అధికారమే నియంతృత్వమైతే... కుప్పగూల్చడం ఖాయం

by Ravi |   ( Updated:2024-02-28 01:15:23.0  )
అధికారమే నియంతృత్వమైతే... కుప్పగూల్చడం ఖాయం
X

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చట్టబద్ధ పద్ధతిలో శాంతియుతంగా పోరాడుతున్న పంజాబ్, హర్యానా రైతాంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం చర్చించి పరిష్కారం చేయకుండా ట్రెంచ్‌లు, బంకర్లు, డ్రోన్లు, బుల్లెట్లతో సమాధానం ఇస్తూ టెర్రరిస్ట్ విధానాలతో కూడుకున్న యుద్ధ బీభత్సం కొనసాగిస్తున్నది.

బీజేపీ పరిపాలన సంపూర్ణంగా కార్పొరేట్ ప్రయోజనాలకే కట్టుబడి రైతాంగం, కార్మిక వర్గం, ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారస్తులను దోపిడీకి, అన్యాయానికి అణిచివేతకు గురిచేస్తున్నది. పైగా భారత రాజ్యాంగ అవగాహనకు భిన్నంగా సెక్యులర్ విధానం నాశనం చేసి మత ఉన్మాద రాజకీయాలు కొనసాగిస్తుంది.

మోడీ ప్రధాని అయ్యాక…

బీజేపీ ప్రజాస్వామ్యం అనేది లేకుండా.. మత ఉన్మాదమే ఎజెండాగా, ప్రజలను విభజనకు గురిచేస్తూ, ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెట్టి కార్పొరేట్ బూర్జువా వర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ప్రశ్నించే ప్రజలను, ఉద్యమకారులను, రచయితలను జర్నలిస్టులను అణిచివేయడం చేస్తుంది. అలాగే బీజేపీకి వ్యతిరేకమైన ప్రతిపక్షాలను సైతం అనేక సాకులతో ఐటీ, ఈడీ దాడులతో వేధింపులకు గురి చేస్తున్నది. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతున్నది. మత మైనార్టీలు, ఆదివాసీలు, దళితులు, మహిళలు బీజేపీ పాలనలో తీవ్ర వివక్షకు గురి అవుతున్నారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ ప్రభుత్వం కొనసాగించిన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాలు దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. గత 9 ఏండ్లకు పైగా కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక విధానాలు, మత రాజకీయాలు, నియంతృత్వ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్ట్‌లు తీవ్రంగా విమర్శిస్తూ సేవ్ డెమోక్రసీ అంటూ వివిధ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఈ నియంతృత్వం భయానకం

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోరాడటం దేశంలో కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈ 76 యేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కమ్యునిస్ట్‌లు ప్రజాస్వామిక వాదులు వివిధ సందర్భాలలో పోరాడిన చరిత్ర విస్తారంగానే వున్నది. దున్నేవానికే భూమి నినాదంతో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాడుతున్న వేలాది రైతాంగ ఉద్యమకారులను హత్య చేయడం నక్సల్‌బరి శ్రీకాకుళ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయడం, పత్రికా, సభా స్వాతంత్ర్యాలు కాలరాస్తూ ఎమర్జెన్సీ ద్వారా ఫాసిస్ట్ నియంతృత్వ పాలన కొనసాగడం లాంటి విధానాలను దేశం చవిచూసింది. దాని ఫలితమే ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ పార్టీలోని వాజ్ పేయి ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక నిరంకుశ మతతత్వ రాజకీయాలకు, నేడు కొనసాగుతున్న మోడీ అనుసరిస్తున్న మత ఉన్మాదంతో కూడుకున్న అప్రజాస్వామ్య నిరంకుశ విధానాలకు చాలా తేడాలు ఉన్నాయి. ఇందిర గాంధీ అనుసరించింది ఫాసిజం అయినప్పటికీ నేడు మోడీ నాయకత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పాలన మరింత తీవ్రమైనదిగా భయానకమైనదిగా మారింది. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య రక్షణ కోసం కమ్యూనిస్టులు ప్రజాస్వామిక వాదులు ఐక్యంగా ఉద్యమించడం అవసరమైంది.

వారి విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన..

అప్రజాస్వామిక నియంతృత్వ విధానాల మూలంగా పాలక వర్గాలలో భాగమైన ప్రతిపక్ష పార్టీలు సైతం ఆర్థిక రాజకీయ నష్టాలకు గురి అవుతారు. పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తూ ప్రజాస్వామ్యం, సమానత్వంపై కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్య పెడతాయి. వీరి లక్ష్యం తాము అధికారంలోకి రావడమే. అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుక ముందు కొద్ది మార్పులతో నియంతృత్వ దోపిడీ విధానాలు కొనసాగిస్తారని చరిత్ర అనేక దఫాలుగా రుజువు చేసింది.

కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన అనేక ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు సైతం అవినీతి నియంతృత్వ అప్రజాస్వామ్య విధానాలు అవలంబించడం ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు గురై ఎన్నికల్లో ఓడిపోయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. దేశంలో వివిధ ప్రభుత్వాలు పాల్పడే అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడం, ఎన్నికల్లో ఓడించడం సాధారణంగా జరుగుతున్నదే. ఈ పరిస్థితి ఏదో ఒకనాడు బీజేపీ ప్రభుత్వం మట్టి కరవక తప్పనిసరి పరిస్థితి పెరుగుతున్నది.

ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం

బీజేపీ అప్రజాస్వామిక నియంతృత్వ ఫాసిస్టు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన విధంగానే వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వాలు కొనసాగించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అప్రజాస్వామ్య నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటం ప్రజల కర్తవ్యం. నియంతృత్వ విధానాలు అయినా, ఫాసిస్ట్ విధానాలు అయినా కార్పొరేట్ ప్రయోజనాలు నేరవెర్చుతూ, శ్రామిక ప్రజలను దోపిడీ చేస్తూ, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే జరుగుతుంది. అప్రజాస్వామ్య నిరంకుశ విధానాలు ఎవరు ఏ స్థాయిలో కొనసాగిస్తే ఆ మోతాదులో తప్పనిసరిగా పోరాడటం ప్రజల హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడటం అంటే వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తులను బట్టి కాకుండా ప్రతి బూర్జువా పార్టీ కొనసాగించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడాలి.

జంపన్న

(మార్క్సిస్టు లెనినిస్టు నాయకుడు)

76710 97524

Advertisement

Next Story