సుపరిపాలన.. ఉందా? ప్రజాదర్బార్ వద్దా!

by Ravi |   ( Updated:2023-06-15 00:45:49.0  )
సుపరిపాలన.. ఉందా? ప్రజాదర్బార్ వద్దా!
X

ప్రజాదర్బార్ పెట్టడమంటే వ్యవస్థలో లోపం ఉన్నట్లే... ఇదీ మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పిన నిర్వచనం. క్షేత్రస్థాయిలో పరిపాలన విఫలమైనప్పుడే ప్రజల సమస్యలు రాష్ట్ర స్థాయి వరకు వస్తాయని, కేసీఆర్ పాలనలో ఆ అవసరమే లేదని వివరణ ఇచ్చారు. నిజంగా కేసీఆర్ పాలనలో అంతా సవ్యంగానే జరుగుతున్నదా? ప్రజలకు సమస్యలే లేవా? ఆ స్థాయిలో రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు కావాలి. ఒక్కసారి ప్రజలకు సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది.

రాష్ట్రంలో ప్రజలకు సమస్యలే లేకపోతే క్షేత్రస్థాయిలో కాన్వాయ్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రగతి భవన్ ముందు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తున్నారు? ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు ఎందుకు పాల్పడుతున్నారు? ట్విట్టర్‌లో తిట్ల దండకాలు ఎందుకు కనిపిస్తున్నాయి? సాయం కోసం విజ్ఞాపనలు ఎందుకొస్తున్నట్లు? అలాంటి రిక్వెస్టులకు మా ఆఫీస్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది.. అంటూ రిప్లైలు ఎందుకు ఇస్తున్నట్లు? క్షేత్రస్థాయిలో పనులు కానందునే ట్విట్టర్‌ను ఆశ్రయించాల్సి వస్తున్నది కదా?

కొన్ని జిల్లాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి పేరుతో గ్రీవెన్స్ సెల్ నడుస్తూ ఉన్నది. ప్రజలు వారి సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నందునే అధికారులు దీన్ని అమలు చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కానందునే కలెక్టర్ వరకూ వస్తున్నారు. ఆ స్థాయిలో పరిష్కారం కానప్పుడే ఆవేశంతో సూసైడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి చెప్తున్నట్లుగా ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగే.. చందమే అవుతుంది. ఇది ప్రజలను అవమానించడమే కాక తమను తాము మభ్యపుచ్చుకోవడమే. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా గోప్యత పాటించడం సుపరిపాలన అని అనుకోవచ్చునా?

సుపరిపానలోని వాస్తవాలు..

క్యాబినెట్‌లో చర్చించిన అంశాలు రహస్యంగానే ఉండిపోతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పబ్లిక్ డొమెయిన్‌లోకి రావడంలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నా సమాచారం ఇవ్వడంలేదు. ఇవన్నీ సుపరిపాలనకు మచ్చుతునకలా? ప్రజలకు సమస్యలే లేని పాలన అందుతున్నది నిజమే అయితే మంత్రులను స్థానికంగా ఎందుకు నిలదీస్తున్నారు? ఎమ్మెల్యేలను ఫోన్‌లలో ఎందుకు నిలదీస్తున్నారు? సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టింగులు ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రశ్నించే వారందరికీ రాజకీయాలను అంటగట్టడం సహేతుకం కాదు. ప్రతిపక్షాల కార్యకర్తలంటూ ముద్రవేయడం వాస్తవాన్ని చూడలేక నిరాకరించడమే! రాచరిక పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకోడానికి రాజులు, వారి అనుచరులు మారువేషాల్లో వీధుల్లో తిరిగి వాస్తవాలను గుర్తించేవారు. దానికి తగిన తీరులో విధాన నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను లేవనెత్తే వీలే లేకుండా పోయింది. నిరసనలకూ తావు లేకుండా పోయింది. ధర్నా చౌక్ కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇవన్నీ ఈ ‘సుపరిపాలన’లోని వాస్తవాలు. సుపరిపాలనే ఉంటే ప్రజలు నిలదీస్తారనే భయమెందుకు? ముందస్తు అరెస్టుల అవసరమేంటి? ఒక్కసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తే ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, పరిపాలన పట్ల ఎంత అసంతృప్తి ఉన్నదో తెలుస్తుంది. ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది. వారి సమస్యల తీవ్రత ఎంతో బోధపడుతుంది. ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేక స్వరం ఎందుకు వినిపిస్తున్నది? వారు విపక్షాల కార్యకర్తలు కారు గదా! సామాన్య జనానికి గొంతెత్తాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? వీటికి మంత్రి ఏం సమాధానం చెప్తారు?

ఇవన్నీ సుపరిపాలనలో భాగమేనా?

