- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడుస్తున్న చరిత్ర:తెలంగాణ పాగాకు బీజేపీ ప్లాన్ ఏంటి?
కాశ్మీర్ ఫైల్స్' మాదిరే 'రజాకార్ ఫైల్స్' సినిమా తీయాలని తెలంగాణ బీజేపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ను బండి సంజయ్ తదితరులు కలిసి చర్చించినట్లు వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ తరఫున రాజ్యసభలో ప్రవేశించిన విజయేంద్రప్రసాద్ రాసే ఫైల్స్ నిండా ఏముంటుందో ఊహించవచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే ఈ సినిమా వస్తోందని వేరే చెప్పక్కరలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మతచిచ్చు రగల్చవద్దని, ఆ సినిమా నిర్మించవద్దని ఇప్పటికే వినతులు మొదలయ్యాయి. వర్తమాన, సార్వజనీన ప్రయోజనాలకోసం గతాన్ని తవ్వుకోవాలి, కళా సృజన ఉండాలి. కానీ, సహనశీల మానవీయతని దెబ్బ తీసే స్వల్పకాలిక ప్రణాళికలకు వాడుకుంటే అది కళాద్రోహమే అవుతుంది.
రచయితలకు, కళాకారులకు సమాజం ఆలోచనలు ఇచ్చినా ఎవరి దృక్పథాలు, విశ్వాసాలు వారికి ఉంటాయి. వాటి ప్రతిఫలన వారి కృత్యాలలో తప్పనిసరిగా గోచరిస్తుంది. సినిమా రంగానికి పెట్టుబడి, వ్యాపారంతో సంబంధాలున్నా కథ, కథనంలో తన కుతి తీర్చుకోవడానికో, ప్రేక్షకుల మెప్పు కోసమో సినిమాలో నిర్మాతలు, దర్శకులు సొంత విశ్వాసాలను చొప్పించడం జరుగుతోంది. వినోద ప్రధాన, కుటుంబ కథ చిత్రాలలోనూ కీలక కథ మలుపులో, ముగింపులో తమ విశ్వాసమే గెలిచినట్లు చూపించి ఆత్మ తృప్తి పొందుతారు.
కథానాయకుడు చావు దెబ్బలు తిని, తక్షణం వైద్యమందినా బతికే ఛాన్సు లేనట్లు పడివుంటే పై నుంచి ఏదో దేవుడి విగ్రహం నుంచి పూవో, పత్రమో ఆయనపై పడగానే కొత్త ఊపుతో లేచి దునుమాడుతాడు. తనపై చేయి వేసినవారిని తుదముట్టిస్తాడు. సన్నివేశం ఎంత అసహజంగా ఉన్నా దైవకృప, అనుగ్రహాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో రెచ్చిపోతారు. అదే దర్శకుడికి కావలసింది కూడా. ఈ చిత్రణ వెనుక ప్రేక్షకుల నమ్మకాల ఉద్దీపన ఉంది.
అలాంటి సినిమాలు ఎక్కువయ్యాయి
ఈ మధ్య కథల కొరతతో దేశవ్యాప్తంగా బయోపిక్‌లు, చారిత్రక సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అవి పేరుకే చారిత్రక చలనచిత్రాలు కానీ, వాటి నిర్మాతలు కథను, సన్నివేశాలను ఇష్టానుసారంగా మార్చి తీస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఇందులోని పాత్రలు, సన్నివేశాలు పూర్తిగా కల్పితమని, ఎవరినీ ఉద్దేశించినవి కావని తెరపై వేస్తారు. సామాన్య ప్రేక్షకులు మాత్రం ఇవే వాస్తవాలని, చరిత్రలో ఇలాగే జరిగిందని నమ్మే అవకాశముంది. రాజకీయ అవసరాల కోసం, దురుద్దేశాల ప్రచారానికి ఈ మధ్య సినిమా వేదికగా మారిపోయింది. బాజీరావ్ మస్తానీ, పద్మావత్, మణికర్ణిక, కేసరి, పానిపట్, తానాజీ తదితర సినిమాలలోని కొన్ని సన్నివేశాలు ప్రజలలో అసహనపూరిత జాతీయవాద సెంటిమెంట్లను పెంచి పోషించే దిశగా ఉంటాయి.
ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని రెండు మతాల మధ్యకు ఉద్దేశ్యపూర్వకంగా లాగుతున్నారు. శివాజీ మతతత్వవాది కాదు, ఎందరో ముస్లింలు ఆయన ఆస్థానంలో, సైన్యంలో పనిచేశారు. అలాంటిది బాజీరావు మస్తానీ సినిమాలో 'హిందూ స్వరాజ్య స్థాపనే శివాజీ మహారాజ్ ధ్యేయం' అని హీరో పాత్ర ద్వారా పలికిస్తారు. నిజానికి 1720-40 మధ్యన మరాఠీ రాజులు తమ రాజ్యస్థాపన, విస్తరణకు ఉపక్రమించారు, అప్పటికి హిందూస్తాన్, ఇండియా అనే పేర్లే లేవు. 'ఒక హిందూ రాజుకు మరో హిందూ రాజు తోడ్పడేందుకు' అనేమాట కూడా బాజీరావు నోట వస్తుంది. గత కాలపు రాజరిక పాలనకు నేటి సామాజిక, రాజకీయ అంశాలతో అతకని పొంతనను జతచేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ సినిమాల మాదిరి కట్టుకథలు ఇప్పుడు చారిత్రికమయ్యాయి. బ్రిటిష్‌వారితో పోరాడిన రాజుల కన్నా ముస్లిం రాజులతో పోరాడిన హిందూ రాజుల కథలను వెతికి తెచ్చి మరీ తీస్తున్నారు.
రాజ్య విస్తరణ కాంక్షే అయినా
14 శతాబ్ద కాలంలో చిన్న చిన్న రాజ్యాలను ఏలిన రాజులు తమ పాలనను, రాజ్య విస్తరణనే లక్ష్యంగా చేసుకున్నారు. బలమైన రాజు పక్కనుండే బలహీనుణ్ణి ఓడించి తన సామ్రాజ్యాన్ని పెంచుకునేవాడు. రాజుల మధ్య సఖ్యత కన్నా వైరమే ఎక్కువగా ఉండేది. దానిని ఆధారంగా చేసుకొని మొఘలులైనా, ఆంగ్లేయులైనా ఇక్కడి రాజ్యాలను సునాయాసంగా దక్కించుకున్నారు. వరుస దండయాత్రలు చేసినవారి వద్ద సైనిక శక్తి, ఆయుధాలు ఎక్కువగా ఉండడంతో వారిపై గెలుపు సాధ్యపడలేదు. ఎదురు తిరిగిన రాజు తన రాజ్యం కోసమే పోరాడాడు తప్ప హిందూ రాజ్య స్థాపన కోసమో, మాతృనేలపై పరాయి పాలనను వ్యతిరేకించో కాదు. ఆ రోజులలో ఆ ఆలోచన కూడా లేదు. గతకాలపు సంఘటనలకు నేటి పరిస్థితులను అన్వయించి సృష్టించిన పాత్రలు, సన్నివేశాలు, సంవాదాలు ఈ సినిమాలలో చూడవచ్చు.
చరిత్రను ముందుంచి వర్తమాన సమాజంలో జాతి మత వైషమ్యాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడమే వాటి నిర్మాణ ఉద్దేశ్యం అనుకోవాలి. చరిత్రలో రాజుల మధ్య యుద్ధాల కారణంగా రక్తపాతమే జరిగింది. గెలిచినవాడు పరమతస్తుడైతే యుద్ధపిపాసి అని ముఖమంతా రక్తాన్ని పూసి క్రూరంగా చిత్రించడం అలవాటైపోయింది. అలా గడిచిన కాలాన్ని ఏకపక్షంగా చూపడం చరిత్రకు ద్రోహమే అవుతుంది. 'పానిపట్' సినిమాలో అబ్దుల్ అలీ పాత్రను క్రూరంగా చూపడాన్ని అఫ్ఘాన్ ఎంబసీ తప్పుపట్టింది. 'పద్మావత్' సినిమాలో కూడా ఎర్రబుగ్గల అర్జున్‌కపూర్‌ను రతన్ సింగ్ పాత్రకు, మొరటుగా కనిపించే రణవీర్ సింగ్‌ను ఖిల్జీ పాత్రకు ఎంపిక చేసి అందులో సైకో లక్షణాలు చొప్పించారు. చరిత్రలో జరిగిన ఇద్దరు రాజుల మధ్య పోరాటంలా కాకుండా కథలో ముందే హీరో విలన్ లను స్థిరపరచాడు దర్శకుడు.
