ఇక్కడి ప్రజలు అలా కారు..

by Ravi |
ఇక్కడి ప్రజలు అలా కారు..
X

బంగ్లా, శ్రీలంకలో మాదిరి భారత్‌లో కూడా ఏదో ఒక రోజు భారత ప్రజలు ప్రధాని మోడీ గృహంలోకి జొరబడతారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎం.పి సజ్జన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తప్పు. ఆ దేశాల్లో మాదిరి కాకుండా మన ప్రధాని ఓ సమర్ధ నాయకుడు, మంచి రాజకీయ చతురుడు, పాలనా సామర్థ్యం కలవారు. ఒక దేశ ప్రధానిని కలవాలి అంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. దుర్భేద్యమైన ప్రధాని నివాసాన్ని చుట్టు ముట్టాలి అన్నా, లోపలికి ప్రవేశించాలి అన్నా మాటలు కాదు. బంగ్లాలో మాదిరి ఇక్కడ ఉండదు. మరి సజ్జన్ సింగ్ ఎలా ఆ మాటలు అన్నారో అర్ధం కావడం లేదు.

భారత ప్రధాని ఉక్కు మనిషి, బలమైన నాయకుడు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. దేశాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకుపోయే వ్యక్తులు అవసరం. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మోడీ. బంగ్లాదేశ్, శ్రీలంకలో నిరసన కారులు ప్రధాని నివాసంలోకి జొరబడి అలజడి సృష్టించడం చూస్తే అక్కడ వారి భద్రత ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతోంది. ఏ దేశ ప్రధానికైనా గట్టి బందోబస్తు ఉంటుంది. రక్షణగా ఉన్న వాళ్లు చూస్తూ ఎలా ఊరుకుంటారు? అంటే అంత బలహీన వ్యక్తులు అక్కడ రక్షణగా ఉన్నారా? అనే సందేహం వస్తుంది. లేక రక్షణగా ఉన్నవాళ్లకి ముందస్తు సమాచారం చేరవేసి మేము వస్తున్నాం మీరు నిమిత్త మాత్రులుగా ఉండండి అని ఉప్పు అందించారా? ఇది అందరిని వేధిస్తున్న ప్రశ్న.

మోడీ బలహీన నేత కాదు!

ప్రపంచ దేశాలు సైతం భారత ప్రధానిని ప్రశంసిస్తూ ఉంటే, మోడీవి తప్పుడు విధానాలు అని మాట్లాడటం సబబు కాదు. ప్రజా ప్రయోజనకరమైన విధానాలు, సంక్షేమ చర్యలు, దేశాల మధ్య మంచి సంబంధాలు నెరిపితేనే ఏ దేశమైనా దృఢంగా ఉంటుంది. అటువంటి దృఢత్వం మోదీకి ఉంది. పొరుగు దేశాలలో రాజకీయ అల్లర్లు, అస్థిరత్వం ఉంటే, భారత్‌లో ప్రజాస్వామ్యం వికసిస్తోంది. తీవ్ర కరువుకు కానీ, రాజకీయ అస్తిరతకు కానీ భారత్‌లో చోటు లేదు, చేసుకోదు కూడా. దేశంలోని సమస్యలు ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉంది. బలమైన నాయకులు ఉన్నారు. ఎవరో అన్న దానిని పట్టించుకోకూడదు. నాయకునికి దేశ భవిష్యత్, ప్రజా సంక్షేమం, రక్షణ, అభివృద్ధి ముఖ్యం. ఆ దిశలోనే మన భారత ప్రధాని, తదితర మంత్రులు ఉన్నారు.

మన ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారు

బలహీన నాయకులు, సమస్యలు పరిష్కరించలేని వ్యక్తులు ఉంటే మన ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు. అయినా అటువంటి వారి పాలనలో ఎక్కువ రోజులు ప్రజలు మన లేరు. చట్ట సభలలో వివిధ పార్టీ నాయకులు లోపాలు ఎలుగెత్తి చూపుతారు. ముప్పేట దాడి ఎదుర్కొలేక నాయకుడు రాజీనామా చేస్తాడు. అతని స్థానంలో మరో నాయకుడు వస్తాడు. భారత్‌లో జరిగేది ఇదే. అంతేకానీ ప్రధాని నివాసంలోకి జొరబడే ప్రజలు ఇక్కడ లేరు. ఎందుకంటే మన రక్షణ వ్యవస్థ అంత బలమైనది. భారత్‌లోనూ, వివిధ రాష్ట్రాలలోనూ పటిష్టమైన నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నియంతలు, ప్రజాధనాన్ని దోచుకునే వాళ్లను ప్రజలు తిరస్కరిస్తారు. చిత్తుగా ఓడిస్తారు కూడా.

- కనుమ ఎల్లారెడ్డి,

93915 23027

Next Story

Most Viewed