అంతరాలు లేని విద్య అందరికీ అందేనా?

by Ravi |   ( Updated:2023-07-12 00:15:36.0  )
అంతరాలు లేని విద్య అందరికీ అందేనా?
X

దేశమైనా అభివృద్ధి చెందిందంటే అక్కడ విద్యాభివృద్ధి ఉన్నట్లే. విద్యా వికాసం తోనే పురోగమన అభివృద్ధి జరుగుతుంది. దేశ ప్రగతికి సాధనం విద్య. ఆ ప్రగతి సాధించిన దేశాలే నేడు అభివృద్ధి పథంలో దూసుకు వెళుతున్నాయి. ఆ దేశాల్లో విద్యకు నిధులు కేటాయించి సమాన విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం మూలంగానే ఇది సులభమైంది. ప్రపంచ దేశాలలో నార్వే ,స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా దేశాలలో అత్యుత్తమ విద్యా విధానం అమల్లో ఉంది. ఆ దేశాల్లో అంతరాలు లేని విద్య.. ప్రజలందరికీ ఒకే రకమైన విద్యను నాణ్యతతో కూడిన గుణాత్మక విద్యను అందిస్తున్నాయి.

భావితరాలు బలయ్యే విద్య!

కానీ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా దేశంలో అంతరాలు లేని విద్య అందరికీ అందుబాటులోకి రాలేదు. రకరకాల విధానాలు, పద్ధతులతో కూడిన విద్య ధనవంతులకు ఒక రకమైన విద్య, పేదలకు ఒక రకమైన ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు మార్చి సమాజ అభివృద్ధికి దోహద పడటం లేదు. సమాజ హితం, సంక్షేమం కోసం విద్యా విధానాలు రాలేదు. ఇప్పటికీ భారతీయ విద్యా విధానం ఫలితాలు ఇవ్వని ప్రయోగం గానే మిగిలిపోయింది. పరిపాలన సౌలభ్యం కోసం వలస పాలకులు మెకాలే విద్యా విధానం అమలు చేస్తే, అధికార మార్పిడి తర్వాత దేశంలో కొంతమేరకు నాణ్యమైన విద్యను అందించేందుకు మొదటి తరం పాలకులు తాపత్రయపడ్డారు. కానీ ఆ తర్వాత ప్రపంచీకరణ జరిగి పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించడంతో విద్యా వ్యాపారంగా మారింది. ఫలితంగా ఎన్నో దురవస్థలు మొదలయ్యాయి. ఈ కార్పొరేట్ విద్య వలన భావితరాల బాల్యాన్ని, వారి అమూల్యమైన జీవితాలను చిదిమేస్తున్నాయి. మార్కెట్లో వస్తువులను ఆకర్షించడానికి వాడే మాయాజాల పద్దతులను విద్యలో ప్రవేశపెట్టి కార్పొరేట్ సంస్థలతో చదివితేనే ఉన్నతంగా స్థిరపడతారు అనే విధంగా వ్యవస్థను రూపొందించి, చదివిస్తే అందులోనే చదివించాలని ప్రజల మనసుల్లో విష బీజాలు మొలకెత్తించారు. దీనికోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి విద్యకు అధికంగా ఖర్చు చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క విద్యార్థులు ఇష్టం లేని చదువులతో, రకరకాల పరీక్షలలో మార్కులు తెచ్చుకోలేక, అటు తల్లిదండ్రుల ఆశయాలు, నమ్మకాలను నిలబెట్టుకోలేక, నిలబెట్టుకోలేమోనని తనువులు చాలిస్తున్న విద్యార్థులు అనేకం. ఇలాంటి విషాద సంఘటనలు లేని రోజులు లేవు. ప్రాణాలను పణంగా పెట్టె ఇలాంటి విద్యా విధానం ఎక్కడ ఉండదు, ఉండకూడదు! భావితరాలు బలయ్యే విధానం ఎందుకు? ఇలాంటి దుర్మార్గపు విధానాన్ని అంతమొందించడానికి పాలకులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. కానీ దేశంలో అలాంటి చర్యలు మచ్చుకైనా కనపడవు.

అందరికీ ఒకే విద్యా విధానం వద్దా?