అందుకే ఇలాంటి సినిమాలు
దేశభక్తి, జాతీయత ప్రధానంగా వీటి నిర్మాణం జరుగుతోంది. 'మాతృభూమి రక్షణలో చేసిన ప్రాణత్యాగం చేసిన వీరుల వలె ఇక్కడి రాజులను చిత్రించడం వలన చరిత్రకు హాని జరుగుతోందని' చరిత్రకారిణి రానా సాఫ్వి రాశారు. మణికర్ణిక లో సింధియాని లక్ష్మీబాయి 'దేశద్రోహి' అంటుంది. అప్పటికి ఆ పదప్రయోగమే లేదని చరిత్ర రచయిత మను ఎస్ పిళ్ళై అంటున్నారు. కాంగ్రెస్ పాలనపై విమర్శ లక్ష్యంగా, బీజేపీ చేతిలో దేశం బాగుంటుందనే రీతిలో సినిమాల నిర్మాణం ఇప్పుడు మొదలైంది. మార్చిలో వచ్చిన 'కాశ్మీర్ ఫైల్స్' పూర్తిగా ఏకపక్షంగా సాగిన సినిమా. కాశ్మీర్ పండిత్‌లు ఇల్లు, ముంగిలి వదిలేసి శిబిరాలలో బతుకడానికి ఆనాటి కాంగ్రెస్ పాలన, సామ్యవాద ప్రజా సంఘాలు కారణమన్నట్లు సినిమాలో ఉంది.
బీజేపీని వెనుకేసుకొచ్చిన ఈ సినిమాను అందరూ చూడాలని స్వయంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు వినోదపు పన్నునూ రద్దు చేశాయి. ఆనాటి పాలనతో సంబంధమున్న వారిలో కొందరు ఇప్పటికే బతికి ఉన్నారు. తమ పాత్రలను తప్పుగా చూపారని వారు స్వయంగా చెప్పుకోవలసి వచ్చింది. మనలాంటి దేశంలో సాధారణ పౌరుడి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి సినిమాలు బాగా పనికొస్తాయి. అందుకే మరిన్ని ఇలాంటి సినిమాల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. రాబోయే 'ఎమర్జెన్సీ' సినిమా అందులో ఒకటనుకోవచ్చు. 2017 లో ఇదే అంశంపై 'ఇందు సర్కార్' అనే సినిమా వచ్చింది. ఇందిరాగాంధీలా కనబడుతున్న కంగనా రనౌత్ ఫోజులతో 'ఎమర్జెన్సీ' టీజర్ హడావుడి చేస్తోంది. సినిమా విడుదలకు ముందు తమకు చూపించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి. టీజర్‌తోనే కాంగ్రెస్ బెదిరిపోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. సెన్సారు చిక్కులు ఉండే ప్రసక్తి లేనందున ఇందిర పాత్రను ఎలాగైనా వాడుకోవచ్చు. ఎలాగూ ఇందిర ఎమర్జెన్సీని ఎవరు అంగీకరించరు కాబట్టి వీలైనంతగా కాంగ్రెస్‌ను ఈ సినిమా ద్వారా అప్రతిష్ఠపాలు చేయవచ్చు.
తెలంగాణలో కూడా
కాశ్మీర్ ఫైల్స్' మాదిరే 'రజాకార్ ఫైల్స్' సినిమా తీయాలని తెలంగాణ బీజేపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ను బండి సంజయ్ తదితరులు కలిసి చర్చించినట్లు వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ తరఫున రాజ్యసభలో ప్రవేశించిన విజయేంద్రప్రసాద్ రాసే ఫైల్స్ నిండా ఏముంటుందో ఊహించవచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే ఈ సినిమా వస్తోందని వేరే చెప్పక్కరలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మతచిచ్చు రగల్చవద్దని, ఆ సినిమా నిర్మించవద్దని ఇప్పటికే వినతులు మొదలయ్యాయి. వర్తమాన, సార్వజనీన ప్రయోజనాల కోసం గతాన్ని తవ్వుకోవాలి, కళా సృజన ఉండాలి. కానీ, సహనశీల మానవీయతని దెబ్బ తీసే స్వల్పకాలిక ప్రణాళికలకు వాడుకుంటే అది కళాద్రోహమే అవుతుంది.
బి.నర్సన్
94401 28169