- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రోగులకు సేవలను అందిస్తారు. మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్ళినపుడు డాక్టర్ కన్నా ముందు వచ్చి మనకు సహాయం చేసేది నర్సులే. డాక్టర్ ప్ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాక మనల్ని కంటికిరెప్పలా కాపాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే వరకు సేవలు చేసేది కూడా నర్సులే. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నర్సులు పోషించిన పాత్ర, అందించిన సేవలు మన అందరికి తెలిసిన విషయమే.
వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు మే 12 సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 1965 నుండి జరుపుతున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు. మన దేశంలో కూడా ఈ రోజు, నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారత రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసా పత్రము, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.
నర్సుల సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూ, నర్సింగ్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం ద్వారా, దేశాలు వారి దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధికి మద్దతు వంటి మూడు ప్రభావాలను దేశాలు సాధించవచ్చని పేర్కొన్నది. ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో సగానికి పైగా నర్సులు ఉన్నారు, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత ఉంది, ఇంకా దాదాపు ఆరు మిలియన్ల మంది నర్సులు అవసరం ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ కొరత ఎక్కువగా ఉంది. నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా, లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్యాన్ని ప్రపంచ దేశాలు సాధించలేవు. అన్ని దేశాలలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలందరూ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, సురక్షితంగా సంరక్షణతో ఉంటేనే వారు రోగులకు సేవలను అందించగలరు, దీనితో అంటువ్యాధులను తగ్గించవచ్చు. నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ మానసిక ఆరోగ్య మద్దతు, సకాలంలో వేతనం, అనారోగ్య సెలవులు, భీమా వంటివి ఇవ్వడం, అన్ని ఆరోగ్య అవసరాలకు ప్రతిస్పందించడానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం అన్ని దేశాలు చేయాలి .
మన దేశంలో బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు , పీహెచ్‌డీ కొన్ని ఏళ్లపాటు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు అనే పిలుస్తున్నారు. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నర్సింగ్ పోస్టులలో పలు హోదాలను మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైల్వే, ఎయిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సు హోదాను నర్సింగ్ ఆఫీసర్ అని, నర్సింగ్ సిస్టర్ హోదాను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అని, సీనియర్ ట్యూటర్ హోదాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అని, లెక్చరర్ హోదాను అసోసియేట్ ప్రొఫెసర్ అని, ప్రిన్సిపాల్ హోదాను ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్ అని, వైస్ ప్రిన్సిపాల్ హోదాను ప్రొఫెసర్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ అని మార్పు చేశారు. కొత్త హోదాలను ప్రభుత్వం అమలు చేస్తే, ప్రైవేట్ ఆసుపత్రులూ అనుసరిస్తాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నర్సుల హోదాలు మార్పు చేయడం ద్వారా వారి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశముంది.
బొల్లం బాలకృష్ణ
99897 35216