వీరులు-వీరగల్లు చరిత్ర, ప్రస్థానం

by Bhoopathi Nagaiah |
వీరులు-వీరగల్లు చరిత్ర, ప్రస్థానం
X

ఒకనాటి యుద్ధవీరులు...

గ్రామ సంరక్షకులు...

పశు కాపరులు...

ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని యోధులు చేసిన సాహసాలు నెమరువేసుకునేందుకు వారి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోకుండా శిలాశాసనాలు వేయించడం అనేది నాటి ఆచారం. అయితే వీరుడు ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే అధర్మాన్ని ఎదిరించి తన జాతి జనుల కోసం యుద్ధం చేసి ప్రాణ త్యాగం చేసేవాడు వీరుడు. తమ కోసం కాకుండా సమాజం కోసం, జాతి కోసం, దేశం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే వ్యక్తి అవసరమైతే ఆత్మ త్యాగానికి కూడా సిద్ధపడే వ్యక్తి వీరుడు. వీరుని గురించి చెప్పేది వీరగాథ.

వీరులూ వీరగాథలూ సార్వత్రికం

ప్రపంచంలో వీరులు లేని దేశం లేదు. అలాగే వీరగాథలు లేని సాహిత్యం కూడా లేదు. డెన్మార్క్ లో క్రీ.శ12వ శతాబ్దం నుండి రష్యాలో క్రీ.శ13వ శతాబ్దం నుండి స్పెయిన్‌, స్కాట్లాండ్, ఇంగ్లాండ్లలో క్రీ.శ14వ శతాబ్దం నుండి వీరగాథలు ఉద్భవించి వ్యాపించాయి. అయితే మనదేశంలో శూరకుల నిలయమైన రాజస్థాన్ వీరగాథలకు పురిటిగడ్డ. అక్కడ వివాహ సందర్భాలలో కూడా పెళ్లి పాటలు పాడరు, వీరగాథలే పాడుతారు. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారి ప్రకారం (వీరగల్లు మొదటి సంపుటి వీరగంధం పీఠిక -౹) క్రీ.పూ రెండో శతాబ్దం నుండి రాజస్థాన్‌లో వీరగాథలు ఉన్నాయని తెలుస్తుంది. రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర వీర గాథలకు ప్రసిద్ధిగాంచింది.

వీరగాథలు ఎక్కడ ఉంటాయంటే...!

ఇలాంటి వీర గాథలను వీరవిద్యావంతులు, కొమ్ములవారు, సుద్దులవారు, పిచ్చుగుంట్లు, జంగములు, దాసరులు మొదలైన సంచార జీవులైన వృత్తి గాయకులు పాడుతారు. అందుకే వీర గాథ అంటే గేయ రూపంలో ఉన్న చిన్న ఇతిహాసం లేదా కథాత్మకమైన పెద్ద గేయం. ఏ జాతిలో శౌర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయో, ఏ జాతిలో పౌరుషం పట్టింపులు ఎక్కువగా ఉంటాయో ఆ జాతిలో వీరగాథలు ఎక్కువగా ఉంటాయి. (ఉదా: రాజపుత్రులు ఆంధ్రులు, తెలుంగులు, సిక్కులు, మహారాష్ట్రులు) క్రీ.శ.12వ శతాబ్దిలో జరిగిన పలనాటి వీరగాథ క్రీ.శ.13వ శతాబ్దానికి చెందిన కాటమరాజు కథలు ప్రపంచంలోనే మిక్కిలి ప్రాచీనములైన, దీర్ఘములైన వీరగాథా చక్రములు. వీటినే జానపదేతిహాసములు అంటారు. అందుకు తార్కాణమే ఈ ‘వీరగల్లులు’. వీరు నడయాడిన ప్రదేశాలే ‘వీర్లపల్లేలు’గా ప్రస్తుతం ధ్వనిపరిణామం వల్ల వీర్లపల్లె- ఈర్లపల్లిగా, వీరులగుట్టలు- ఈర్లగుట్టలుగా, వీరన్నలు- ఈరన్నలుగా పిలువబడుతున్నాయి. దాదాపుగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ చారిత్రక శిథిలాలు గల ప్రదేశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాని వీటి గురించి చాలామందికి తెలియక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇలా వీరుల జ్ఞాపకార్థం శిలలు చెక్కించి, శాసనాలు వేసే సాంప్రదాయం విష్ణుకుండినులకాలంలో ప్రారంభమైనట్టు లిఖితపూర్వకమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా వారు ఎప్పుడూ తమ ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉంటారనేది జనపదుని నమ్మకం.

వీరగల్లు... సతీకల్లు

ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఈ శాసన శిలల వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో గల మున్నూరు సోమారం గ్రామంలో తోట శంకరయ్య అనే రైతు పొలం గట్టున లభించాయి. ఇక్కడి ప్రజలు ఈ శిలలను ఎన్నో సంవత్సరాలుగా దేవతలుగా కొలుస్తున్నారు. వీటిని ఈరన్నలుగా, ఈర్లగుట్టలుగా పిలుస్తారు. ‌కొందరు అత్యాశపరులు ఇక్కడ గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరపడం వల్ల శిలలు విరిగిపోయి, చిందరవందరగా పడిఉన్నాయి. ఈ శిలలను గూర్చి చర్చ చేసిన సమయంలో వీటి పూర్తి చరిత్రను తెలుసుకోవడం జరిగింది. వీరుని జ్ఞాపకార్థం అతని మూర్తిని చెక్కిన ఈ శిలను వీరగల్లు అని అంటారు. ఆ వీరుని తల్లి వీరమాత, వీరుని భార్య వీరపత్ని. వీరుడు మరణించగానే వీరపత్ని సహగమనం చేస్తుంది. ఆమె పేరంటాలుగా పూజించబడుతుంది. సహగమనం చేసిన వీరపత్ని రూపం చెక్కబడిన శిలలని ‘సతీకల్లు’ అంటారు. కన్నడంలో మాస్తికల్లు లేదా మహాసతికల్లు అంటారు. ఇది మూడు అంతస్తులుగా లేదా మూడు భాగాలుగా ఉంటుంది.

శిర కందుక క్రీడ... రణం కడుపు

వీటిని వీరగల్లులుగా, సతీశిలలుగా పిలుస్తారు. మొదటి భాగంలో ఓ వ్యక్తి ఒక చేత్తో బల్లెం లేదా కత్తి, ఈట పట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లుగా, జంతువులను చంపుతున్నట్లుగా వీరుని శిల్పం ఉంటుంది. రెండవ భాగంలో యుద్ధంలో మరణించిన వీరున్ని రంభ, ఊర్వశి అప్సరసలు స్వర్గానికి ఆహ్వానిస్తున్నట్లుగా లేదా కైలాసానికి తీసుకుపోతున్నట్టుగా ఉంటుంది. చివరగా మూడవ భాగంలో కైలాసంలో వీరుడు శివునిలో ఐక్యం కావడం చూపబడుతుంది. శివుడు, శివలింగం, నంది విగ్రహాల్లో ఐక్యమైనట్లుగా ఈ వీరగల్లు శిల్పాలు కనిపిస్తాయి. వీరులు జైనమత అభిమానులైతే వారు కైవల్యం పొందినట్లు ఆసీనమైన బొమ్మలుంటాయి. ప్రాచీన కాలంలో యుద్ధాల్లో ఓడిన వీరుల తలలను బంతులుగా ఉపయోగించి ‘శిర కందుక క్రీడా వినోదం’ చేసుకునే పద్ధతి ఉంది. దీంతోపాటు తమ చేతుల్లో మరణించిన శత్రువీరుల రక్తమాంసాలతో ఉడికించిన అన్నాన్ని కావలి దేవతలకు పొలిజల్లడం అనే ‘రణం కడుపు’ అనే సంస్కృతులు కూడా వీరగల్లుల్లో ప్రతిబింబిస్తాయి. ఇలాంటి చారిత్రక శిథిలాలు నేడు నిరాదరణకు గురవుతున్నాయి. వీటిని గుర్తించి, వీటి చరిత్రను వెలుగులోకి తెవడం మనందరి బాధ్యత.



- తోట ప్రశాంత్ కుమార్

పరిశోధక విద్యార్థి

96661 44334

Advertisement

Next Story

Most Viewed