మనుషుల ఏనుగుల అనుబంధమే ఎలిఫెంట్ విస్పరర్స్

by Ravi |   ( Updated:2023-05-27 00:31:00.0  )
మనుషుల ఏనుగుల అనుబంధమే ఎలిఫెంట్ విస్పరర్స్
X

డాక్యుమెంటరీ ఫిల్మ్ అన్నది ఓ జ్ఞాపకాల తోరణమే కాదు, అది ఓ అనుభవాల పందిరి. వాస్తవాన్ని సృజనాత్మకంగా చూపించడమే కాకుండా వాస్తవాల్ని విశ్లేషించి వివరించడం కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్ లక్షణం. అంతేకాదు స్థలకాలాల్ని రికార్డ్ చేసే ఒక గొప్ప మాధ్యమం. కానీ సరైన అవగాహన లేని వారి చేతిలో పడిపోయి డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రభావం పరిమితమయిపోతున్నది.. ఎలాంటి స్పష్టమైన దృష్టికోణం కానీ, దృక్పథం కానీ లేకుండా నిర్మిస్తుండడంతో ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు వైఫల్యాల్ని మూట గట్టుకుంటున్నాయి. దానికి భిన్నంగా ఈ మధ్య ఆర్తి తో అవగాహనతో కళాత్మకంగా రూపొందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ 'ఎలిఫెంట్ విస్పరర్స్'. కేవలం కళ్లను మెరిపించేలా కాకుండా హృదయాల్ని కదిలించేలా రూపొందించగలిగితే డాక్యుమెంటరీలు కూడా విశేష విజయాల్ని సొంతం చేసుకుంటాయని ఈ సినిమా నిరూపించింది.

అటవి ప్రాంతంలో పుట్టి పెరగడంతో..

ఎలిఫెంట్ విస్పరర్స్ అంటే.. ఏనుగు చెప్పిన మాట.. లేదా చెప్పాలనుకున్న మాట ! మనుషులకు, ఏనుగులకు మధ్య అనుబంధం గురించి కళ్లను తడి తడి చేసి మనసు కదిలించేలాగా చూపించిన సినిమా ఇది! డైరెక్టర్ కార్తికి గొన్‍సాల్వస్‌ మనసు హత్తుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చరిత్ర సృష్టిస్తూ మొదటి ఆస్కార్‌ని ఇండియాకి అందించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వస్.. అటవీ ప్రాంతంలో పుట్టి పెరగడంతో ఆమెకు వన్య ప్రాణులపై ఎక్కడ లేని అవగాహన, ప్రేమ. పర్యావరణం, వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాల ద్వారా జీవావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంగా ఎలిఫెంట్ విస్పరర్స్ తీశారు. ఆమెకు వున్న ఆసక్తి మేరకు ఫొటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో విజువల్‌ క్యూనికేషన్‌ విభాగంలో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత ప్రకృతి, దానితో పెనవేసుకునివున్న జీవన స్థితిగతులపై తన దృష్టిని కేంద్రీకరించారు.

42 నిమిషాల చిత్రం కోసం..

ముదుమలై రిజర్వు ఫారెస్ట్‌లో మావటీలుగా పని చేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ వాస్తవిక జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఓ రోజున కార్తికి కంటికి ఒక ఏనుగు పిల్లతో కలిసి ఓ వ్యక్తి వెళుతున్న దృశ్యం కనిపించింది. దీన్ని నిశితంగా గమనించిన కార్తికి.. ఏనుగు పిల్లకు, ఆ వ్యక్తికి మధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చర్యమేసింది.

అడవి నుంచి తప్పించుకున్న రఘు, అము అనే రెండు ఏనుగులను.. బొమ్మన్ అండ్ బెల్లి అనే ఇద్దరు సాకుతూ ఉంటారు. ఆ ఏనుగులతో వారికి ఎలాంటి బాండింగ్ క్రియేట్ అయిందనేది ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా వున్నప్పటికీ జాగ్రత్తగా చూస్తే అంతకుమించి అనిపిస్తుంది, కనిపిస్తుందీ కథలో! రెండు ఏనుగులకు, ఇద్దరు మనుషులకు మధ్య అనుబంధం కాదు.. ఆ నలుగురికీ, అడవితో అనుబంధాన్ని కూడా పక్కాగా చూపించారు డైరెక్టర్. మొత్తం 42 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో కనిపించేది రెండు ఏనుగులు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఇందుకోసం కార్తికి ఏకంగా 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు. మనుషులు, మూగజీవాల మధ్య బంధం మాత్రమే కాదు.. సనాతన భారతీయ సంప్రదాయాలను.. అడవి బిడ్డల బతుకులను, అడవి సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను మనసు హత్తుకునేలా చూపించారు కార్తీకి. ఇది ఆస్కార్ కమిటీ మనసు గెలుచుకుంది. కార్తీకి గొన్‍సాల్వస్‌ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింని గునీత్ మోంగా, డాగ్లస్ బ్లుష్, అచిన్ జైన్ నిర్మించారు. ఆస్కార్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో మొత్తం ఐదు పోటీలో నిలవగా.. అందులో ఇండియన్ షార్ట్ ఫిలిం విజేతగా నిలిచింది.

ఇట్లా ఒకే ఒక డాక్యుమెంటరీ సినిమాతో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు దర్శకురాలు. అంటే నిజాయితీగా, నిబద్దతతో తీస్తే కోట్లు పెట్టాల్సిన పనిలేదు, పెద్ద వ్యాపార సినిమానే తీయాల్సిన పని లేదు అని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా ఇంకా చూడకపోతే నెట్‌ప్లిక్స్ లో ఉంది వీక్షించండి.

వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed