ఈ ఎన్నికల్లో.. గెలిచింది ప్రజల ఆలోచనలే!

by Ravi |   ( Updated:2024-06-15 00:45:22.0  )
ఈ ఎన్నికల్లో.. గెలిచింది ప్రజల ఆలోచనలే!
X

బీజేపీ పట్ల దేశమంతా ఎంత వ్యతిరేకత కనిపించినప్పటికీ మరోమారు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం వెనుక ఉన్న కారణాలు ఏవైనా, ఎన్నికల ప్రక్రియ మాత్రం పారదర్శకంగా జరిగినట్లు కనిపించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెక్కులరిజం, ఫాసిజంకు మధ్య ఎన్నికలు అన్నట్టే జరిగింది తప్ప ప్రజాస్వామ్యం కోసం జరిగినట్టుగా లేదు. ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజల స్వంత అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయనడంతో అతిశయోక్తి లేదు, రెండు రోజుల సంతోషం కోసం మీడియా, వివిధ సర్వే సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దోహదం చేశాయా? లేక వాళ్ళ అంచనాలకు మించి ప్రజల తీర్పు వచ్చిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఎట్టకేలకు ఎన్నికల ప్రస్థానం ముగిసింది. పోటాపోటీ ప్రచార ఘట్టాలతో, చిత్ర విచిత్రమైన హావభావాలతో కూడిన మాటల యుద్ధంతో, విద్వేషపూరిత ప్రసంగాలతో ఏడు దశల సుదీర్ఘ ప్రణాళికలతో ఎన్నికల నిర్వహణ ముగిసింది. ఇక ప్రసంగాల్లో 400 సీట్లు లక్ష్యంతో దిగిన బీజేపీ అసలు ఉద్దేశం ఏంటి అన్న చర్చ తీవ్రంగా జరగడం, ప్రజాసేవ చేయాలంటే ప్రతిపక్షమే ఉండొద్దని అనుకోవడంలో కారణాలు ఏంటి అనే అంశాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకోవడంలో విజయం సాధించడం, విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం అందరూ చూసిందే తప్ప పెరుగుతున్న ధరల నియంత్రణ, పేదరిక నిర్మూలన, విద్య, ఉపాధి తదితర ప్రజలకు ఉపయోగపడే ప్రస్తావనలు రాకపోవడం శోచనీయం.

లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయా?

ఎన్నికల ప్రచార సమయంలో రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఒకరు, అభద్రతాభావం అంటూ ఇంకొకరు... ఇవన్నీ పరోక్ష బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలే అనిపించాయి తప్ప సేవా రాజకీయాల వలే అనిపించలేదు. ఇకపోతే ఎలక్షన్ కమిషన్‌లో త్రిసభ్య కమిటీలో జ్యుడిషియరీ ప్రమేయం తొలగించిన నుండి మొదలు.. ఏడు దశల ఎన్నికలు అంటూ కొన్ని రాష్ట్రాల్లో అయితే అక్కడున్న మొత్తం సీట్లని ముక్కలుగా చేసి ఒక్కో దశలో కొన్నింటికీ చొప్పున ఒకే రాష్ట్ర ఎన్నికలు ఏడు దశల్లో జరగడం విశేషం, లక్షలాది ఓట్లు గల్లంతైన సంఘటనలు కోకొల్లలు. గెలుపు నీదా - నాదా అన్నట్టే ఉంది కానీ ప్రజల సమస్యలకు స్పందించటం, ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవడం అనేది ఎక్కడా కనపడలేదు. ఎగ్జిట్ పోల్స్‌కు ముందే ఎంతోమంది మేధావులు, అనలిస్టులు సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఫలితాల అంచనాలు ముందే వెల్లడించడం, ఇరుపార్టీల ప్రచార వ్యూహాలకు అనుగుణంగా మార్చుకోవడం లాంటివి ఎన్నో చూశాం ఈ ఎన్నికల్లో!

తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ ఫలితాలు!

ఇక మన తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించడంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవడానికి జగన్ చేసిన పరిపాలన తప్పిదాలు ప్రధానం. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తాను నాకు ఓటేస్తే చాలు అనే గుడ్డి నమ్మకంతో ప్రజల్లోకి వెళ్లడం, రాజధాని విషయంలో అభాసుపాలు కావడం, పోలవరం ముందుకు సాగకపోవడం, ప్రాజెక్టులు లేవు, ఉపాధి లేదు తదితర పలు అంశాలు జగన్ ఓటమికి కారణాలు అని చెప్పవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే లిక్కర్ అంశంలో కవిత జైలు పాలు కావడం, ఫోన్ ట్యాపింగ్ గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లాంటివి బీఆర్ఎస్‌కు ప్రతికూలమం కావడం వల్ల కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది, డిపాజిట్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా వాళ్ల స్వయంకృతాపరాధం.

ఈ లింక్ చేసేది ఎవరు?

ఇక తెలంగాణలో ఓటు శాతం తగ్గడానికి కారణం ఇక్కడ ఉన్న సెటిలర్లు ఆంధ్రలోని తమ స్వంత గ్రామాలకు వెళ్లి అక్కడ ఓటింగులో పాల్గొనడం. ఇది హైదరాబాద్, దాని చుట్టుపక్కల లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన వారిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఒక వ్యక్తి ఒక అసెంబ్లీ ఒకే ఓటు అన్న నియమానికి ఉల్లంఘన జరిగింది. డిజిటల్ ఇండియాగా చెప్పుకునే మనదేశంలో ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్నీ దృష్టిలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసిన ప్రభుత్వం ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోవడం వెనక కారణాలు ప్రభుత్వానికే వదిలేయాలి. గెలుపు ఓటములు ఏ ఎన్నికల్లో అయినా సర్వసాధారణం కానీ రాజకీయంగా మాత్రమే కాకుండా నైతికంగా కూడా గెలిచామా లేదా అన్నది నాయకులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓడినవాళ్లకు ఎలాగూ పాదయాత్ర, బస్సు యాత్ర లాంటివి ఎన్నో ఉన్నాయి, గెలిచిన వాళ్లు ఎలాగూ టైం ఉండదు పైగా పెట్టిన పెట్టుబడి రాబట్టుకునే తంతులో బిజీగా ఉంటారు.

-న్యాలకంటి నారాయణ

93462 00066

Advertisement

Next Story

Most Viewed