రాజ్యాంగం ప్రకారం, ఉచిత నిర్బంధ విద్య అందించాల్సిన ప్రభుత్వాలు నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటీకరణ కార్పొరేషన్ విధానాలకు వత్తాసు పలకడం దేశ ప్రగతికి నిరోధం. ప్రభుత్వమే రకరకాల సంస్థల ద్వారా పద్దతుల ద్వారా విద్యను అందించడం అభ్యంతరకరం. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ప్రస్తావనతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలని కోరుకోకపోవడంలో మతలబు ఏమిటి? అమెరికా ఒక్కో విద్యార్థిపై ఏడాదికి పెట్టే ఖర్చు 12 లక్షల 17 వేలు. అదే మనదేశంలో 8297 రూపాయలు మాత్రమే. ఈ విషయం పాలకులకు తెలియంది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల పల్లెల్లో ఉన్న సర్కారు బడులపై శీతకన్ను వేయడం విద్యను పేదలకు దూరం చేయడంలో భాగమే. ఆ పాఠశాలల అభివృద్ధికి పాటుపడకపోవడం సమాన విద్యను సమాన అవకాశాలను అడ్డుకోవడమే.

తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మూడు దశలలో పాఠశాలల అభివృద్ధి చేస్తామని నిధుల విడుదల సరిగ్గా జరకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మధ్యాహ్న భోజనం సంబంధించిన బిల్లులు సరిగ్గా అందించకపోవడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు హాస్పిటల్స్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఎన్నో అనుభవంలో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే అన్ని రకాల విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఆ పోస్టులన్నీ తాత్కాలిక పద్ధతిలో చేపట్టినా, అది సగం సగం చేయడంతో నాణ్యమైన విద్య అందక విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పుస్తకాలు, యూనిఫాం సకాలంలో అందడం లేదు.

ప్రమాదకరంగా నూతన విద్యా విధానం!

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా అనుసరించే విద్యా విధానంపైనే సమాజ ప్రభావం ఉంటుంది. విద్య.. విద్యార్థులను సమాజ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. కానీ మనదేశంలో గత 30 ఏళ్లుగా విద్య ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ బాట పట్టడంతో..పేద వర్గాలకు విద్య దూరమై సామాజిక, ఆర్థిక న్యాయం లోపించే అవకాశం మెండుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం 2020లో కూడా పలు అసమానతలతో కూడిన విధానాలు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు బలం చేకూర్చే విధంగా ఉండడం, సిలబస్ మార్పిడి పేరిట శాస్త్రీయ భావాలను తొలగించడం, దేశ స్వాతంత్రోద్యమంలో తమ ప్రాణాలర్పించి అసువులు బాసిన గాంధీ, భగత్ సింగ్ పాఠాలను తొలగించడం, లౌకిక తత్వాన్ని నిరాకరించడం, ఒక వర్గానికి సంబంధించిన విషయాలను జోడించడం, వృత్తి విద్య అభివృద్ధి పేరిట కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ఉండడం, ఏ స్థాయిలో అయినా మెయిన్ స్ట్రీమ్ నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉండడం మూలంగా డ్రాప్ అవుట్ విధానాన్ని ప్రోత్సహించడం లాంటి ప్రమాదకర అంశాలతో కూడిన నూతన విద్యా విధానం దేశాన్ని వెనక్కి నడిపిస్తుంది. అసమానతలను మరింత తీవ్రతరం చేసే సామ్రాజ్యవాద సంస్కృతిని ఇది పెంపొందింప చేస్తుంది. కనుక ఇప్పటికైనా పాలకులు విద్యా వ్యాపారాన్ని, అన్ని రూపాలలో అరికట్టి ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, అభివృద్ధికి అవసరమైన విద్యా విధానాలను రాజ్యాంగ విలువలపై రూపొందించి కేజీ నుండి పీజీ వరకు, పరిశోధన రంగంలో కూడా సమాన అవకాశాలతో కూడిన సమాన ఉచిత విద్యను అందించి ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో వలె కామన్ స్కూల్ విధానాన్ని నిర్వహించి శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విద్యా విధానాన్ని మానవీయ విలువలు పెంపొందించే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం పాలకవర్గాలపై ఎంతైనా ఉంది, ఏర్పాటు చేయించుకునే అవకాశం ఈ దేశ ప్రజల ప్రజాస్వామిక వాదుల పైన, మేధావులు, విద్యావేత్తలపై పౌర సమాజంపై ఆధారపడి ఉంది.

తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665

Advertisement

Next Story