారిత్రాత్మక రాచకొండ గుట్టలు(అటవీ ప్రాంతం) భూములను ఫిలిం సిటీ, ఫార్మాసిటీలకు కేటాయిస్తున్నారు. దీని వలన ఆక్సిజన్ కొరత ఏర్పడడమే కాకుండా హైదరాబాద్ భవితవ్యం అంధకార బంధురం కానున్నది. ఫ్యాక్టరీల, వాహ నాల వ్యర్ధాలు కాల్చడం కారణంగా వెలువడుతున్న కాలుష్యం మహానగరాన్ని ఉక్కిరి, బిక్కిరి చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవసాయ యోగ్యమైన భూములను, ప్రభుత్వ భూములను, కుంటలను, చిట్టడవులను ఆక్రమిస్తున్నది. ఈ సమస్య కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రం మొత్తంగా వివిధ రూపాలలో పర్యావరణ సమస్యలు ఉన్నాయి. భూగర్భ జలాలను విపరీతంగా వినియోగించడం, చెరువుల దురాక్రమణ, వాగులు, వంకలను వ్యర్థ రవాణా దారులుగా మార్చడం, ఫార్మా కంపెనీల కాలుష్యాలను వీటిలోకి విడిచి పెట్టడం, జల వనరుల కాలుష్యానికి ప్రధాన కారణాలు.
భారీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల..
ఖనిజాల వెలికితీత కోసం అడవులను ధ్వంసం చేయడం, రోడ్ల విస్తరణ కోసం చెట్లను నరికి వేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవసాయ యోగ్య భూములను ప్లాట్లుగా మార్చడం, పరిశ్రమల కోసం వందల ఎకరాలను నిరుపయోగంగా మార్చడం, సినిమా స్టూడియోల పేరిట, సెజ్‌ల కోసం భూముల కేటాయింపు, ఫార్మాసిటీలు ఏర్పాటు, భూమిపై కాలు ష్యాన్ని పెంచుతున్నాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అడవి భూములు ముంచి వేయబడుతున్నాయి. ఇలాంటి నిర్మాణాలను కట్టడి చేయాలి. ప్రస్తుత వాతావరణ మార్పుకు కర్బన ఉద్గారాల ప్రభావం 34% ఉన్నట్లు గుర్తించింది. గాలి, నీరు ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కారణంగా భూప్రళయం ఏర్పడే అవకాశం లేకపోలేదు.
అభివృద్ధి వెనుకే విధ్వంసం
బొగ్గు ఓపెన్ కాస్ట్ మైనింగ్ వలన మట్టి గుట్టలుగా ఏర్పడడం, వెలువడుతున్న గాలికాలుష్యం వలన శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. కృష్ణాతీరం వెంట నెలకొల్పిన సిమెంట్ పరిశ్రమల నుండి వెలువడుతున్న దుమ్ము, దూళి వల్ల చుట్టూ ఉన్న భూములలో పంటలు పండడం లేదు. మితి మీరిన ప్లాస్టిక్ వ్యర్ధాలు కాలుష్య కారకమే. గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా వల్ల పర్యావరణం ఘోరంగా దెబ్బతింటున్నది. రిజర్వ్ ఫారెస్ట్ స్థలం అన్య అవసరాలకు కేటాయిస్తే ప్రజలకు ఆక్సిజన్ కొరవడి ఊపిరి తిత్తులు నాశనం అవుతాయి. భారీ జలవనరుల ప్రాజెక్ట్‌ల నిర్మాణం వలన అడవులు ధ్వంసం అవుతాయి. ఖనిజాలను వెలికి తీసేందుకు బహుళజాతి కంపెనీలు చేస్తున్న తవ్వకాల వలన అడవులు అంతమవుతాయి. దేశ మూలవాసుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారనున్నాయి. పర్యావరణ సమస్యతో పాటు నిర్వాసిత సమస్య కూడా పెద్దఎత్తున తలెత్తుతున్నది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఇలాంటి విధ్వంసక అభివృద్ధి పర్యావరణ ధ్వంసానికి హేతువు అవుతుంది.
రాజకీయాలకు అతీతంగా కదలాలి..!
ప్రకృతి వనరుల ధ్వంసం కారణంగా మానవులే కాదు జంతువులు, పశు పక్ష్యాదుల మనుగడ ప్రశ్నార్ధకం కానుంది. అరుదైన పక్షులు, జీవజాలం అంతరించిపోతుంది. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న ఎస్ఆర్‌సీ (stock home resilience center) సంస్థ, 2022 నాటికే భూగోళం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు గుర్తించింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రకృతి ప్రకోపించి భూమండలం అంతర్ధానమైనా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తన కర్తవ్యంగా స్వీకరించాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజకీయాలు మంచిది కాదు. నష్టపోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా చర్యలు చేపట్టాలి. భవిష్యత్ తరాలకోసం రాజకీయాలకు అతీతంగా ప్రజలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఉద్యమంగా కదిలితేనే పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడ, అభివృద్ధి సాధ్యమవుతాయి.
రమణాచారి,
99898 63039