అసలు సమస్యలను వినిపించుకోడానికి అవకాశమే లేదు. సుపరిపాలన పేరుతో ఆ అవసరం లేదంటూ కప్పిపుచ్చుకోవడం ఆత్మవంచనే. ఉద్యోగ వ్యవస్థ, కిందిస్థాయిలో ప్రజా ప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తమ వరకు వస్తున్నదని స్వయంగా మంత్రే వివరణ ఇచ్చారు. ప్రజలకు సమస్యలే లేకపోతే, క్షేత్రస్థాయిలో అన్నీ పరిష్కారం అవుతూ ఉంటే సచివాలయానికి రావాల్సిన అవసరం ఎందుకొస్తున్నది? పాస్‌లు జారీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మంత్రుల్ని, అధికారుల్ని కలిసి ఎందుకు మొరపెట్టుకోవాల్సి వస్తున్నది? వీటికి మంత్రి ఇచ్చే సమాధానమేంటి? సమస్యలన్నీ అధికారుల స్థాయిలో పరిష్కారమవుతున్నది నిజమే అయితే ఆసరా పింఛను మొదలు వివిధ డిపార్టుమెంట్లలో అనుమతుల కోసం దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నట్లు? కోర్టుల్లో పిటిషన్లు ఎందుకు దాఖలవుతున్నట్లు? చివరకు మంచినీళ్ళ కోసం మహిళలు, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతులు, టాయ్‌లెట్ల కోసం విద్యార్థులు, నాణ్యమైన భోజనం కోసం హాస్టల్ పిల్లలు.. ఇలా వివిధ సెక్షన్ల ప్రజలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఆయా స్థాయిల్లోని అధికారులు సమస్యలను నిజంగా పరిష్కరిస్తే వీరికి ఈ అవసరం ఎందుకు ఏర్పడుతున్నది?

అధికారుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదనడానికి నిదర్శనం కాదా? లంచం ఇవ్వకపోతే పనులు కావనేది నిజం కాదా? రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వనందుకు పనులు చేయడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన ఎందుకు చేసినట్లు? ఫ్లెక్సీల కట్టుకుని ప్రజల నుంచి చందాలు ఎందుకు ఆశించినట్లు? లంచాలే లేకపోతే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పట్టుబడుతున్నట్లు? తొమ్మిదేళ్ళలో ఎంతమంది పట్టుబడ్డారో ప్రభుత్వం గణాంకాలు వెలువరించగలదా? సుపరిపాలనలో లంచాలు కూడా భాగమేనా?

సుపరిపాలనను చేతల్లో చూపించండి!

సుపరిపాలన ఉన్నందునే ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని మంత్రి సమర్ధించుకోవచ్చు. అవినీతిరహిత పాలనను అందిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకోవచ్చు. అదే నిజమైతే ప్రజాదర్బార్ అవసరం లేనట్లుగానే ఏసీబీ విభాగం అవసరమూ ఉండదు. అధికారుల సంగతి అలా ఉంచుదాం.. పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో దళితబంధు గురించి ప్రస్తావించిన కేసీఆర్... ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది? అవినీతిరహిత పాలనలో, సుపరిపాలనలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి?

ప్రజాదర్బార్‌లో సమస్యలను విన్నవించుకునే అవకాశం లేకుండా, ధర్నాలకు, నిరసనలకు అనుమతి ఇవ్వకుండా, మంత్రుల పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ సుపరిపాలన గురించి చెప్పుకోవడం అర్థరహితం. అధికార, విపక్ష సభ్యుల మేళవింపే ప్రజాస్వామ్యం అని గతంలో అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ వివరణ ఇచ్చారు. కానీ విపక్షాలకే కాదు మీడియాకు సైతం సచివాలయంలోకి అనుమతి నిరాకరించడం సుపరిపాలనలో భాగమేనా? పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వానికి ఆంక్షల వలయం అవసరమెందుకొస్తున్నట్లు? సుపరిపాలనే నిజమైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు రేషను డీలర్లు, జూనియర్ డాక్టర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, విద్యుత్ శాఖలో ఆర్టిజన్లు విధులను బహిష్కరించి సమ్మె బాట ఎందుకు పడుతున్నారు? వారికి సమస్యలకు ప్రభుత్వం నుంచి పరిష్కారం లేకపోవడంతో సమ్మె చేస్తున్నది నిజం కాదా? సుపరిపాలనలో సమస్యలకు పరిష్కారం దొరకుండా ఉంటుందా? మాటల్లో కాక చేతల్లో సుపరిపాలనను చూపించినప్పుడు మంత్రి చెప్పే వ్యాఖ్యానాలకు అర్థం ఉంటుంది. లేదంటే గజం మిథ్య.. జగం మిథ్య..

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed