- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధ్యత మరుస్తున్న మీడియా సంస్థలు!
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంట్, కార్యనిర్వాహక శాఖ,న్యాయశాఖ మీడియా అనే నాలుగు మూలస్థంబాలు అని పెద్దలు చెబుతారు. ఐతే, భారతీయ మీడియాపై పాలక వర్గ పార్టీల వైఖరి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే మార్గంలో వెళుతుంటడం వ్యవస్థకే ప్రమాదకరం అనిపిస్తుంది. మీడియా (ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా) అనేది ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తాయి. అలాగే ప్రజల సమస్యలు, ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి మీడియా తెలియజేస్తుంది. అంటే మీడియా అనేది ఉభయతారకంగా ఉండి, ఇరువురికీ మేలు చేసేదిగా ఉంటుంది. ప్రధానంగా మీడియా ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అవగాహన కలిగిస్తాయి.
విధిలేక బాకాలు ఊదుతున్నారా?
ఈ మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 14 మీడియా సంస్థలకు చెందిన యాంకర్ల చర్చా కార్యక్రమాలకు వెళ్లరాదని తీర్మానం చేసింది. ఈ వార్త ప్రధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది. దీనికి కారాణాలను విచారిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోడీ పరిపాలన మొదలైన నాటి నుంచి మీడియాలో ఒక బలమైన వర్గం ప్రభుత్వ ప్రచార, ప్రసార సాధనంగా మారిందనేది ప్రధాన ఆరోపణ. మోడీ ప్రభుత్వం తన ఘనత చాటుకోవటానికి అధికారిక వ్యవస్థల మీద ఆధారపడకుండానే ప్రయివేటు మీడియా సంస్థలు ఉపయోగపడుతున్నాయి. ఇవి తమకు తాము స్వచ్ఛందంగా మోడీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ, ఆయన ప్రభుత్వాన్ని బలపరుస్తూ వార్తలు, కథనాలు, మీడియా చర్చలు చేస్తున్నాయా లేక ప్రభుత్వ జోక్యం, ఒత్తిడి, ప్రలోభాలతో విధిలేక బాకాలు ఊదుతూ వ్యవహరిస్తుందా? అనేది ప్రతిపక్ష పార్టీలతో పాటు, ప్రజలకు వస్తున్న అనుమానం. ఇలా మోడీ ఏది చేసినా, చేయకున్నా అకారణంగానే ఫోకస్ పెట్టి ఏకపక్షంగా సమర్థించే మీడియానే గోదీ మీడియా అంటున్నారు. ఈ పదాన్ని గతంలో యన్.డీ.టి.వి. మీడియా ఛానల్ యాంకర్, న్యూస్ ప్రజెంటర్ రవీష్ కుమార్ మొదటిసారిగా ఉపయోగించారు. క్రమంగా మోడీ ప్రభుత్వాన్ని ఏకపక్షంగా సమర్ధించే యాంకర్లనూ, మీడియా సంస్థలను గోదీ మీడియాగా పిలుస్తున్నారు.
అందుకే సహాయ నిరాకరణ!
ఈ 'గోదీ మీడియా' ఏకపక్ష వికృత చేష్టలను నిలువరించడానికిగానూ విపక్ష ఇండియా కూటమి, 14 సంస్థల యాంకర్లను, వారి చర్చా కార్యక్రమాలను బహిష్కరించాలని ఐక్యంగా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షం ఇలా చేయడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నిజానికి వీరిని బహిష్కరణ అనడం కన్నా, సహాయ నిరాకరణ అనడం బాగుంటుంది. అయితే, ప్రతిపక్షాల బహిష్కరిస్తున్నది కొంతమంది యాంకర్లను మాత్రమే తప్ప మొత్తం మీడియా సంస్థలను కాదు. అలాగే మీడియా యాజమాన్యాలను కూడా కాదు. వాస్తవానికి ఈ మీడియా సంస్థల యాజమాన్యాల ఆదేశాలు లేకుండా ఏ యాంకర్ అయినా స్వతంత్రంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, విపక్షాలను అకారణంగా, అదేపనిగా దుమ్మెత్తిపోసే అవకాశం ఉంటుందా! అన్నది పెద్ద ప్రశ్నే అయినా, ప్రతిపక్షం తమ పోరాటాన్ని యాంకర్ల వరకే పరిమితం చేయటం అనేది వారి నిరసనగా చెప్పుకోవచ్చు. అందుకు వారికి సహేతుకమైన కారణాలు ఉండి ఉండవచ్చు.
ఈ మధ్య పత్రికలు, ప్రసార సాధనాలు ప్రభుత్వాలను నిలదీయడం మానివేసి, అధికార పార్టీకి భజన కార్యక్రమం మొదలుపెట్టాయి. అధికార పార్టీ కరపత్రాలుగా, జేబు సంస్థలుగా రూపాంతరం చెందాయి. మీడియా ఆత్మగౌరవంతో తలెత్తుకొని సగర్వంగా 'ఇజాలకు' అతీతంగా, అధికార పార్టీలకు తల వంచకుండా నిష్పాక్షికంగా, నిబద్ధతతో పని చేయడం మానేశాయి. ప్రతి రాజకీయ పార్టీ తమదైన సొంత పత్రికలనూ, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలను, సోషల్ మీడియా గ్రూపులను నడుపుకుంటున్నాయి. వారికి వేతన భత్యాలు ఇచ్చి మరీ ప్రతిపక్షాలపై బురదజల్లే కార్యక్రమాలను అదేపనిగా మొదలెట్టారు.
ప్రభుత్వ బాధ్యత విస్మరించిన 'గోదీ మీడియా' ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేసింది. ఏడాదికి పైగా ఢిల్లీ పొలిమేరల్లో రైతులు ఉద్యమం చేస్తే, కరోనా చావులు భయం పుట్టిస్తే, పతాక శీర్షికలలో రాయాల్సిన వార్తలను రాయలేదు. అప్పుడు గోదీ మీడియా కుంభకర్ణుడి నిద్ర నటించింది. పైగా ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ, గోదీ మీడియా ప్రతిపక్షాలను నిలదీయటంలో మాత్రం అతి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికే ప్రతిపక్ష 'ఇండియా' ఐక్య సంఘటన 14 మంది యాంకర్లను బహిష్కరించి తమ నిరసనను తెలిపింది.
భజనకు అలవాటు పడ్డాయి!
ఇప్పటికే మోదీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకుని పార్లమెంటులో మంద బలంతో చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించుకుంది. మణిపూర్‌లో దారుణాలు జరుగుతున్న, రూపాయి విలువ ఘోరంగా పతనమౌతున్నా, దేశ అప్పులు, వడ్డీలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా ఈ మీడియాకు కనపడదు. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న ప్రజల హాహాకారాలు వినబడని చెవిటి సంస్థలుగా ఇవి తయారయినాయి. ఈ 9 ఏండ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే దమ్ము ఈ గోదీ మీడియాకు లేదు.
అందుకే పాలకులను ప్రశ్నించలేని, అమ్ముడు పోయిన మీడియా సంస్థలు ఉన్నా, లేకున్నా ప్రజలకు పెద్దగా ఫరక్ పడేది ఏమీ లేదని ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. పెట్టుబడిదారుల, పారిశ్రామిక వేత్తల పెట్టుబడులతో నడిచే మీడియా నుండి ఇంతకన్నా ఏమీ ఆశించలేము. మంత్రిమండలి, దర్యాప్తు సంస్థలు మోదీ కనుసన్నలలో నడవాల్సిందే. మీడియా సంస్థలు భజనకు అలవాటు పడ్డాయి. న్యాయ వ్యవస్థ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ప్రజలు ఆశగా న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తున్నారు. మొత్తంగా మోదీ 9 ఏళ్ల పాలనలో మన దేశ,సామాజిక,ఆర్థిక, రాజకీయ రంగాలు, లౌకిక జీవనం, మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయి. అందుకే ప్రజాస్వామిక వాదులు, మేధావులు వేగంగా ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి. భావి తరాలను కాపాడాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496