దేశానికి.. యువ నాయకత్వం అవసరం!

by Ravi |   ( Updated:2023-10-03 00:31:02.0  )
దేశానికి.. యువ నాయకత్వం అవసరం!
X

దేశానికి నిజమైన సంపద బంగారు గనుల్లో, అద్దాల మేడల్లో, అందాల నగరాల్లో కాదు.. యువతలో ఉందని.. అటువంటి యువశక్తి సక్రమంగా వాడుకుంటే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే స్వామి వివేకానంద మాటలు మనకు తెలిసినవే.. అయితే, ఈ సంగతి పాలకులకు తెలిసినప్పటికీ... యువ నాయకత్వాన్ని మాత్రం పాలకులు ఒప్పుకోలేకపోతున్నారు. యువ నాయకత్వం బలపడితే తమకు అవకాశాలు ఉండవనో.. లేక మరే విధమైన ఆలోచనో కానీ భారతదేశ వ్యాప్తంగా యువకులకు చట్టసభల్లో నాయకులుగా అవకాశాలను ఇవ్వడంలో ఏ పార్టీలు మనస్ఫూర్తిగా సిద్ధంగా లేవు. వివిధ పార్టీల్లో ఎంతో మంది విద్యార్థి నాయకులకి సమాజం పట్ల అవగాహన ఉన్నప్పటికీ వారికి రాజకీయ అవకాశాలు ఇవ్వాలంటే ఆధిపత్య భావజాలం కలిగిన రాజకీయ నాయకులకు మనసు రావడం లేదు. ఫలితంగా యువత జెండాలు మోసే కూలీలుగా మారిన దుస్థితి నెలకొని ఉంది.

వారసత్వానికి మొగ్గు చూపడంతో..

ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల విధానాన్ని పాలకులు పూర్తిగా మార్చారు. యువకులు అన్ని రంగాల్లో ముందుండాలంటూ.. ప్రోత్సహిస్తున్నప్పటికీ రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో మాత్రం అన్ని పార్టీలూ ఒకేలా వ్యవహరిస్తున్నాయనడంలో సందేహం లేదు. ధనస్వామ్య దేశంగా మార్చి ఎన్నికల ప్రక్రియలో యువత అనర్హులుగా అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. విలువలు కలిగి ఉన్నతమైన చదువులు చదివి, సమాజం పట్ల అవగాహన కలిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా, అరవై ఏళ్లు దాటిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతదేశంలో జరిగిన అనేక సామాజిక, అసమానతల రాజకీయ పోరాటాల్లో యువత భాగస్వామ్యం లేని ఏ ఉద్యమం లేదు. అది భారతదేశ విముక్తైనా, తెలంగాణ రాష్ట్రం కోసమైనా అనేక మంది మంది విద్యార్థులు ముందుండి ప్రాణాలను సైతం అర్పించి విజయం సాధించారు. యువత సమాజంలో గుణాత్మక విలువలు కాపాడేలా కృషి చేస్తున్నారు. బార్డర్‌లో బాహ్య శత్రువులు దేశంలోకి చొరబడకుండా.. రక్షణగా నిలుస్తున్నారు. 30 ఏళ్ల లోపు దేశరక్షణలో అమరులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

భారతదేశ రాజకీయాలు ముఖ్యంగా వారసత్వానికి పెద్దపీఠం వేయడంలో వేదికలుగా మారుతున్నాయి. దీంతో సమాజానికి మంచి చేయాలనే తపన కలిగిన సామాజిక స్పృహ కలిగిన యువతలో రాజకీయ నైపుణ్యం ఉన్నప్పటికీ దానిని ఎప్పటికప్పుడు నాయకులు ఎదగకుండా తొక్కి పడుతున్నారు. అయినా ఎంత అణచివేసినా అక్కడక్కడ యువచైతన్యం తమ సత్తాను చాటుతోంది. పరిశ్రమలలో, ఉద్యోగాల్లో, వివిధ రంగాల్లో యువతను అడ్డుకునే వారు లేరు. ఎందుకంటే అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి.. కానీ ఓ విద్యావంతుడు, యువకుడు నాయకునిగా ఎదిగితే మాత్రం పాలకవర్గం తట్టుకోలేకపోతుంది.

