- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవశాస్త్ర పరిశోధనలో.. 'భాగ్యనగరమే'
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ప్రపంచం అలోచిస్తోంది. జీవశాస్త్రంలో నూతన పరిశోధన ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యాధినిరోధక ఔషధాల పరిశోధన, తయారీ కోసం అనేక బహుళ జాతీయ కంపెనీలు హైదరాబాద్‌ని కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ క్రియాశీల అమలు, నిరంతరం అభివృద్ధి చెందుతున్న జీనోమ్ వ్యాలీ, విస్తరిస్తున్న మెడ్ టెక్ పార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ ఉన్న ఏకైక నగరం వంటివి హైదరాబాద్‌కి కలిసి వచ్చిన ఆంశాలు. కృతిమ మేధస్సుతో మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం చేయడమే బయోఏషియా సదస్సు-2024 నినాదం.
ఈ సదస్సు లక్ష్యం
జీవశాస్త్ర రంగం అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులు జీనోమ్ వ్యా లీలో అందుబాటు. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు, ఔషధ తయారీ ఆభివృద్ది, ప్రీ-క్లినికల్, క్లినికల్, ట్రయల్, క్లినికల్ ట్రయల్ కోసం వినియోగించే సంబంధిత ఉత్పతుల లభ్యత, భారతీయ, బహుళజాతి ఔషధ తయారీ,పరిశోధన సంస్దలకు, అవి నిర్వహించే కార్యకలాపాలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణదిశగా ఆడుగులు వేయటం, ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్’ ఏర్పాటు చేయ్యాలన్నది సంకల్పం. కొత్త పెట్టుబడులను ఆకర్షించి ఇదే సమయంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులను లభ్యత వల్ల ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించి 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు (8.2 లక్షల కోట్లు) చేరుకోవాలన్నది నిర్దేశిత లక్ష్యం. కృతిమ మేధస్సును వినియోగిస్తూ పరిశోధనలు, రోగ నిర్దారణకూ అవకాశం కల్పించే ఇమేజింగ్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తూ దానిని సమర్దవంతంగా వినియోగించడంపై దృష్టి సారించింది.
బహుళజాతి ఔషధ కంపెనీల రాక
అమెరికాకు చెందిన ఇప్పటిదాకా ఇండియాలో లేని ఒక కొత్త బహుళ జాతీయ ఔషధ కంపెనీల సంస్థ పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ కార్యక్రమాలను నిర్వహించటానికి హైదరాబాద్‌లో వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీ స్థాపనకు ముందుకు రావడం మంచి పరిణామం. 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఓ కెపాసిటీ సెంటర్‌ను నిర్మించాలనే ఆలోచనతో మహానగరంలో కార్యకలాపాలు మొదలు పెట్టిన నోవార్టిస్ గత ఐదేళ్లలో ఇక్కడ తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేసింది. అత్యంత కీలకమైన డ్రగ్ డెవలప్‌మెంట్, డేటా మేనేజ్‌మెంట్, పేషెంట్ సేఫ్టీ, తయారీకేంద్రాలు, ప్రొక్యూర్‌మెంట్, పీపుల్ మేనేజ్‌మెంట్, మల్టిపుల్ సీనియర్ రోల్స్ వంటి సేవలనూ ఇక్కడ నుంచి విస్తరించాలన్నది సంస్ద లక్ష్యం. ప్రపంచం మొత్తమ్మీద ఈ సంస్థకున్న మూడు ముఖ్య కేంద్రాలలో ఇది ఒకటి కావడం విశేషం.
మేధోమథన వేదిక
బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతోన్న నేపథ్యంలో గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికికి బయో ఏషియా కీలక సాధనంగా ఉద్భవించింది. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్య మౌతున్నాయి. ఒక్క పెట్టుబడులే లక్ష్యంగా కాకుండా. జరుగుతున్న పరిశోధనలు నాణ్యతతో కూడిన మెరుగైన ఔషధాలు, వైద్య పరికరాలలో నూతన ఆవిష్కరణలపై ఆయా రంగ నిపుణులు పరస్పరం చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన విజ్ఞాన వేదికగా దీనిని మనం చూడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో పాటు దేశీయ కంపెనీలు, అరోగ్య విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలి. సంస్దలను స్థాపించి కొనసాగించే వారికి ప్రోత్సహకాలు ఇవ్వాలి. ఈ రంగంలో దేశీయ అంకుర సంస్దలని ప్రోత్సహించాలి . ఇలాంటి సదస్సులలో విజ్ఞానం నైపుణ్యం మార్పిడి వల్ల రానున్న కాలంలో మరిన్ని కొత్త అవిష్కరణలు అందించే భాగ్యం మన భాగ్య నగరానిదే.
(హైదరాబాద్‌లో బయోఏషియా సదస్సు-2024 సందర్భంగా)
- శ్రీధర్ వాడవల్లి
99898 55445