- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవ భీతి ఉంటే శుభాల వర్షం!
ఈ విశ్వంలో దేవుడొక్కడేనని మానవాళికి ఇస్లాం సందేశమిచ్చిన మహనీయ ప్రవక్త ముహమ్మద్(స). చెడు అలవాట్లు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు నరకానికి దారి తీస్తాయని శతాబ్దాల క్రితమే ఆయన హెచ్చరించారు. అల్లాహ్‌ను ఆరాధించి, తీర్పు దినానికి భయపడి దైవభీతితో మెలిగే వారికి శుభాలు కలుగుతాయని హితవు పలికారు. ఆయన పుట్టక ముందే తండ్రి మరణించారు. ఏడేళ్ల వయస్సులో తల్లి కూడా కన్నుమూశారు. అమ్మా, నాన్న లేని ఆ బాలుడిని అతడి తాత, బాబా, ధర్మ కర్త, ఖురైష్ తెగ అగ్రనాయకుడైన అబ్దుల్ ముత్తలిబ్ ఏడాది పాటు పెంచారు. అంతలోనే ఆయన మంచాన పడి ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత పెద్ద నాన్న అబూ తాలిబ్ దంపతుల వద్ద పెరిగిన ఆ బాలుడు ముస్లింలు అత్యంత గౌరవాదరణలు, ప్రేమతో స్మరించే ప్రవక్త స్థాయికి ఎదిగారు.
అల్లాహ్.. ప్రవక్తగా నియమించాడని
యుక్త వయస్సులో మేకల కాపరిగా పనిచేసిన ముహమ్మద్ (స) క్రమంగా వర్తకుడి స్థాయికి ఎదిగారు. ఇరవై ఏళ్ల వయస్సులో ఆయన హృదయంలో ఆధ్యాత్మిక చింతన మొదలై నీతి, నిజాయితీలు వెల్లివిరిశాయి. తన సత్ప్రవర్తనతో సిరియాలోని ఉకాజ్ మార్కెట్లో ఆయన వినియోగదారులను ఆకట్టుకునేవారు. ఫలితంగా ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. పాతికేళ్ల ముహమ్మద్ (స) నీతి, నిజాయితీలు నచ్చిన నలభై ఏళ్ల ఖదీజా (రజి) అనే శ్రీమంతురాలు ఆయనను తన వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నారు. ఆయన వల్ల ఆమెకు ఎప్పుడూ రానన్ని లాభాలు వచ్చాయి. వితంతువైన ఆమెకు ముహమ్మద్ (స)ను వివాహ మాడాలనిపించింది. ఆమె ప్రతిపాదనకు ముహమ్మద్ (స) బంధువులు అంగీకరించడంతో వారి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా నలుగురు ఆడ పిల్లలు పుట్టారు. పుట్టిన ఒక్కగానొక్క మగ బిడ్డ పసిప్రాయంలోనే చనిపోయాడు.
ముహమ్మద్ (స) హిరా గుహలో రోజుల తరబడి దైవ చింతనలో గడిపేవారు. రమజాన్ నెలలోని ఒకానొక రాత్రి దైవదూత జిబ్రీల్ (అలై) ఖుర్ఆన్ వాణిని ఆయనతో కంఠస్తం చేయించారు. ఆ ఆధ్యాత్మిక వింత అనుభూతిని ముహమ్మద్ (స) తన భార్యతో పంచుకున్నారు. ఆమె భర్తకు ధైర్యం చెప్పి శుభ ఘడియ వచ్చిందని చెప్పారు. గతంలో దైవ ప్రవక్తల దగ్గరకు వచ్చిన దైవదూతే ముహమ్మద్(స) దగ్గరకు వచ్చారని, ముహమ్మద్‌ను అల్లాహ్ తన ప్రవక్తగా నియమించాడని పండితుల ద్వారా ఖదీజా తెలుసుకున్నారు.
కొండపై నుండి పిలుపు..
అల్లాహ్ సందేశాన్ని ముహమ్మద్ (స) కొన్నాళ్లు తన బంధువులకు, సన్నిహితులకు అందించారు. ఆ తర్వాత ఆ సందేశాన్ని మక్కా ప్రజలందరికీ చేరవేయాలనుకున్నారు. అందుకోసం సఫా కొండపైకి ఎక్కి ‘ఖురైషీయులారా!’ అని పెద్ద కేక వేసి ప్రజల్ని పిలిచారు. ఆయన పిలుపునకు ఉలిక్కిపడిన జనం సఫా కొండ వద్దకు చేరుకున్నారు. ‘ఈ కొండ వెనుక నుంచి శత్రు సైన్యం మక్కాపై దాడి చేయడానికి వస్తోందని నేనంటే మీరు నమ్ముతారా’ అని వారిని ప్రశ్నించారు ముహమ్మద్ (స). తప్పకుండా నమ్ముతామని ప్రజలంతా బదులిచ్చారు. ‘ఆత్మీయులారా! మీ మీదకు ముంచుకొస్తున్న అతి భయంకరమైన విపత్తు గురించి హెచ్చరిస్తున్నాను. ఈ కొండకు ఆవల ఉన్నదాన్ని నేను ఎలా చూస్తున్నానో అలాగే ఈ విపత్తును కూడా చూస్తున్నాను. సోదరులారా.. చెడుకు దూరంగా ఉండి, నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దైవాగ్రహం నుండి తప్పించుకోండి. దేవుడొక్కడే అని నమ్మండి. నన్ను అల్లాహ్ ప్రవక్తగా విశ్వసించండి’ అని హితోపదేశం చేశారు. ఈ మాటలతో ఆయన ప్రవక్తగా మారి తన సందేశాలకు శ్రీకారం చుట్టారు. ముహమ్మద్(స) సందేశాలకు నాటి నుంచి నేటి వరకు చాలామంది ఆకర్షితులయ్యారు. ముహమ్మద్(స) కేవలం ఒక్క ముస్లిములకే కాదు సర్వ మానవాళి కోసం ప్రభవించిన దైవ ప్రవక్త అని గ్రహించారు.
(నేడు మీలాద్-ఉన్-నబీ)
ముహమ్మద్ ముజాహిద్,
96406 22076
- Tags
- Milad un Nabi