యువ నాయకులపై అణిచివేత..

పార్టీలు యువతను విస్మరించినప్పటికీ ఆయా రాష్ట్రాలలో యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి గెలుస్తున్నారు. గుజరాత్‌లో జిగ్నేష్ మేవాని, అలాగే ఇటీవల జరిగిన గతంలో అసోం ఎన్నికలలో అరుణ్ గోగోయ్ అనే ఓ సామాజిక కార్యకర్త జైలు నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇలా అనేక మంది యువత దేశం కోసం, ఆయా రాష్ట్రాల్లోనూ నిబద్ధతతో ఆధునికంగా ఆలోచించే నాయకత్వం చేయాలనుకున్నా పాలకులు యువ నాయకత్వాన్ని అణచివేయడంలో విజయవంతమవుతున్నారు. ఫలితంగా రాజకీయ వారసులను తెరపైకి తెచ్చుకొని అందలాలు ఎక్కిస్తున్నారు. ఎక్కడో అమెరికా, లండన్‌లో చదివి... ఇక్కడి సమాజం, ఇక్కడి ప్రజల కష్ట నష్టాలు, సామాజిక అంతరాలు ప్రత్యక్షంగా చూడలేని వారు రేపు సమాజంలో ఎటువంటి మార్పు తీసుకువస్తారు. కేవలం వారు అధికార హోదాను అనుభవించడం తప్పా!

అసోం రాష్ట్రంలో యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన అస్సాం గణపరిషత్ తరఫున దేశంలోనే అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రఫుల్ల కుమార్ మహంతా. విద్యార్థి ఉద్యమ, సామాజిక అసమానతల పోరాటం నుంచి రాజకీయ పార్టీగా మార్చి, దేశంలో అందరూ ఆశ్చర్యపోయేలా రాజకీయ పోరాటం ద్వారా ముఖ్యమంత్రి బాధ్యతలు గతంలో చేపట్టారు. ఈ దేశంలో మొదటి లోక్‌సభ ఏర్పడిన సమయంలో దాదాపు 27 శాతం యువకులు ఆనాడు పార్లమెంటులో సభ్యులుగా ఉండేవారు. నేడు ఇంతటి ఆధునిక కాలంలో కేవలం ఏడు శాతం మాత్రమే యువకులు లోక్‌సభ సభ్యులుగా ఉన్నారంటే..దేశ రాజకీయాలలో యువత అణచివేత ఏ మేర ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

సమాజానికి దారి చూపడానికి..

ప్రపంచదేశాల్లోనే అత్యధికంగా యువత కలిగిన దేశంగా టాప్ రెండో స్థానంలో ఉన్న భారత్‌లో యువ నాయకత్వం మాత్రం జీరోగానే మారింది. అందుకు పాలకుల పరోక్ష కారణంతో పాటు ధనస్వామ్య రాజకీయాలని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే యువతలో రాజకీయ చైతన్యం లేకపోవడమూ మరో కారణంగా అర్థం చేసుకోవచ్చు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఇంకా అసమానతలు, అభివృద్దికి దూరంగా బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి... సామాజిక పోరాటం ఒక్కటే కాదు. చట్టాల ద్వారా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ అన్ని రంగాల్లో రాణించాలంటే యువశక్తి ప్రధాన పాత్రను పోషించాలి. బార్డర్‌లో జవాన్లలా... ప్రజాస్వామ్య రక్షకులుగా.. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్టడానికి యువత సంఘటితంగా చట్టసభల్లోకి వెళ్లేలా.. ధన, వారసత్వ రాజకీయాలపై తిరుగుబాటు చేసి నవసమాజాన్ని, కుట్రలు లేని గుణాత్మకమైన రాజకీయాల కోసం పోరుబాట పట్టాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు.

78933 03516

Advertisement

Next Story