- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్తు తెస్తున్న ముప్పు
అదో తీయని వయస్సు.. ఉరుకుల పరుగుల చక్రంలో ఎటు వెళ్తామనే భావన లేని యవ్వనం. తెలిసినా ఏమీ కాలేదులే అన్న భ్రమ, ఆధునికత మోజులో పడి హ్యాపీ హ్యాపీగా ఉంటేనే యవ్వనం. ఖుషీ ఖుషీగా జీవితం అనుకుంటూ ఉండటం నేటి ఆధునిక యువత తీరు. కంప్యూటర్ యుగంలో ప్రపంచమే గ్రామంగా మారి ఆధునిక సమాజపు దురలవాట్లను తొందరగా అలవర్చుకుంటున్నారు. ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గంజాయి, కొకైన్, చివరకు దగ్గు మందులైన సిరప్‌లను తీసుకోనిదే తెల్లవారని పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక మత్తు పదార్థం లేకుండా గడవని గడ్డు పరిస్థితి నేడు యువతలో దాపురించింది.
తెలంగాణ సర్కారు తన ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, గంజాయి లాంటి డ్రగ్స్ వాడకం పెరిగి లక్షలాది కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం 30-32 పబ్బులుంటే, నేడు వాటి సంఖ్య 100 కి పైగా దాటింది. ఇందులో 70% పైగా రాజకీయ నాయకులవే. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2216 వైన్స్ షాప్స్ ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 2620కి పెరిగాయి. 2014లో 1060 బార్లు ఉండగా, నేడు 1220 కి పెరిగాయి. 2014 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు లిక్కర్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది, ఆనాడు లిక్కర్ ఆదాయం రూ.10,800 కోట్లు ఉండగా,2021-22 లో 31 వేల కోట్లకు పైగా పెరిగింది.. నేడు పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది.. 90 శాతానికి పైగా నేరాలు, ఘోరాలు మద్యం, మత్తు పదార్థాల మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల రికార్డ్‌లే చెప్పడం బట్టీ, వీటి వల్ల నష్టాన్ని అంచనా వేయవచ్చు..
యువతే టార్గెట్ !
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించేవారు విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటూ, వారికి వల వేస్తున్నారు. విద్యార్థులను గంజాయి మాఫియా గ్యాంగ్ సభ్యులు సీక్రెట్‌గా గమనించి సందర్భాన్ని బట్టి వారితో మాటలు కలిపి మొదట ఉచితంగా కొంత మత్తు పదార్ధాన్ని ఇచ్చి, దాన్ని సేవిస్తే వస్తే ఆనందమే వేరంటూ తియ్యటి మాటలు చెబుతున్నారు. ఇలా నిదానంగా విద్యార్థులను మత్తుకు అలవాటు చేస్తూ, అవి లేకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తూ, ఆ తర్వాత అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. ఈ గంజాయికి అలవాటు పడుతున్నవారు, గంజాయి రవాణా చేస్తున్న వారు కూడా 25 ఏళ్లలోపు వారే కావడం విశేషం. జల్సాల కోసం కొందరు. జీవనోపాధి కొరకు మరికొందరు, ఈ మాఫియా ఉచ్చులో పడుతున్నారు. కేవలం ఒక్కసారి రవాణా చేస్తే చాలు నెలకు సరిపోయే ఆదాయం వస్తుంది. ఫలితంగా నెల మొత్తం కష్టపడాల్సిన పని లేకుండా డబ్బులు సంపాదించాలని అమాయకులే కాదు. అత్యాశ వ్యాపారులు కూడా గంజాయి లాబీ మాయలో సులభంగా పడి, స్వల్పకాలంలోనే ఆర్థికంగా ఎదుగుతున్నారు. అనైతికంగా సంపాదించిన డబ్బుతో గ్రామీణ ప్రాంతాల్లో యువతను పెడదోవ పట్టిస్తున్నారు. తమ తమ అవసరాలకు వాడుకుంటూ, వాళ్లను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారు.
నయా రూట్లలో భారీ దందా...
ఆన్‌లైన్ ద్వారా వస్తువుల విక్రయం పెరిగిపోవడంతో మాదకద్రవ్యాల వ్యాపారులు దీన్నొక సవర్ణావకాశంగా మలచుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకొని ఆన్‌లైన్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా వాళ్ల సొంత ముఠా సభ్యుల ద్వారా సరఫరా కోట్ల రూపాయల్లో ఉందంటే ఈ నిషేధిత వ్యాపారంను అర్థం చేసుకోవచ్చు.. కొకైన్. హెరాయిన్ వంటివి ఇతరులకు ఎవరికీ అనుమానం రాకుండా టాబ్లెట్స్ రూపంలో సరఫరా చేస్తున్నారు, ఇవి అత్యంత ఖరీదైన మత్తుపదార్థాలు కావడంతో దొరికితే కోట్లలో నష్టం రావడంతో దాని కంటే గంజాయినే రవాణా చేయడం సులువు అనుకుంటున్నారు. గంజాయిని మాత్రలు ఆయిల్. పౌడర్‌ల రూపంలో, సులభంగా తీసుకెళ్లేలా ఉండటంతో విచ్చలవిడిగా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు, అలాగే పబ్బుల్లో, రెస్టారెంట్లలో, ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా వాడుతున్నారనే చేదు అనుభవాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం.
గమనిస్తే మత్తు దూరం చేయవచ్చు..
సరదాగా మొదలైన మత్తు పదార్థాలు వాడకం క్రమేణా వ్యసనంగా మారి, బాధితులను చిత్రవధ చేస్తుంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను ఓ కంట కనిపెడితే చాలావరకు యువతను మత్తు పదార్థాల బారి నుండి కాపాడే అవకాశం ఉంది. పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ.. యువకులు తమ భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు, పబ్‌లు, క్లబ్‌లు ఏకంగా రేవ్ పార్టీలకు, రేవ్ డ్యాన్స్‌లకు తమ పిల్లలు వెళ్తున్న విషయాన్ని తల్లితండ్రులు గొప్పగా, స్టేటస్ సింబల్‌గా కూడా ఫీలవుతున్నారు. మనిషిని పీల్చి పిప్పి చేసే, ఈ వ్యసనాల నుండి వీలైనంత తొందరగా బయటపడలేకపోతే.... ఈ మత్తు పదార్థాల వ్యసనమే మనిషిని పూర్తిగా దహించి వేస్తుంది సుమా!
(నేడు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం)
డా. బి. కేశవులు ఎండీ. సైకియాట్రీ,
చైర్మన్ జాతీయ యాంటీ డ్రగ్స్ సంస్థ
85010 61659